President Draupadi Murmu | బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ‘మిట్టీ కేఫ్’

శారీరక, మానసిక అంగవైకల్యంతో బాధపడుతున్న వారిని చేరదీసి వారు స్వశక్తితో నిలదొక్కుకునేలా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మిట్టీ కేఫ్ ను ఏర్పాటు చేశారు.

Update: 2024-12-27 14:53 GMT

వివిధ రకాల శారీరక, మానసిక అంగ వైకల్యంతో బాధపడుతున్న పిల్లలను చేరదీసి , వారు తమ కాళ్లపై తాము నిలబడేలా ఆర్థికంగా స్వశక్తితో నిలదొక్కుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను, శిక్షణను అందించేందుకు ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ ‘మిట్టి కేఫ్’.

- మానసిక శారీరక అంగ వైకల్యం కల వారికి ఉపాధి కల్పించేందుకు ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్, సుప్రీం కోర్టు కాంప్లెక్స్, పలు అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 40 కి పైగా స్థలాల్లో మిట్టీ కేఫ్ లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకురాలు స్వర్ణభ మిత్ర చెప్పారు.
- శీతాకాల విడిది సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఆవరణలో మిట్టీ కేఫ్ ను ప్రారంభించారు. ఈ మిట్టీ కేఫ్ ను 15 మంది మానసిక, శారీరక,అంగ వైకల్యం కల వ్యక్తులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఈ మిట్టీ కేఫ్ కు చేయూత అందిస్తోంది.

ఎన్నెన్నో వస్తువుల విక్రయం
దివ్యాంగులు నిర్వహిస్తున్న మిట్టీ కేఫ్ లో ఆధునిక శైలిలో చేతితో రూపొందించిన గృహ, కార్యాలయ అలంకరణ పరికరాలు, పిల్లల ఆట వస్తువులు, నోటు పుస్తకాలు, పెన్నులు విక్రయిస్తున్నారు. సామాజిక దృక్పథంతో ఏర్పాటు చేసిన మిట్టీ కేఫ్ ఆలోచనను గుర్తించి, వాటి నిర్వహణకు సామాజిక బాధ్యతగా పలు ప్రభుత్వ రంగ , ప్రయివేట్ కార్పొరేట్ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా సహకరించేందుకు ముందుకు వచ్చాయి. ఈ కేఫ్ లను పలువురు సెలబ్రిటీలు కూడా సందర్శించి సంఘీభావం ప్రకటించారు.



 బొల్లారం రాష్ట్రపతి నిలయం ఆవరణలో...

బొల్లారం లోని రాష్ట్రపతి నిలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన రిసెప్షన్ సెంటర్ భవనంలో మిట్టీ కేఫ్ నిర్వహణ కోసం రాష్ట్రపతి నిలయం అధికారులు ఉచితంగా స్థలాన్ని కేటాయించారు. 15 మంది మానసిక శారీరక అంగ వైకల్యం కల వ్యక్తులు ఈ కేఫ్ ను స్వయంగా నడుపుతున్నారు. వీరికి నెలకు రూ. 15 వేల నుంచి 50 వేల రూపాయల వరకు వేతనంగా అందుతుంది. ఆర్థిక స్వావలంబన, ఆత్మ గౌరవం తో జీవించేందుకు మిట్టీ కేఫ్ లు అండగా ఉంటున్నట్లు నిర్వాహకురాలు స్వాతి జి తెలిపారు.

సమోసా, టీ లభ్యం
మిట్టీ కేఫ్ లో సమోసా, చాట్, పకోడీ, మసాలా టీ, బిస్కెట్లు, కాఫీ, మాగి, శాండ్ విచ్, పలు రకాల ఐస్ క్రీమ్స్, ఇతర చిరుతిళ్లు స్వయంగా నాణ్యతతో రుచికరంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించటానికి వచ్చే పర్యాటకులు తమ షెడ్యుల్ లో మిట్టీ కేఫ్ చేర్చారు. రాష్ట్రపతి నిలయం ఆవరణలో నెలకొల్పిన మిట్టీ కేఫ్ కు అవసరమైన పెట్టుబడి, రెగ్యులర్ గా నడుపుటకు అయ్యే నిర్వహణ ఖర్చులను కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తో పాటు ఆస్ట్రేలియా -న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూప్ లు భరిస్తున్నాయి. ఈ కేఫ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూపు చొరవ తీసుకుంది. ఈ కేఫ్ ఏడాదికి రూ. రూ36-46 లక్షలు టర్నోవర్ సాధిస్తామని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేశారు.ఇటీవల శీతాకాల విడిదికి వచ్చిన సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మిట్టి కేఫ్ ను సందర్శించి నిర్వాహకులను అభినందించారు.



 



Tags:    

Similar News