‘ఆపరేషన్ కగార్‌ను ఆపండి..’

ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలని అన్నారు.;

Update: 2025-04-29 13:12 GMT

కర్రెగుట్ట అడవిలో జరుగుతున్న ఆపరేషన్ కగార్‌పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిని వెంటనే ఆపేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం తన వంత ప్రయత్నం చేస్తానని అన్నారు. ప్రజాభవన్ లో మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, జంజర్ల రమేష్ బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే ఆమె ఆపరేషన్ కగార్‌పై స్పందించారు. ‘‘ఆదివాసీల ప్రయోజనాల దృష్టిలో ఆపరేషన్ కగార్ ను తక్షణం నిలిపివేయాలి. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యం గా ఉండాలి. తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలి. మధ్యభారతంలోని ఆదివాసి ప్రాంతాలు రాజ్యాంగం లోని షెడ్యూల్ 5 పరిధిలోకి వస్తాయి. అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులుంటాయి. ఆదివాసి ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన విధానాలు ఉంటాయి. అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలి. బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలనీ ఆదివాసి బిడ్డగా కోరుకుంటున్నాను. ఆదివాసీల హక్కులను ఎవరూ కాలరాయవద్దు. ఆ జాతి బిడ్డగా ఆది వాసులకు అండగా నిలుస్తాను. ఆపరేషన్ కగార్ తో ఆదివాసీలు తీవ్రభయాందోళనతో ఉన్నారు. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలి. రెండు వైపుల ప్రాణ నష్ట నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతాయి’’ అని వ్యాఖ్యానించారు.

Similar News