జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధిగా నవీన్ ?
మంగళవారం మధ్యాహ్నం రేవంత్-తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) మధ్య జూమ్ మీటింగ్ జరిగింది
తొందరలోనే జరగబోతున్న జూబ్లీహిల్స్(Jubilee Hills) అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా వీ. నవీన్ యాదవ్ పోటీచేయబోతున్నట్లు సమాచారం. నవీన్ కు టికెట్ ఇచ్చేవిషయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revnth) మొగ్గుచూపినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. మంగళవారం మధ్యాహ్నం రేవంత్-తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) మధ్య జూమ్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగులో ముగ్గురు మంత్రుల కమిటి సిఫారసుచేసిన ముగ్గురు పేర్లపై చర్చ జరిగింది. మంత్రుల కమిటి నవీన్ యాదవ్(Naveen Yadav), బొంతురామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లను సిఫారసుచేసింది. ఈ పేర్లపై ఈరోజు రేవంత్-మీనాక్షి మధ్య జరిగిన చర్చలో గెలుపు అవకాశాలతో పాటు ప్లస్సులు, మైనస్సులు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది.
మొత్తం చర్చలో నవీన్ అభ్యర్ధిత్వంపై రేవంత్ మొగ్గుచూపినట్లు సమాచారం. దాంతో నవీన్ పోటీచేయటం దాదాపు ఖాయమనే ప్రచారం పార్టీలో మొదలైపోయింది. నవీన్ కు అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే ఎంఐఎం మద్దతుగా నిలవటం. మొదటినుండి నవీన్ ఎంఐఎం పార్టీలో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాడు. 2018లో జూబ్లీహిల్స్ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయాడు. మొన్నటి 2023 ఎన్నికలకు ముందు నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. నియోజకవర్గంలో మొదటినుండి పట్టున్న నేతగా అందరికీ పరిచయం ఉండటంతో పార్టీలో కూడా బాగా పాపులరయ్యాడు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, సోదరుడు అక్బురుద్దీన్ ఓవైసీతో నవీన్ కు సన్నిహిత సంబంధాలుండటం కలిసొచ్చే అంశంగా చూస్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గంలో దాదాపు లక్షకు పైగా ముస్లిం మైనారిటిల ఓట్లున్నాయి.
ఇంకోపెద్ద విషయం ఏమిటంటే టికెట్ కోసం పోటీపడిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పోటీనుండి తప్పుకుంటున్నట్లు స్వయంగా ప్రకటించాడు. నవీన్ కు టికెట్ ఖాయమైందన్న విషయం తెలియటంతోనే బొంతు రేసులో నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడని పార్టీనేతలు చెబుతున్నారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపుకు పనిచేస్తానని బొంతు ప్రకటించాడు. రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కాబట్టి నవీన్ అభ్యర్ధిత్వాన్ని పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించటమే మిగిలింది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాగంటి సునీత పోటీచేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్ధి ఎంపికపై కసరత్తు చేస్తోంది.