కేసీఆర్ కు తీవ్ర నిరాశ
కమిషన్ రిపోర్టు ఆధరంగా అందరిపైనా చర్యలకు ప్రభుత్వం రెడీ అవుతోంది
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తీవ్రనిరాశ తప్పలేదు. అలాగే టెన్షన్ కూడా కంటిన్యూ అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కాళేశ్వరం(Kaleshwaram Corruption) అవినీతి, అవకతవకలపై ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే. కేసీఆర్ అండ్ కో అవినీతిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తో విచారణ జరిపించింది. కమిషన్ దాదాపు ఏడాదిన్నర విచారణ జరిపి కేసీఆర్(KCR), హరీష్ రావు(Harish), ఈటల రాజేందర్(Eatala), అప్పటి చీఫ్ సెక్రటరీ ఎస్ కే జోషి, సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రాజెక్టును డైరెక్టుగా పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ తో పాటు చాలామంది ఉన్నతాధికారులను తప్పుపట్టింది. కమిషన్ రిపోర్టు ఆధరంగా అందరిపైనా చర్యలకు ప్రభుత్వం రెడీ అవుతోంది.
ఈ నేపధ్యంలోనే కమిషన్ రిపోర్టును కొట్టేయాలని కేసీఆర్ తో పాటు పైన చెప్పిన వాళ్ళు హైకోర్టులో కేసులు దాఖలు చేశారు. ఆ కేసువిచారణ మంగళవారం జరిగింది. ఈరోజు విచారణలో తమకు అనుకూలంగా కోర్టు నిర్ణయం తీసుకుంటుందని, తమపైన విచారణ జరగకుండా స్టే ఇస్తుందని భావించారు. అయితే కేసును హైకోర్టు నవంబర్ 12వ తేదీకి వాయిదావేసింది. వీళ్ళు దాఖలుచేసిన కేసుల్లో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరపు లాయర్ రిక్వెస్టుచేశారు. ఆ రిక్వెస్టు ప్రకారమే కేసును నవంబర్ కు వాయిదావేసింది.
కేసీఆర్ ఏమనుకున్నారంటే ఈరోజు విచారణలో తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని ఆశించారు. అందుకనే కాళేశ్వరం కేసులు తమను ఏమీచేయలేవని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించింది. తమను వేధించటానికే కుట్రపూరితంగా తమపై ప్రభుత్వం కమిషన్ తో తప్పుడు రిపోర్టు ఇప్పించిందని కేటీఆర్, హరీష్ ఇప్పటికే చాలాసార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. తమపై కమిషన్ రిపోర్టులోని అంశాలను కొట్టేయాలని, రిపోర్టు ఆధారంగా తమపైన ప్రభుత్వం కేసులు నమోదుచేసి చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని కేసీఆర్, హరీష్ తదితరులు కోర్టును ఆశ్రయించారు. అయితే వీరి రిక్వెస్టును హైకోర్టు పట్టించుకోలేదు.
హైకోర్టు పట్టించుకోలేదు అంటే కమిషన్ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం తనపని తాను చేసుకోవచ్చనే కదా అర్ధం. అందుకనే కేసీఆర్ అండ్ కో లో టెన్షన్ పెరిగిపోతోంది. ఆ టెన్షన్ మంగళవారం విచారణలో తీరిపోతుందని అనుకుంటే అదికాస్త నవంబర్ 12వరకు కంటిన్యు అయ్యేట్లుంది. ఈలోగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి(ఎన్డీఎస్ఏ) రిపోర్టు ఆధారంగా కాళేశ్వరం అవినీతిపై విచారణ చేయటానికి సీబీఐ అంగీకరించి రంగంలోకి దిగితే అంతే సంగతులు. ఇప్పటివరకు సీబీఐ కాళేశ్వరం, మేడిగడ్డలో అవినీతి, అవకతవకల ఫైళ్ళను పరిశీలిస్తోంది. ఫైళ్ళ పరిశీలనలో ప్రభుత్వ ఆరోపణలకు తగ్గట్లుగా కేసీఆర్ అవినీతికి ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నట్లు నిర్ధారణక వస్తే విచారణ చేయటానికి సీబీఐ సంసిద్ధత వ్యక్తంచేస్తుంది. అప్పుడు కేసు విచారణను సీబీఐ మొదలుపెడుతుందని నోటిఫికేషన్ జారీఅవుతుంది. అప్పటినుండి సీబీఐ విచారణ మొదలైనట్లే లెక్క. సీబీఐ విచారణ మొదలైతే కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.