తెలంగాణాలో రౌడీ షీటర్లు అరాచకం సృష్టిస్తున్నారు. ఇటీవలి కాలంలో జరిగిన దాడులు, హత్యల్లో రౌడీ షీటర్లు కీలక పాత్ర పోషించినట్లు పోలీస్ రికార్డులు చెప్తున్నాయి. హైదరాబాద్‌లో అయితే, సివిల్ వివాదాలు, ముఖ్యంగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కొందరు రౌడీ షీటర్లయితే వడ్డీ వ్యాపారం చేస్తూ ఆస్తులు ఆక్రమిస్తున్నారు. ఈ క్రమంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.
ఓల్డ్ సిటీ ఐఎస్ సదన్‌లో రౌడీ షీటర్ నసీర్ కత్తితో హల్‌చల్ చేశాడు. నవంబర్ 1న జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కత్తి చేతిలో పట్టుకుని వీధుల్లో తిరిగిన నసీర్.. పలు వాహనాలను ధ్వంసం చేశాడు. అడ్డొచ్చిన వారిపై దాడికి యత్నించాడు. హత్య, హత్యాయత్నం, చోరీ, చైన్ స్నాచింగ్ కేసుల్లో ఇతడు నిందితుడిగా రౌడీ షీటర్‌గా పోలీస్ రికార్డుల్లో ఉన్నాడు.
ఫలక్‌నుమాకు చెందిన రౌడీ షీటర్ మసీయుద్ధీన్‌ను కొందరు దుండగులు డబీర్‌పురా ఫ్లైఓవర్ వద్ద దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే మరో దాడి డబీర్ పురా దర్వాజా వద్ద జరిగింది.
రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబీర్‌పురా దర్వాజా వద్ద రౌడీ షీటర్‌పై కత్తితో దాడి జరిగింది. 'ఖిజార్ యాకుబీ' అనే అనుమానిత రౌడీ షీటర్ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి అతన్ని వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో రౌడీ షీటర్లకు భయం పట్టుకుంది. తమపై ఎవరు ఎప్పుడు దాడి చేస్తారో తెలియక గజగజలాడుతున్నారు.
కాలాపత్తర్ ప్రాంతంలో "ఆధిపత్యం కోసం రెండు రౌడీ గ్యాంగుల మధ్య పోరు, ప్రతీకార హత్యలు నిత్యకృత్యంగా మారాయని" పోలీసులు చెబుతున్నారు. ఒక వర్గాన్ని మరొక వర్గం దెబ్బతీయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయని, ఈ క్రమంలోనే దాడులు, హత్యలు చోటుచేసుకుంటున్నాయి.
హైదరాబాద్‌లోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 3 వేల మందికి పైగా రౌడీ షీటర్లు పోలీసుల రికార్డులో ఉన్నారు. ముఖ్యంగా పాతబస్తీలో 101 మంది రౌడీ షీటర్లు.. 11 గ్యాంగులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరి మధ్య ఆధిపత్య పోరుతో నడిరోడ్లపై కత్తులతో పరస్పర దాడులు చేసుకోవడం, గన్ ఫైరింగ్ లకు పాల్పడడం కామన్‌గా మారింది. రౌడీ షీటర్ల గ్యాంగ్ వార్‌లో కొంత మంది చనిపోయారు. ఇంకొందరు ఆసుపత్రి పడకపై ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్ల లెక్క తీస్తున్నారు పోలీసులు. "ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన రౌడీ షీటర్లు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏదైనా దందాల్లో, సెటిల్మెంట్లలో ఇన్వాల్వ్ అవుతున్నారా? అలాంటి వివరాలు ఆరా తీస్తున్నారు. ఎప్పట్లాగే వివిధ సందర్భాల్లో బైండోవర్ చేయడం కాకుండా ఈసారి కొత్తగా కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. వారి వెనుక ఉన్న స్థానిక నాయకులను కూడా పిలిపించి, కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఇక మీదట రౌడీ షీటర్ల ఆగడాలు సహించేది లేదని" సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. అర్ధరాత్రి పూట రౌడీ షీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేసి, నేర ప్రవృత్తి మానాలని కఠినంగా హెచ్చరిస్తున్నారు.
ఖమ్మం జిల్లా వి.వెంకటాయపాలెం జగ్యా తండాకు చెందిన బోడ సుశీల(28) అనే మహిళ ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. పొలంలో పని చేసుకుంటున్న సుశీలను అమ్మపాలెం గ్రామానికి చెందిన రౌడీ షీటర్ ధరావత్ వినయ్ తన కోరిక తీర్చాలని అఘాయిత్యం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించడంతో దాడికి పాల్పడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన బాధితురాలు ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక రఘునాథపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు నెల రోజుల ముందు వినయ్‌పై రౌడీ షీట్ ఓపెన్ అయి వుంది.
వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్‌లో ఓ రౌడీ షీటర్ ఇటీవల వీరంగం సృష్టించాడు. వల్లభ్ నగర్‌కు చెందిన కొంగ మురళి కుటుంబంపై రౌడీ షీటర్ ఓర్సు తిరుపతి తన అనుచరులతో వచ్చి వీరంగం సృష్టించాడు. దాడిలో మురళి కుమారుడు సాయి చేయి విరిగి, తల పగిలి రక్తస్రావం అయ్యింది. అడ్డుకునేందుకు వెళ్లిన మురళి భార్య నాగలక్ష్మి, కూతురు రేష్మ, అల్లుడు రాజు, సాయి భార్య ప్రత్యూషపై దారుణంగా దాడి చేశాడు. తిరుపతిపై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా, రౌడీ షీటర్‌గా పోలీసుల రికార్డుల్లోకి ఎక్కాడు.
అనేక బస్తీల్లో రౌడీ షీటర్లే గల్లీ లీడర్లుగా చెలామణి అవుతున్నారు. సామాన్యుల గొడవలు, ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి పంపకాల్లోకీ ఎంటరై బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో దాడులు, హత్యాయత్నాలు, హత్యలకూ తెగబడుతున్నారు. కొంత మంది రౌడీ షీటర్లు పేకాట స్థావరాలు, వ్యభిచార గృహాలు, గంజాయి, డ్రగ్స్ సప్లై లాంటి దందాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 11 నెలల కాలంలో హైదరాబాద్‌లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ అరెస్టయిన వారిలో ఎక్కువ మంది రౌడీ షీటర్లే ఉన్నారని పోలీసులు చెప్తున్నారు.
నిత్యం భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లు, ఇతర దందాల్లో రౌడీ షీటర్లు మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో అడ్డొచ్చినవారిపై దాడులు, హత్యలకు తెగబడ్తున్నారు. రౌడీ షీటర్లను కొంత మంది స్థానిక రాజకీయ నేతలే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు పోలీస్ అధికారులు కూడా రౌడీ షీటర్లతో సంబంధాలు పెట్టుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులూ వస్తున్నాయి. ఇలా కొంత మంది రాజకీయనాయకులు, పోలీస్అధికారుల అండదండలతో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర కమిషనర్ వి.సి.సజ్జనార్ ప్రయత్నం హర్షణీయం. 'రౌడీయిజాన్ని అంతం చేయాలి, రౌడీలలో మార్పు తీసుకొని రావాలి'. అయితే, "నేడు రౌడీయిజం అనేది రూపం మారింది. వారే ఆర్గ నైజ్డ్ రౌడీలుగా మారారు. ఒకప్పుడు గల్లిల వరకే పరిమితం అయినా రౌడీలు, నేడు ఫైనాన్స్ వ్యవహారాల్లోకి ఎంట్రీ అయ్యారు. వీరిని ఫైనాన్స్ కంపెనీలు కార్పొరేట్ రౌడీయిజానికి బాట వేశాయి. సో, ఆర్గనైజ్డ్ అవుతున్న రౌడీలను ఎలా కౌన్సిలింగ్ చేయగలరు అనేది పెద్ద ఛాలెంజ్. ఒకప్పుడు మంచి రౌడీలుగాను, చెడ్డ రౌడీలుగాను ఆయా గల్లీలు, సమాజాలు పిలిచేవారు. నేడు కార్పొరేట్ స్టైల్ ను పూసుకున్నారు. ఇక్కడే పోలీస్ డిపార్ట్‌మెంట్ అలోచించి, ఓ మంచి సొల్యూషన్ చూడగలగాలి, అప్పుడే , తెల్లవారు జామున చేస్తున్న పర్యటనలకు, కౌన్సిలింగ్ లకు, ఆయా గల్లీలు, కాలనీల అభివృద్ధికి సాధ్యం అవుతుంది" అని పౌర హక్కుల ప్రజా సంఘం రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు.
"పోలీసు ఉన్నతాధికారులతో పాటు, పి.ఎస్.స్థాయిలో ఇన్‌స్పెక్టర్ బాధ్యతాయుతంగా వుండి రౌడీషీటర్లపై నిరంతరం నిఘా పెట్టాలి. వారం వారం పిలిచి వార్నింగ్ ఇస్తూ వుండాలి. కానీ అలా జరగడం లేదు. ఇన్‌స్పెక్టర్ మారినప్పుడల్లా ఆ పి.ఎస్. పరిధిలో వున్న రౌడీషీటర్లను పిలిచి కఠినంగా వ్యవహరించడం లేదు. అందుకే రౌడీషీటర్లు రెచ్చిపోతుంటారని" సీనియర్ జర్నలిస్ట్ ప్రభాకర్‌రావు ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు.