తెలంగాణ ఒక ఆరిపోని నిప్పు కణిక....

మొదటినుండి తెలంగాణలో జరిగిన ఉద్యమాలన్నీ కూడా కూడా భూమి చుట్టూరనే తిరిగాయి.;

Update: 2025-09-17 02:21 GMT
తెలంగాణ ఉద్యమం (ఫైల్ ఫోటో)

1948 సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ భారత ప్రభుత్వంలో విలీనమైనప్పటికీ ప్రజలు అనేక అసంతృప్తులకు గురి అయ్యారు . ఆసనాల కారణంగా తెలంగాణ ప్రజలు అవసరం అవకాశం వచ్చినప్పుడల్లా తమ అభిప్రాయాన్ని ఉద్యమాల ద్వారా చెప్పకనే చెప్తూనే ఉన్నారు. అందువలన తెలంగాణ ఇప్పటికీ ఒక ఆరిపోని నిప్పు కణికలా జాజ్వల్యమానంగా అలవారుతున్నది.


పదేపదే తెలంగాణలో ఏదో ఒక రూపంలో ఉద్యమ పోరాటాలు పునరుజ్జీవనం పొందుతున్నాయి.. మిగిల్చిన చేదు ఫలితాల మూలంగా పెనం మీంచి అణగారిన ప్రజల బతుకులు పొయ్యిలో పడ్డట్టు అయిపోతూనేవున్నాయి.

నిజాం నిరంకుశ పాలన తెలంగాణలో 1724 నుండి 1948 సెప్టెంబర్ 16 వరకు కొనసాగింది. రెండు శతాబ్దాల కాలం పైగా తెలంగాణ నిజాం ఉక్కు కౌగిలిలో నలిగిపోయింది. అంటే నిజాం పాలనలో పని చేసిన ఆయన తాబేదార్లు అయిన జమీందారుల,జాగీర్దారుల, భూస్వాముల, దొరల గడీల యొక్క దాస్టికాలు వెట్టిచాకిరి బానిస భావజాలం గిట్టల కింద సామాన్యులు విపరీతమైన శారీరక మానసిక లైంగిక దోపిడీ అణచివేతలకు హత్యలకు అరాచకాలకు లోనయ్యారు. మరో విధంగా చెప్పాలంటే ఫాసిస్ట్ రాజకీయ వ్యవస్థలోని ఫ్యూడల్ భూస్వాములు ప్రజలను పీల్చివిప్పి చేశారు.

అంతవరకు నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల సాయుధ పోరాటం ,కాంగ్రెస్ , ఆర్య సమాజ్ ప్రజా ఉద్యమాల కారణంగా నాటి రాజు వారి తాబేదారులు ఒక్కరి బిక్కిరి అయ్యారు. ఇది ఇలా ఉండగా, మిగతా భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వేచ్ఛ స్వాతంత్ర్యలు వచ్చినాయి. కానీ భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరున సెప్టెంబర్ 13 నుండి 17 వరకు తెలంగాణ మీద జరిగిన పోలీస్ చర్య వలన ఏడవ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారతదేశ ప్రథమ గృహ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు లొంగిపోవడంతో నిజాం పతాకం దీర్ఘ చతురస్రాకార పచ్చని జెండా మధ్యన "అల్లాహ్ " అని రాసి ఉండే జెండా అవునతం అయిపోయి,దాని స్థానంలో భారతదేశ జాతీయజెండా ఎగిరేయడం జరిగినది. దీనితో నిజాం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయింది. అంతేగాక అంతవరకు బ్రిటిష్ సామంత రాజుగా చలామణి అయిన నిజాం రాజు కూడా తాను నేటి నుంచి స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు.

అయితే తెలంగాణ ఇండియా యూనియన్ లో కలిసిన రోజును ఆయా రాజకీయ పార్టీలు తమ భావజాలాల కనుకూలంగా విభిన్న వాదనలు తెరమీదికి తీసుకొచ్చారు. కొందరు విలీనం జరిగిందంటే మరికొందరు విమోచనం జరిగిందని ఇంకా కొందరు విముక్తి పొందినదని ఒక ఎడతెగని చర్చను కొనసాగిస్తూ ఇప్పటికీ సజీవం చేస్తూవస్తున్నారు. ఏ చర్చ ఎలా ఉన్నా ఇప్పటికీ తెలంగాణ రైతుల, కౌలు రైతుల రైతు కూలీలు సామాన్య ప్రజల జీవితాలు మళ్లీ మొదటికి వచ్చాయి. రాజకీయ ప్రయోజనాలను ఆశించి పార్టీలు ఈ విలీనం ప్రక్రియను రకరకాలుగా విశ్లేషించడం వలన ఉత్తర మీమాంస మిగిలిపోవడం యాదృచ్ఛికమేమీ కాదు .

