బిగ్ బ్రేకింగ్ : ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన లింగయ్య
టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నకిరేకల్ మాజీ ఎంఎల్ఏ చిరుమర్తి లింగయ్య(Chirumarti Lingaiah) విచారణకు హాజరయ్యారు.
తెలంగాణాలో సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నకిరేకల్ మాజీ ఎంఎల్ఏ చిరుమర్తి లింగయ్య(Chirumarti Lingaiah) విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్(Jublee Hills) లోని సిట్(Sit) ఆఫీసుకు విచారణ కోసం హాజరైన మొదటి ప్రజాప్రతినిధి చిరుమర్తే. ఇప్పటివరకు ట్యాపింగ్ కేసులో నలుగురు పోలీసు అధికారులు అరెస్టయిన విషయం తెలిసిందే. అరెస్టయిన పోలీసు అధికారులు సిట్ విచారణలో అనేక కీలకమైన విషయాలను బయటపెట్టారు. పోలీసు అధికారులు భుజంగరావు, తిరుపతయ్య, ప్రవీణ్ రావు, రాధాకిషన్ లు చెప్పిన వివరాల్లో కీలకమైనది ఏమిటంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ)(SIB) చీఫ్ గా పనిచేసిన టీ ప్రభాకరరావు(T Prabhakar Rao) ఆదేశాల ప్రకారమే తాము వేలాదిమంది మొబైల్ ఫోన్లను ట్యాపింగ్(Telephone Tapping) చేసినట్లు చెప్పటం. బీఆర్ఎస్(BRS) పదేళ్ళ పాలనలో వేలాది ఫోన్లను ట్యాపింగ్ చేసిన విషయం బయటపడటం సంచలనం సృష్టించింది.
ప్రభాకరరావు ఆదేశించారని వీళ్ళంతా వేలాదిమంది మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేశారు బాగానే ఉంది. మరి నెంబర్లు ఇచ్చి పలానా వాళ్ళ మొబైల్ ఫోన్లను ట్యాప్ చేయమని ప్రభాకరరావును ఆదేశించింది ఎవరు ? ఎవరు ఆదేశిస్తే ప్రభాకరరావు చట్టవిరుద్ధమైన పనులను యధేచ్చగా చేయించారు ? అన్నది తేలాలి. ఇది తేలాలంటే హైదరాబాద్ నుండి అమెరికా(America)కు పారిపోయిన ప్రభాకరరావు దొరకాలి. మాజీ చీఫును పోలీసులు హైదరాబాదుకు పిలిపించి అరెస్టు చేసి విచారణ చేస్తేకాని కీలకమైన సూత్రదారుడు ఎవరన్న విషయం తేలదు. మంత్రులైతే ట్యాపింగ్ సూత్రదారులు కేసీఆర్, కేటీఆర్ కాబట్టి వెంటనే అరెస్టుచేయాల్సిందే అని డిమాండ్లు చేస్తున్నారు. అయితే స్పష్టమైన ఆధారాలు లేకుండా ఎవరినీ అరెస్టులు చేయలేరు కాబట్టి సిట్ అధికారులు ప్రొసీజర్ ఫాలోఅవుతున్నారు.
ఇందులో భాగంగానే తిరుపతయ్య(Tirupatayya) ఫోన్ ను విశ్లేషించినపుడు చిరుమర్తి లింగయ్య వ్యవహారం బయటపడింది. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల సమయంలో ఇద్దరి మొబైల్ నెంబర్లు లింగయ్య ఇచ్చి ట్యాపింగ్ చేయమని తిరుపతయ్యకు చెప్పారని బయటపడింది. ఈ విషయాన్ని రిమాండులో ఉన్న తిరుపతయ్యే చెప్పారు. తిరుపతయ్య వాగ్మూలం ఆధారంగానే సిట్ అధికారులు మాజీ ఎంఎల్ఏ చిరుమర్తి లింగయ్యను విచారిస్తున్నారు. విచారణలో లింగయ్య ఏమి చెబుతారనే విషయాలపై అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది.
లింగయ్య మీడియాతో మాట్లాడుతు తాను ఎవరి ఫోన్లను ట్యాప్ చేయమని ఎవరినీ అడగలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము పోరాటాలు చేస్తున్నాము కాబట్టి అక్రమ కేసులు పెట్టి ఇరికిస్తున్నట్లు ఆరోపించారు. తాను పోలీసు అధికారులతో అనేక సందర్భాల్లో మాట్లాడానని చెప్పారు. తిరుపతయ్యకు కూడా ఫోన్ చేసుంటానని అయితే అప్పుడు ఏమి మాట్లాడాననే విషయం ఇపుడు గుర్తులేదన్నారు. తమ దగ్గరకు వచ్చే జనాల అవసరాల కోసం ఎంతోమందికి ఫోన్లు చేస్తుంటాను కాబట్టి ఆ విషయాలన్నీ ఎలా గుర్తుపెట్టుకోగలను ? అని ఎదురు ప్రశ్నించారు. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని మాజీ ఎంఎల్ఏలు బొల్లం మల్లయ్యతో పాటు మరో మాజీ ఎంఎల్ఏకి కూడా సిట్ నోటీసులు జారీచేసింది.