బీఆర్ఎస్ లోనే ఉన్నామని సాక్ష్యాలు చూపించిన ఎంఎల్ఏలు

బీఆర్ఎస్ ఎంఎల్ఏలమే అనేందుకు అసెంబ్లీ రికార్డులే సాక్ష్యాలుగా వీరంతా చెబుతున్నారు;

Update: 2025-09-12 07:55 GMT
Alleged BRS defection MLAs

జాతీయజెండాలోని మూడురంగుల కండువాను కప్పుకోవటం నేరమా ? మూడురంగుల కండువా కప్పుకుంటే పార్టీ మారినట్లేనా ? ఇది, తాజాగా బీఆర్ఎస్(BRS) ఫిరాయింపులుగా ప్రచారంలో ఉన్న పదిమంది ఎంఎల్ఏల సూటిప్రశ్న. ఫిరాయింపు ఎంఎల్ఏల వివరణ కోరుతు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Telangana Assembly Speaker Gaddam Prasad Kumar) అందరికీ నోటీసులు జారీచేశారు. నోటీసులకు 8మంది ఎంఎల్ఏలు సమాధానాలిచ్చారు. స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి(Kadiyam), ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్(Danam Nagendar) సమాధానాలు ఇవ్వలేదు. సమాధానాలు ఇవ్వటానికి స్పీకర్ ను వీళ్ళిద్దరు గడువు కోరారు. సమాధానాలిచ్చిన 8మంది ఎంఎల్ఏలు దాదాపుగా ఒకే రకమైన సమాధానాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.

తమనియోజకవర్గాల అభివృద్ధికి నిధుల విడుదల కోరేందుకు తాము ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసినట్లు లేఖలో సమాధానాలిచ్చారు. తాము సీఎంను కలిసినపుడు మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పినట్లు చెప్పారు. అదే సందర్భంగా ముఖ్యమంత్రి కూడా గౌరవంగా తమకు మూడురంగుల శాలువాలు కప్పారని ఎంఎల్ఏలు చెప్పారు. మూడురంగుల శాలువాలు కప్పుకున్నంత మాత్రాన తాము బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు ఎలాగ అవుతుందని లేఖలో స్పీకర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. తాము పార్టీ ఫిరాయించినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని క్లారిటి ఇచ్చారు. తాము కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకోలేదని ఎంఎల్ఏలు స్పీకర్ కు స్పష్టంగా చెప్పారు.

భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు, చేవెళ్ళ ఎంఎల్ఏ కాలేరు యాదయ్య, జగిత్యాల ఎంఎల్ఏ సంజయ్ కుమార్, గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బాన్సువాడ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డి, శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్, పటాన్ చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి స్పీకర్ కు సమాధానాలు ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ కూడా తొందరలోనే స్పీకర్ కు సమాధానాలు పంపుతారని సమాచారం. తాము బీఆర్ఎస్ ఎంఎల్ఏలమే అనేందుకు అసెంబ్లీ రికార్డులే సాక్ష్యాలుగా వీరంతా చెబుతున్నారు. తాము బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారినట్లు తామెప్పుడూ చెప్పలేదని వీళ్ళు లేఖలో వివరణ ఇచ్చుకున్నారు.

తమకు ప్రతినెలా అందుతున్న జీతంలో నుండి రు. 5 వేలు పార్టీ ఫండ్ కింద బీఆర్ఎస్ ఖాతాలో జమవుతాయని వీరు చెప్పారు. తమ జీతంలో నుండి పార్టీ ఫండ్ రూపంలో నెలకు రు. 5 వేల బీఆర్ఎస్ కట్ చేసింది అనేందుకు మొన్నటి మార్చి నెలవరకు కట్ చేసిన జీతాన్ని తమ వాదనకు ఆధారాలను ఎంఎల్ఏలు స్పీకర్ కు అందచేసినట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఎంఎల్ఏని కాబట్టే తనకు స్పీకర్ పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చినట్లు గాంధీ చెప్పారు. తన ప్రమాణస్వీకారానికి బీఆర్ఎస్ ఎంఎల్ఏలు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరైనట్లు చెప్పారు. అందుకు సాక్ష్యంగా తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను గాంధీ లేఖకు జతచేశారు.

తాము బీఆర్ఎస్ ఎంఎల్ఏలమే అంటు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది ఎంఎల్ఏలు తనకు రాసిన లేఖలను, జతచేసిన సాక్ష్యాలను స్పీకర్ కార్యాలయం బీఆర్ఎస్ కు పంపింది. ఫిరాయింపులపై అనర్హత వేటు వేయాలని కోర్టులో కేసులు దాఖలు చేసిన ఎంఎల్ఏలు కేపీ వివేకానంద్ గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగతంగా కూడా పంపినట్లు సమాచారం. ఎంఎల్ఏల అనర్హతపై స్పీకర్ ఒక్కో ఎంఎల్ఏని వ్యక్తిగతంగా పిలిచి విచారణ జరుపనున్నారు. అందుకోసం వీరందరిని పిలిపించేందుకు నోటీసులు రెడీ అవుతున్నాయి. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్ఏలను విచారణకు పిలిచినపుడే కేసులు వేసిన బీఆర్ఎస్ ఎంఎల్ఏలను కూడా అదే సమయానికి స్పీకర్ పిలవబోతున్నారు. రెండువైపుల ఎంఎల్ఏలు తమ లాయర్లతో విచారణకు హాజరై తమ వాదనలను వినిపించాల్సుంటుంది.

ఈ పద్దతిలో మొత్తం 10 మంది ఎంఎల్ఏల అనర్హతపై విచారణ జరిపిన తర్వాత ఫైనల్ గా తన నివేదికను స్పీకర్ సుప్రింకోర్టుకు అందచేసే అవకాశముంది. లేకపోతే తానే అనర్హతపై నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశముంది. స్పీకర్ గనుక తన నిర్ణయాన్ని ప్రకటిస్తే అప్పుడు ఏమిచేయలన్నది బీఆర్ఎస్ ఎంఎల్ఏల ఇష్టం. ఈ ప్రక్రియంతా పూర్తయ్యేటప్పటికి ఎంతకాలం పడుతుందో ఎవరూ చెప్పలేరు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News