ఆపరేషన్ పోలో పేరున భారత సైన్యం తెలంగాణలో సాగించిన ఆకృత్యాలు ఇప్పటికీ తెలంగాణ బడుగు వర్గాల అంతరంగాల మీద గాయాల మాయని మచ్చగా మిగిలిపోయే ఉన్నాయి. అందువలన ప్రజాస్వామ్యంలో పాలక పార్టీలు ఈరోజును తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన ఉత్సవంగా ఏటేటా సంబురాలు జరుపుకుంటున్నాయి.

తెలంగాణలో 1946 నుంచి 1951 వరకు భారత ప్రభుత్వం నియమించిన సైనిక అధికారి వెల్లోడి ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణ కొనసాగినది . అనంతరం జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర తొలిముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణ రావు ఎన్నికయ్యారు. ఆయన 1956 అక్టోబర్ 30 వరకు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు పాలన అందించారు. తెలంగాణ తొలి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ ఏక పక్షంగా పోరాట విరమణ చేయడం ద్వారా తను వేలాది మిలిటెంట్ కార్యకర్తలను పెద్ద మొత్తంలో కోల్పోయినది. అంతేగాకుండా రజాకార్ల పేరున ప్రైవేటు గుండాల సైన్యాన్ని ఇండియన్ ఆర్మీ మట్టు పెట్టింది.

ఒకవైపు నెహ్రు సోషలిజం భ్రమలలో వామపక్షాలు మునిగి గాలిలో తేలిపోయాయి.మరోవైపు అధికార పార్టీ పవర్ పాలిటిక్స్ పొత్తుల చదరంగంలో తన తేజం కొడి కట్టుకుపోయినది . దీనిని భారత రాజకీయ విశ్లేషకులు వావపక్ష పార్టీల ఆత్మహత్యా సదృశ్యంగా వర్ణిస్తుంటారు. అనంతర భారతదేశంలో కార్మిక కర్షకుల నిరుపేద ప్రజల సమస్యలపై ఉద్యమాలు నిర్మించడంలో కమ్యూనిస్టు పార్టీలు ఎత్తుగడలు వేయడంలో వ్యూహరచనలు చేయడంలో ఒక విధంగా విఫలం చెందాయి. దీనికి తోడు కమ్యూనిస్టు పార్టీ నాయకుల మధ్య పొడచూపిన ప్రాథమిక విభేదాల కారణంగా ఆ పార్టీ అనేక వర్గాలుగా చీలి పోయింది .

ఫజల్ అలీ అధ్యక్షతన ఏర్పడిన కమిషన్ రెండు సంవత్సరాల తర్వాత రాష్ట్రాల పునర్విభజన నివేదిక ప్రకారం పార్లమెంట్లో చట్టం చేయడంతో దేశంలో భాషా ప్రయోక్త రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల సరిహద్దులు ఏర్పడినాయి. అందులో భాగంగా తెలుగు మాట్లాడే ప్రజలందరినీ భాష పేరున అంతవరకు మద్రాసు రాష్ట్ర నుంచి వేరుబడిన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోని మరాఠీ కన్నడ మాట్లాడే జిల్లాలను మహారాష్ట్ర కర్ణాటకలో కలిపి,మిగిలిన తెలంగాణ జిల్లాలలో అప్పటికే మద్రాసు నుండి విడివడిన ఆంధ్ర రాష్ట్రం కలియడం వలన 1956 నవంబర్ 1 నాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా అవతరించినది.

నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తూ ఆంధ్ర గడసరి పిల్లవానితో అమాకురాలు అయిన తెలంగాణ ఆడపిల్లను కలపినామని అన్నారు. అరవైపు తెలంగాణ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు విలీనం ఒప్పందం పైన సంతకం చేసి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నట్లయిందని తన బాధను వ్యక్తపరిచాడు సరిగ్గా నెహ్రూ భయపడినట్లే 1956 నవంబర్ 1 నుంచి 1968 వరకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రక్షణల భద్రతలను పాలకులు తుంగలో తొక్కారు. తెలంగాణ ప్రాంతానికి అభద్రత అరక్షణ ఏర్పడినది. ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అది 1969 నుండి తెలంగాణ కాంక్ష నివురు కప్పిన నిప్పులా వున్న అసంతృప్తి ఉవ్వెత్తున ఎగిసి పడిన ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైన అణచివేసింది. ఈ అంచవేతలో 369 మంది విద్యార్థులు పోలీసు కాల్పులకు బలి అయ్యారు. ఈ ఉద్యమం క్రమంగా ఒక రాజకీయ మలుపు తిరిగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కాంక్ష గా రూపుదిద్దుకుంది.

