పండ్ల ట్రేలలో గంజాయి పొట్లాలు
బాటసింగారం వద్ద డిసిఎం వ్యానులో భారీగా పట్టుబడ్డ గంజాయి;
రాచకొండ, ఖమ్మం ఈగల్ టీం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీ గంజాయి పట్టుబడింది.
రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద పెద్ద ఎత్తున గంజాయి ఉన్నట్టు ఖమ్మం ఈగల్ టీంకు సమాచారం వచ్చింది. వెంటనే రాచకొండపోలీసులను ఖమ్మం ఈగల్ టీం అప్రమత్తం చేసింది. రాచకొండపోలీసులు, ఖమ్మం ఈగల్ టీం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 935 కిలోల గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని 455 ప్యాకెట్లుగా విభజించి పండ్ల ట్రేలల్లో దాచిపెట్టారు. ఆ ట్రేలను డీసీఎం వ్యానులో ఎక్కించి మహరాష్ట్రకు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు అంతర్‌రాష్ట్ర నిందితులను కూడా అరెస్టు చేసినట్లు చెప్పారు.
తెలంగాణ డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవలికాలంలో దాడులు చేస్తూ పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటున్నారు. తాజా ఘటనలో పండ్లు తరలించే ట్రేలలో గంజాయి పొట్లాలు దొరకడం సంచలనమైంది.