బ్రతికుండగానే మార్చురీకి తరలింపు
మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో అమానుషం
రోగి బ్రతికుండగానే మార్చురీకి తరలించిన అమానుష ఘటన తెలంగాణ మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో వెలుగు చూసింది. చిన్న గూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన వి. రవి మూత్ర పిండాల వ్యాధితో ఆస్పత్రికి మూడు రోజుల క్రితం వచ్చాడు. ఆధార్ కార్డు లేని దృష్ట్యా వైద్యం చేయడానికి వైద్యులు నిరాకరించారు. పేదలకు వైద్యం అందించాల్సిన ప్రభుత్వాసుపత్రిలోనే రోగిని ఆస్పత్రిలో రాకుండా సిబ్బంది అడ్డుకున్నారు. రవి వెంట తోడు కూడా ఎవరూ లేరు. మూడు రోజులుగా ఆస్పత్రి ఎదుట పడిగాపులు కాస్తున్నా సిబ్బంది కనికరించలేదు. ఆహార పానీయాలు లేకపోవడం, కిడ్నీ పేషెంట్ కావడంతో రవి స్పృహ తప్పి పడిపోయాడు. రవి చనిపోయాడనుకుని ఆసుపత్రి సిబ్బంది మార్చురికి తరలించారు. గురువారం మార్చురీ శుభ్రపరచడానికి వచ్చిన సిబ్బంది కి రవిలో కదలిక కనిపించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంటనే మార్చురీకి చేరుకుని అక్కడి నుంచి చికిత్స నిమిత్తం రవిని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య సేవలు చేయిస్తున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగిని మార్చురీకి తరలించడం ఆస్పత్రి నిర్లక్ష్యమేనని స్పష్టంగా కనబడుతోంది. బాద్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.