తెలంగాణ ఉద్యమం ఫలితంగా 1973 ఆరు సూత్రాల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాల పథకాన్ని 1973 ఏర్పాటు చేసింది. ఈ ఆరు సూత్రాల ప్రకారం ఉద్యోగుల నియామకాల్లో ఉల్లంఘనలు 1985లో ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అయితే ప్రభుత్వం 2001లో ఉద్యోగ నియామకాలలో అవకతవకలపై గిర్ గ్లాని కమిషన్ ఏర్పాటు చేసినది. కానీ ఆ నివేదిక సూచించిన సూచనలను ప్రభుత్వం అమలు చేయకపోవడం వలన తిరిగి తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రజలలో విస్తారంగా వ్యాపించినది. దీనికి తోడు 1996 వరకు వివిధ విభాగాలలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను తెలంగాణ మేధావులు గణాంకాలతో పాటు సేకరించి పుస్తకంగా కరపత్రాలుగా ప్రచురించి ప్రజలలో ప్రజలను తెలంగాణ కాంక్ష బీజాలను బలంగా నాటారు.

ఇది నీకు తోడు అప్పటికే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు నుండి పట్టణాలకు నగరాలకు తరిమివేసిన భూస్వామ్య వర్గాలు కపటము కడుపు లోపల పెట్టుకొని ఇదే అదునుగా గ్రహించి అవకాశంగా భావించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తలకెత్తుకొని కొనసాగించారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తమ సామాజిక వర్గం నాయకత్వంలోకి రావడం దుర్లభమని ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతోనే అది సాధ్యమవుతుందని లోపాయికారిగా ఈ వర్గం సమాలోచన చేసి ఉద్యమంలో పాల్గొన్నది.

మళ్లీ నాయకత్వం వహించిన వారి ఎత్తుగడల స్వార్థ వ్యూహాల కారణాల వలన తెలంగాణ మలిదశ ఉద్యమంలో 1200 మంది యువకులకు పైగా తమ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ స్వచ్ఛంద ఆత్మహత్య సంఘటనలను విషయాలను గమనంలోకి తీసుకొని రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది .

అవకాశం కోసం ఎదురుచూసిన సామాజిక వర్గ నాయకత్వం అధికారంలోకి రాగానే మళ్లీ ప్రజల కాంక్షలను స్వతహాగా తమ నాయకుని మిగతా కుటుంబ సభ్యుల వ్యక్తిత్వంలో దాగిన మోసపు లక్షణాలు అధికారం చేపట్టగానే ఒక్కసారిగా పుట్టలోంచి బయటకు బుస కొట్టి బయటకు వచ్చి వీరవిహారం చేసినది.

పాలకుల విధానాల వల్ల తెలంగాణ ప్రజలు మళ్లీ తీవ్ర నిరాశ నిస్పులకు లోనయ్యారు. ప్రజలు అవకాశం రాగానే పాలన మీది అసంతృప్తిని ఓట్ల రూపంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు పార్టీకి పట్టం కట్టింది.

దఫ దఫాలుగా పాలకులు తెలంగాణ ప్రజలకు చేసిన మోసాలు అన్యాయాలు అవినీతి అక్రమాలు బంధుప్రీతి కారణాల వలన తెలంగాణ నేల త్యాగాల నెత్తుటితో తడిసి పచ్చి పుండులా మిగిలిపోయింది. ప్రజలు నివురు గప్పిన నిప్పులా తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా మండలానికి సిద్ధంగా ఉన్నారు .

మొదటినుండి తెలంగాణలో జరిగిన ఉద్యమాలన్నీ కూడా కూడా భూమి చుట్టూరనే తిరిగాయి. నేల ఇరుసుగా జరిగాయి. తిరిగి తిరిగి పాలకవర్గాల కుట్రల వలన మొదటి సాయుధ పోరాటంలో పంచిన పది లక్షల ఎకరాల భూమి తిరిగి భూస్వాముల హస్తగతమైంది . మళ్లీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటం లో పేద ప్రజలకు పంచిన భూమి తిరిగి ప్రభుత్వం పెట్టిన ధరణి ద్వారా అదే వర్గాలకు ధారాధత్తమయింది.



Tags:    

Similar News