తెలంగాణలో మోగనున్న ఎన్నికల నగారా !
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమైన ఎన్నికల కమిషన్.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధమైంది. నోటిఫికేషన్‌ను మరో రెండు రోజుల్లో రిలీజ్ చేయనుంది. మొత్తం 31 జిల్లాల్లో 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో ఈ నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనుంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పంచాయతీరాజ్ శాఖ, ఎన్నికల సంఘం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల కమిషనర్ రాణికుమిదిని నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పంతో గతంలో మంత్రిమండలి తీర్మానం చేయడం, అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండటం, కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించడం, ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన పరిణామాలను నవంబర్ 17న జరిగిన సమావేశంలో మంత్రివర్గం సమగ్రంగా చర్చించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో శతవిధాలా ప్రయత్నించిన విషయాలను గుర్తుచేస్తూ ఈ అంశంపై న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగించాలనివ మంత్రిమండలి నిర్ణయించింది. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి, న్యాయస్థానాల్లో ఈ విషయం తేలిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని మంత్రిమండలి భావించింది. బీసీలకు పార్టీ పరంగా 42 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగానే పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్ల అంశాన్ని ఖరారు చేయడం కోసం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ తన నివేదికను నవంబర్ 20న ప్రభుత్వానికి అందించింది. పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలుపుకుని 50శాతం మించకూడదని సిఫార్సు చేసింది కమిషన్. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఆ తర్వాత నవంబర్ 22న రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. రిజర్వేషన్లు 50శాతం మించకుండా మార్గదర్శకాలను తీసుకొచ్చింది. కులగణన ఆధారంగా సర్పంచ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు కల్పించారు. ఈ రిజర్వేషన్లను ఆర్డీఓలు ఖరారు చేశారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీఓలు ఖరారు చేశారు. మహిళా రిజర్వేషన్లు రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ రూపంలో ఖరారు చేశారు.
రిజర్వేషన్లు ఖరారు అయిన అనంతరం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దాని ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ రెడీ అయింది.