భారీ వర్షాలతో స్తంభించిన హైదరాబాద్..
ట్రాఫిక్ విషయంలో అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్;
హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. వదలకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజల జీవనం ఎక్కడిక్కడ స్తంభించి పోయింది. తూర్పు, పశ్చిమ ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల నుంచి కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కడిక్కడ నిలిచిపోయింది. గంటల తరబడి వేచి చూసిన మీటర్ల దూరం మాత్రమే ప్రయాణించే పరిస్థితి ఏర్పడింది. సికింద్రాబాద్ ప్యాట్నీ నుంచి పంజాగుట్ట, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ట్రాఫిక్‌లో పలు చోట్ల అంబులెన్స్‌లు ఆగిపోయాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి ట్రాఫిక్ సిబ్బంది నానాతిప్పలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ అధికారులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలిచ్చారు.
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోందని చెప్పారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, కలెక్టర్ దాసరి హరిచందన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మెట్రో వాటర్ వర్క్స్, ట్రాఫిక్ అధికారులతో పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. వారు కీలక ఆదేశాలిచ్చారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాన రహదారులు, కూడల్లలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, పలు ప్రాంతాల్లో తలెత్తిన ట్రాఫిక్ సమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన వెల్లడించారు.
అదే విధంగా శిథిల భవనాలు ఉన్న ప్రాంతాల్లోని పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.