రెండో రోజూ కొనసాగుతున్న గణేశుడి నిమజ్జనాలు

అధికారులను ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి.;

Update: 2025-09-07 08:22 GMT

గణేశుడి నిమజ్జనాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇంకా కొన్ని వందల సంఖ్యలో విగ్రహాల నిమజ్జనాలు జరగాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. కాగా నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేసిన అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుగుతుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలుచేసి ఘన వీడ్కోలు పలికారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

‘‘తొమ్మిది రోజులపాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, రెవెన్యూ, విద్యుత్, రవాణా, మున్సిపల్, పంచాయతీ రాజ్ పారిశుద్ధ్య, ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహకులు, క్రేన్ ఆపరేటర్లు, భక్తులు అందరికీ అభినందనలు’’ అని తెలిపారు.

అన్ని శాఖ సమన్వయంతోనే సాధ్యం: సీపీ

అన్ని శాఖల సమన్వయంతో గణేశ్ నిమజ్జనోత్సవాలు విజయవంతంగా నిర్హించినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ ఏడాది 40 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాల సంఖ్య పెరిగిందని తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం అనుకున్న సమయం కన్నా ముందే ముగిసిందని చెప్పారు. ఈ క్రమంలోనే శోభాయాత్రలో జరిగిన గొడవలపై 5 కేసులు నమోదు చేశామని.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 1,070 మందిని పట్టుకున్నామన్నారు. నిమజ్జనంలో సాంకేతికతను ఉపయోగించామని చెప్పారు. 9 డ్రోన్లు వాడినట్లు తెలిపారు. 25 హైరైజ్‌ భవనాలపై కెమెరాలు పెట్టి మానిటరింగ్‌ చేశామని సీపీ వివరించారు.

Tags:    

Similar News