ఆరోగ్య విపత్తు అంచుల్లో హైదరాబాద్ వృద్ధులు

50శాతం మందికి హై బీపీ, 25శాతం మందికి డయాబెటిస్. నేషనల్ ఇన్ స్టిట్యూబ్ ఆఫ్ న్యూట్రిషన్ స్టడీలో వెల్లడైన ఆందోళనకర నిజాలు

Update: 2025-11-25 12:19 GMT
వృద్ధులకు దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు

హైదరాబాద్ నగరంలో వృద్ధులు (Hyderabad senior citizens)అత్యధికంగా రక్తపోటు, డయాబెటిస్, ఊబకాయం వంటి ఆరోగ్య సంక్షోభాలతో బాధపడుతున్నారు.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ విభాగం ఆధీనంలోని జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్తలు వృద్ధులపై అధ్యయనం (ICMR-NIN Study)చేసింది. నగరంలోని అడ్డగుట్ట ప్రాంతంలో అరవై ఏళ్లు, అరవై ఏళ్లకు పైబడి ఉన్న వృద్ధులు 1320 మందిపై అధ్యయనం జరపగా వారిలో 50 శాతం మందికి అధిక రక్తపోటు సమస్య (suffer BP,Life style diseases)ఉందని తేలింది.


భారతదేశంలో వృద్ధుల జనాభా 2050 నాటికి 340 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా.ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్ల వయసు దాటిన వారి సంఖ్య ఒక బిలియన్ ను దాటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భారతదేశంలో వృద్ధుల జనాబా వేగంగా పెరుగుతుంది, వృద్ధుల శాతం జనాభాలో 8 శాతం కంటే అధికంగా ఉంది.ఐక్యరాజ్యసమితి (UN) ప్రకారం, భారతదేశంలో వృద్ధుల జనాభా 2025వ సంవత్సరం నాటికి 158.7 మిలియన్లకు చేరుకుందని అంచనా. వృద్ధుల దీర్ఘయువు పెరిగినా వారు ఆరోగ్య సంరక్షణ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న వృద్ధుల సంఖ్యతో పాటు వారికి ఊబకాయం, రక్తపోటు, మధుమేహం సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ నూసి సమర సింహారెడ్డితోపాటు కార్తీకేయన్ రామానుజన్, జయితీ ఠాకూర్, రజిత త్రివేణి కోరల్ల, జేజే బాబు గెడ్డం లు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న అడ్డగుట్ట ప్రాంతంలో అరవై ఏళ్లు, అరవై ఏళ్లకు పైబడి ఉన్న వృద్ధులు 1320 మందిపై అధ్యయనం చేశారు. అడ్డగుట్టలో ఇంటింటి సర్వే చేయగా పలు వాస్తవాలు వెలుగుచూశాయి.



 వృద్ధుల అధ్యయనంలో వెలుగు చూసిన షాకింగ్ వాస్తవాలు

హైదరాబాద్ నగరంలోని వృద్ధుల్లో 49.9 శాతం మందికి రక్తపోటు ఉందని తేలింది. దీంతోపాటు 25.8 శాతం మందికి డయాబెటీస్ వ్యాధి సోకిందని, వారు మందులు వాడుతున్నారని వెల్లడైంది. వృద్ధుల్లో రక్తపోటు, డయాబెటీస్ వ్యాధులు రావడానికి ప్రధాన కారణం ఊబకాయం అని పరిశోధనల్లో తేలింది. అంటే రక్తపోటు, డయాబెటీస్ ఉన్న వృద్ధుల్లో 44.3 శాతం మందికి స్థూలకాయం ఉందని వెల్లడైంది. ఊబకాయం లేని వ్యక్తులతో పోలిస్తే స్థూలకాయం ఉన్న వ్యక్తులకు అధిక రక్తపోటు,మధుమేహం వ్యాధులు సోకాయని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెలుగుచూసింది. అసాధారణ బరువు ఉన్న వారికి రక్తపోటు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని తమ పరిశోధనల్లో తేలిందని ఎన్ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ నూసి సమర సింహారెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఎన్ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ నూసి సమర సింహారెడ్డి 


 సమతుల ఆహారం ఏది?

జీవనశైలి మార్పులు, వృద్ధాప్యం, బియ్యం అధిక వాడకం, సమతుల ఆహారం తీసుకోక పోవడం, ఆయిల్ అధిక వినియోగం, కొరవడిన శారీరక శ్రమ, వ్యాయామం వల్ల ఎక్కువ మంది అధిక రక్తపోటు, డయాబెటీస్ వ్యాధుల బారిన పడ్డారని తమ పరిశోధనల్లో తేలిందని ఎన్ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ నూసి సమర సింహారెడ్డి చెప్పారు. వృద్ధులు కేవలం ఒక్క ఆదివారమే ప్రోటిన్ అధికంగా ఉండే మాంసం, చికెన్, చేపలు తింటున్నారని, మిగతా రోజుల్లో 74.4 శాతం మంది కూరగాయలు తింటున్నారని తేలింది. ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ 2020 ప్రకారం భారతదేశంలోని పేద గ్రామీణ ప్రజలు ఎక్కువ మంది పోషకాహార లోపాల వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాలు, జీవనశైలి సంబంధిత వ్యాధులైన (Life style diseases)ఊబకాయం, డయాబెటీస్, కేన్సర్లు, హృదయ సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయి. 80 ఏళ్లు పైబడిన వారిలో అధిక రక్తపోటు 85 శాతం మందికి ఉందని తేలింది.

