ఐబొమ్మ రవిని పట్టించింది ఎవరో చెప్పిన అడిషినల్ సీపీ..

ఐబొమ్మ రవి తన ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే దొరికాడని స్పష్టం చేసిన సీపీ శ్రీనివాస్.

Update: 2025-11-25 12:30 GMT

ఐబొమ్మ రవిని పట్టుకోవడం వెనక పోలీసులు పడిన శ్రమను అడిషనల్ సీపీ(క్రైమ్) శ్రీనివాసులు వివరించారు. మంగళవారం ఐబొమ్మరవి కేసుపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇమ్మడి రవి తన ఓవర్ కాన్ఫిడెన్స్‌ వల్లే చిక్కాడని స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే అతడిని అతని భార్యే పట్టించింది అన్న వాదనలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అసలు రవి.. ఎలా వర్క్ చేయించేవాడు? ఐబొమ్మ, బప్పం టీవీ సైట్‌లను ఎవరు డిజైన్ చేశారు? రవిని ఎలా పట్టుకున్నారు? వంటి అనేక వివరాలను శ్రీనివాసులు వెల్లడించారు. అంతేకాకుండా కస్టడీలో ఉన్న సమయంలో రవి నుంచి ఎటువంటి సమాచారం తమకు లభించింది? అనేది కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా, ఐబొమ్మ రవి అకౌంట్‌కి డబ్బులు ఎలా వచ్చాయో, యాడ్‌ కంపెనీల పాత్ర ఏమిటో కూడా వివరించారు.

భవిష్యత్‌లో పైరసీని పట్టుకోవడం కష్టం

‘‘మాకు రవి గురించి అతని భార్య ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అతని ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే రవి దొరికాడు. ఇంకా కొన్ని పైరసీ వెబ్‌సైట్లు నడుస్తూనే ఉన్నాయి. మూవీ రూల్జ్, తమిల్ ఎంవీ లాంటివి. వాటి నిర్వాహకులను కూడా పట్టుకునే పనిలోనే ఉన్నాం. భవిష్యత్‌లో వెబ్-3 టెక్నాలజీ వస్తుంది. అది వస్తే పైరసీ వాళ్లని పట్టుకోవడం కష్టం’’ అని శ్రీనివాసులు చెప్పారు.

సొంత కంపెనీలతో దందా

‘‘రవిని అతడి స్నేహితుడు నిఖిల్‌ ద్వారా పోలీసులు ట్రాప్‌ చేశారు. ‘ఐబొమ్మ’, ‘బప్పమ్‌’ మూవీ పోస్టర్లను రవి స్నేహితుడు నిఖిల్‌నే డిజైన్‌ చేస్తున్నాడు. గేమింగ్‌, బెట్టింగ్‌ యాప్‌ ప్రకటనల ద్వారా రవికి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చేది. వచ్చిన డబ్బును యాడ్ బుల్‌ అనే కంపెనీకి రవి మళ్లించేవాడు. యాడ్ బుల్‌ కంపెనీ రవికే చెందింది, ఈ కంపెనీ ద్వారా డాలర్ల రూపంలో లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు’’ అని తెలిపారు.

‘‘ఐబొమ్మ వెబ్‌సైట్‌ను ఎన్ జిలా అనే కంపెనీలో రిజిస్టర్ చేశాడు రవి. మరో కంపెనీ నుంచి హోస్ట్ చేశాడు. కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా సినిమాలు పోస్ట్ చేసేవాడు. ఈ వెబ్‌సైట్‌లలో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాశాడు. దాని ద్వారా ఈ వెబ్‌సైట్‌ను చూసేవాళ్లని గేమింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లకు తీసుకెళ్లేవాడు. అక్కడ డిస్ప్లే అయ్యే యాడ్‌లను యాడ్ క్యాష్, యాడ్ స్టరా అనే సంస్థలు మేనేజ్ చేశాయి’’ అని వివరించారు.

Tags:    

Similar News