కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు..
ఉపఎన్నికల టికెట్ ఇక ఫట్టేనా..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నేత, టికెట్ రేసులో ఉన్న నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదయింది. ఇటీవల యూసఫ్‌గుడలోని తన కార్యాలయంలో నవీన్ యాదవ్ ఓ కార్యక్రమం నిర్వహించారు. అందులో నియోజకవర్గ పరిధిలోని ఓటర్లకు కొత్తగా జారీ అయిన ఓటర్ కార్డులను పంపిణీ చేశారు. ఇది ఇప్పుడు ఆయన మెడకు ఉచ్చులా బిగుస్తోంది. ఓటర్ కార్డులను నవీన్ యాదవ్ ఎలా పంపిణీ చేస్తాడు? అసలు ఆయన దగ్గరకు ఓటర్ కార్డులు ఎలా వచ్చాయి? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇదే అంశంపై ప్రతిపక్ష నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఈ అంశంపై అధికారులు దృష్టి సారించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఓటర్ కార్డులు వంటి అధికారిక పత్రాలను రాజకీయ నాయకులు పంపిణీ చేయడం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగానే పరిగణించబడుతుందని ఎన్నికల సంఘం భావించింది.
ఎన్నికల నిబంధనలను నవీన్ యాదవ్ ఉల్లంఘించడంపై అధికారులు సీరియస్ అయ్యారు. ఈ అంశంపై జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి.. మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు.. నవీన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 170, 171, 174 లతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో అక్రమ పద్దతులను, అధికారిక హోదాను దుర్వినియోగం చేడయం, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం కింద కేసు నమోదు చేశారు.
ఇక టికెట్ ఫట్టేనా..
అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ తరుపు నుంచి బరిలోకి దిగే అభ్యర్థుల రేసులో నవీన్ యాదవ్ పేరు కూడా ఉంది. ఆయనకే టికెట్ ఖరారు అన్న వాదన కూడా స్థానికంగా బలంగా వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ నేతలు ప్రచారంలో కూడా జోరు పెంచారు. ఇంతలోనే నవీన్ యాదవ్‌పై కేసు నమోదు కావడం కీలకంగా మారింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ అభ్యర్థుల్లో నవీన్ యాదవ్‌తో పాటు మరికొందరు పేర్లను షార్ట్ లిస్ట్ చేసి అధిష్ఠానానికి రాష్ట్ర కాంగ్రెస్ పంపినట్లు సమాచారం. ఇంతలో ఈ కేసు నమోదు కావడంతో.. నవీన్ యాదవ్‌కు టికెట్ ఇక డౌటే? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. జూబ్లీహిల్స్ రేసు నుంచి నవీన్ ఔట్ అయినట్లే? అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
నవంబర్ 11న పోలింగ్..
సోమవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. నియోజకవర్గంలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. షెడ్యూల్ విడుదలైన అనంతరం ఎన్నికల కోడ్ అమ్లోకి వచ్చిందని హైదరాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. ఈ సందర్భంగానే నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.