పెరిగిన డయాబెటీస్ ప్రాబల్యం
1990 వ సంవత్సరంలో డయాబెటీస్ రోగుల సంఖ్య 26 మిలియన్ల కేసులుండగా .2016 నాటికి వీటి సంఖ్య రెట్టింపు కంటే అధికింగా 65 మిలియన్లకు పెరిగింది. జన్యు, శారీరక, పర్యావరణ, పట్టణీకరణ, అనారోగ్యకరమైన జీవనశైలి, కొరవడిన శారీరక శ్రమ, అధిక పొగాకు వినియోగం, మద్యపానం, వాయుకాలుష్యం దీర్ఘకాలిక రోగాలకు దారి తీస్తుందని ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ 2020 వెల్లడించింది. అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం దీర్ఘకాలిక వ్యాధుల భారాన్ని పెంచుతుందని తేలింది. అధిక రక్తపోటు, మధుమేహం రెండింటికీ బలంగా ముడిపడి ఉంది. పేలవమైన ఆహార వైవిధ్యం, తగినంత ప్రోటీన్ తీసుకోక పోవడం ఈ ఆరోగ్య సవాళ్లను మరింత తీవ్రతరం చేస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది.

ఆర్కైవ్స్ ఆఫ్ జెరోంటాలజీ అండ్ జెరియాట్రిక్స్ ప్లస్ ప్రచురణ
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ విభాగం నిర్వహించిన అధ్యయనంలో హైదరాబాద్‌లోని వృద్ధుల జీవితాల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.ఈ అధ్యయనం యొక్క ఫలితాలు ఆర్కైవ్స్ ఆఫ్ జెరోంటాలజీ అండ్ జెరియాట్రిక్స్ ప్లస్ సంచికలో ప్రచురించారు.ఆహార అంచనా మితమైన వైవిధ్యాన్ని చూపించింది, కానీ 41శాతం మంది మాత్రమే వారానికి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నారు. తృణధాన్యాలు, నూనెల వినియోగం ఎక్కువగా ఉండటం, ఆహార అసమతుల్యత వృద్ధుల్లో జీవక్రియ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుందని సూచిస్తుంది.



 వృద్ధుల్లో ఆరోగ్య సంక్షోభం

హైదరాబాద్ అడ్డగుట్టలో అధ్యయనం చేసిన 1,320 మంది వృద్ధుల్లో 50శాతం మంది రక్తపోటుతో బాధపడుతున్నారని, నలుగురిలో ఒకరికి డయాబెటిస్ ఉందని, సగం మంది అధిక బరువుతో ఉన్నారని తేలింది.వృద్ధ మహిళలు కూడా అధిక ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. దేశంలో పట్టణ వృద్ధుల జనాభా పెరుగుతున్న కొద్దీ బియ్యం అధికంగా తినడం, ప్రోటీన్ తక్కువగా ఉండటం, తక్కువ శారీరక శ్రమ, ఇన్సులిన్ నిరోధకత,పెరుగుతున్న మల్టీమోర్బిడిటీ ప్రధాన ఆరోగ్య సంక్షోభానికి కారణమవుతున్నాయని ఎన్ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ నూసి సమరసింహ రెడ్డి చెప్పారు. కేంద్ర స్థూలకాయం (బొడ్డు కొవ్వు) వ్యాధి ప్రమాదానికి ప్రధాన కారణమని కూడా ఈ అధ్యయనం తేల్చింది.

వ్యాధులు రాకుండా ఉండాలంటే...
వృద్ధులకు అధిక రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే సమతుల్య పోషకాహారంపై దృష్టి పెట్టాలని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు సూచించారు. తగిన సమతుల్య పోషకాహారం తీసుకోవడంతోపాటు మితాహారం వల్ల ఊబకాయం రాకుండా నివారించవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2020-2030 దశాబ్దాన్ని "ఆరోగ్యకరమైన వృద్ధాప్య దశాబ్దం"గా ప్రకటించింది. ప్రభుత్వాలు, పౌర సమాజం, అంతర్జాతీయ సంస్థలు, నిపుణులు వృద్ధుల జీవితాలను మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తున్నాయి.ఆహార నాణ్యతను మెరుగుపర్చడం, ఊబకాయాన్ని పరిష్కరించడం వల్ల పట్టణాల్లో ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి బాటలు వేయవచ్చు.



Tags:    

Similar News