వైద్య విద్యార్థులకు స్థానికత కంపల్సరీ: సుప్రీం
హైకోర్టు తీర్పులను పక్కన పెడుతూ సంచలనతీర్పు;
తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత( local status)కంపల్సరీ అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను సుప్రీంకోర్టు సమర్దించింది. గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెడుతూ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది.
తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థుల స్థానికత అంశంపై చాలా కాలంగా పలు వివాదాలు ఉన్నాయి. తాజాగా తెలంగాణలో వైద్య విద్య చదివాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ళ స్థానికత అనేది తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
స్థానికత అనేది ఒక విద్యార్థికి రాష్ట్రంలో వైద్య విద్య ప్రవేశాలకు అర్హత కలిగించే
నిబంధన.
తెలంగాణకు చెందిన పేద, మధ్య తరగతి విద్యార్థుల ప్రయోజనం కోసమే ప్రభుత్వం స్థానికత అంశాన్ని తీసుకొచ్చిందని అంతకు ముందు ప్రభుత్వం తరపున న్యాయవాది స్పష్టం చేశారు. సంపన్న విద్యార్థులు లండన్, దుబాయ్ సహా ఇతర విదేశాలకు వెళ్లి 11, 12వ తరగతి వరకు చదువుకుంటారు. వారికి ఎక్కడైనా సులభంగా మెడికల్ సీట్లు పొందడానికి వీలు ఉంది. తెలంగాణ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని స్థానికత నిబంధనను తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి) ప్రకారమే తాము తెచ్చిన జీవో ఉందని ప్రభుత్వం వాదించింది.
సివిల్ సర్వీసెస్ తదితర ఉద్యోగాల్లో భాగంగా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్ ఫర్ అవుతున్నారని, అలాంటి వారి తెలంగాణ పిల్లలకు మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. లక్షలాది మంది తెలంగాణ స్థానిక విద్యార్థుల దృష్టి కోణంతో ఆలోచించాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అసోం, హరియాణా రాష్ట్రాలలో స్థానికత కేసుల్లో తీర్పులను ప్రభుత్వ న్యాయవాది ప్రస్తావించారు. స్థానిక పాఠశాలలో కంపల్సరీగా 10, 11, 12 చదవాలని హరియాణా నిబంధనలు చెబుతున్నాయి. అసోంలో 7 నుంచి12 వరకు స్థానికంగా చదివితేనే మెడికల్ అర్హత పరీక్షకు అనుమతిస్తున్నారని ప్రభుత్వం, కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.పక్కనే ఉన్న ఏపీలోనూ స్థానికత అమలవుతోందని వెల్లడించింది. తెలంగాణ విద్యార్థికి కూడా ఏపీలో అవకాశం కల్పించడం లేదని ధర్మాసనం దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లింది. మెడికల్ సీట్లు ఖర్చుతో కూడుకున్నవని, పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువ డబ్బులు వెచ్చించే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో బలంగా వాదించింది. స్థానికత పూర్తి స్థాయిలో వర్తిస్తేనే రాష్ట్రంలోని విద్యార్థులకు తగిన న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లింది.