రేవంత్ అనుకున్నా కష్టమేనా ?

రాబోయే సెప్టెంబర్లో స్ధానిక ఎన్నికలు జరపబోతున్నట్లు రేవంత్ రెడ్డి ఈమధ్యనే ప్రకటించారు. గ్రౌండ్ రియాలిటి ప్రకారం సెప్టెంబర్లో జరిగే అవకాశాలు కనబడటంలేదు.

Update: 2024-08-08 06:30 GMT
Revanth

రాబోయే సెప్టెంబర్లో స్ధానిక ఎన్నికలు జరపబోతున్నట్లు రేవంత్ రెడ్డి ఈమధ్యనే ప్రకటించారు. అయితే గ్రౌండ్ రియాలిటి ప్రకారం సెప్టెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనబడటంలేదు. ఎందుకంటే స్ధానిక ఎన్నికలు జరపాలంటే చాలా అడ్డంకులు కనబడుతున్నాయి. బీసీ గణన జరగకపోవటం, ఎస్సీ వర్గీకరణకు సుప్రింకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, కులగణన జరగకపోవటం లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే రేవంత్ సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారా లేదా అన్న విషయం తెలీదు.

సెప్టెంబర్లో ఎన్నికలని రేవంత్ ప్రకటించినపుడు ఎస్సీ వర్గీకరణకు సుప్రింకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కాబట్టి ఈ విషయాన్ని పక్కనపెట్టేసినా కులగణన, బీసీ గణన, రిజర్వేషన్ సమస్యలు చాలా తీవ్రమైనవనే చెప్పాలి. పోయిన ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు సంబంధించి కాంగ్రెస్ కీలకమైన హామీ ఇచ్చింది. అదేమిటంటే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీసీలకు ఇపుడున్న రిజర్వేషన్ను 21 శాతం నుండి 42 శాతంకు పెంచుతామని. రిజర్వేషన్ పెంచటం అన్నది బీసీ జనాభా ఎంతో లెక్కలు తీయకుండా సాధ్యంకాదు. బీసీ గణన అన్నది ఎలాపడితే అలా జరిగేది కాదు. దాన్ని బీసీ కమిషన్ ఆధ్వర్యంలోనే చేయాలి. లేకపోతే ఆ గణనకు విలువుండదు. అయితే బీసీ కమిషన్ గడువు నెలరోజుల్లో పూర్తయిపోతోంది. కాబట్టి ఈ నెలలో బీసీ కమిషన్ పొడిగింపు సాధ్యంకాదు.

బీసీ కమిషన్ నియమించిన తర్వాతే బీసీ గణన మొదలుపెట్టాలి. బీసీ గణన అంటే అందుకు చాలాకాలం పడుతుంది. బీసీ జనాభా ఎంతో తేల్చి దానికి రిజర్వేషన్ను 42 శాతంకు పెంచిన తర్వాతే ఎన్నికలు జరపాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో బీసీ గణన పేరుతో స్ధానిక ఎన్నికలను వాయిదా వేయకూడదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇపుడున్న రిజర్వేషన్ ప్రకారమే స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ విషయంలో రేవంత్ నిర్ణయం ఏమిటో చూడాలి. సెప్టెంబర్లోనే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్ధసారధి రిటైర్ అవుతున్నారు.

ఇదే సమయంలో ఎస్సీ వర్గీకరణకు సుప్రింకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణ ప్రకారం తమకు ఎక్కువ అవకాశాలు దక్కాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) డిమాండ్ చేస్తోంది. దీనిపై మాలలు గుర్రుమంటున్నారు. ఈ విషయాన్ని రేవంత్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. అలాగే కులగణన జరిగి చాలా కాలమైంది. కులగణన జరగకుండా స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు లేదని అగ్రకులాల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ఏ రకంగా చూసుకున్నా అంటే కులగణన, బీసీ గణన చేసేందుకు చాలా కాలం పడుతుంది. ఈ లెక్కన రేవంత్ చెప్పినట్లుగా సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించటం అంత వీజీకాదు. అందుకనే ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్ల జాబితాల ఆధారంగానే స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ పర్యటన నుండి తిరిగివచ్చిన తర్వాత పై విషయాలపై రేవంత్ ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News