చిలుకూరు దేవాలయం దగ్గరలోనే మసీదు నిర్మాణం ? రాజుకుంటున్న వివాదం

చిలుకూరు దేవాలయంకు సమీపంలోనే మసీదు నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Update: 2024-07-28 16:04 GMT
CR Rangarajan

చిలుకూరు బాలాజీ దేవాలయం గురించి విననివారుండరు. భూలోకంలోకి వచ్చినపుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి స్వయంగా చిలుకూరులో వెలశాడని భక్తులు నమ్ముతుంటారు. అందుకనే చిలుకూరు దేవాలయాన్ని ‘స్వయంవ్యక్త’ క్షేత్రమంటారు. ఇలాంటి ఆలయం విషయంలో సరికొత్త వివాదం చోటుచేసుకోబోతోంది. అదేమిటంటే చిలుకూరు దేవాలయంకు సమీపంలోనే మసీదు నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిరుమలలో శ్రీవెంటేశ్వర దేవాలయానికి ఎలాంటి నియమాలు వర్తిస్తాయో అలాంటి నియమాలే చిలుకూరు దేవాలయంకు కూడా వర్తిస్తాయి.

తిరుమల ఆలయంకు రెండు కిలోమీటర్ల దూరంలో మరో దేవాలయాన్ని కాని అన్యమత ప్రార్ధనాస్ధలాన్ని కూడా నిర్మించేందుకు లేదు. అలాంటి నియమమే చిలుకూరు దేవాలయంకు కూడా వర్తింపచేయాలని దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కారణం ఏమిటంటే చిలుకూరు దేవాలయంకు సమీపంలోనే మసీదు నిర్మాణం జరుగుతోందని రంగరాజన్ చెప్పారు. మసీదును నిర్మించాలని ప్రయత్నాలు మొదలైనట్లు ప్రధాన అర్చకుడు ఆరోపించారు.

మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న చిలుకూరు దేవాలయంకు దగ్గరలో మసీదు నిర్మాణం తగదన్నారు. ముస్లిం సోదరులంటే తనకు అభిమానమున్నా మసీదు నిర్మాణం మాత్రం జరపకూడదని అభ్యంతరం వ్యక్తంచేశారు. దేవాలయంకు సమీపంలో మసీదు నిర్మాణం చేయవద్దని రంగరాజన్ ముస్లిం మతపెద్దలను అభ్యర్ధించారు. దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాలు ఇపుడు ఎలాగున్నాయో అదే పద్దతిలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రంగరాజన్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. పోలీసులు, కలెక్టర్ అనుమతి లేనిదే ఇతర మత నిర్మాణాలు జరిగేందుకు వీల్లేదన్నారు. కాబట్టి మసీదు నిర్మాణాన్ని నిలిపేందుకు వెంటనే పోలీసులు, కలెక్టర్ జోక్యం చేసుకోవాలని ప్రధాన అర్చకుడు రంగరాజన్ కోరారు. మసీదు నిర్మాణం జరిగితే చిలుకూరులో పెద్ద వివాదం మొదలవ్వటం ఖాయమనే అనిపిస్తోంది. మరి ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News