కాంగ్రెస్‌పై విద్యార్థులు రణభేరి మోగించాలి: కేటీఆర్
42శాతం బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలకే పరిమితం కాదని గుర్తు చేసిన కేటీఆర్.
తెలంగాణ విద్యార్థులు మరోసారి పోరుబాట పట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో విద్యారంగం నిర్వార్యమైందని, అసలు విద్యారంగాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తన నివాసంలో విద్యార్థి విభాగం నాయకులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క రంగం అభివృద్ధి కాలేదన్నారు. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి.. విద్యరంగ అభివృద్ధికి ఏం చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించారు. గురుకులాల్లో పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని, ఫీజు రియింబర్స్‌మెంట్ అందక లక్షల మంది విద్యార్థులు సర్టిఫికెట్‌లు అందులేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు కేటీఆర్.
ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై విద్యార్థి లోకం ఉద్యమించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్.. విద్యా రంగానికి స్వర్ణయుగం తీసుకువచ్చారని అన్నారు కేటీఆర్. గురుకుల విద్యా సంస్థలు, రెసిడెన్షియల్ కాలేజీల ఏర్పాటుతో లక్షల మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారని గుర్తు చేశారు. గత పదేళ్లలో విద్యా రంగంలో అద్భుతమైన ప్రగతి జరిగితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా నీరుగారుస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "గత పదేళ్లలో ఏమీ జరగలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారానికి తెరతీసింది. వారి అబద్ధాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉంది," అని ఆయన అన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వచ్చే నెల నుంచి పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులను సమీకరించి, ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గురుకులాల్లో కల్తీ ఆహారం మొదలుకొని, విద్యార్థుల ఆత్మహత్యల వరకు అనేక విషాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థి విభాగం చేపట్టిన ‘గురుకుల బాట’తో ప్రభుత్వంలో కొంత చలనం వచ్చినప్పటికీ, అది కేవలం కాంగ్రెస్ నాయకుల నటనగానే మిగిలిపోయిందన్నారు. గురుకులాల దుస్థితిపై మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందని స్పష్టం చేశారు.
ప్రతి విద్యార్థికి సోషల్ మీడియా ఖాతా ఉండాలని, సమకాలీన రాజకీయాలపై యువత గట్టిగా స్పందించాలని కేటీఆర్ సూచించారు. "విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టాలి. ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా విద్యార్థి గొంతుక బలంగా వినిపించాలి," అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్లు కేవలం స్ధానిక సంస్ధలకే కాదని, విద్యా, ఉద్యోగ అవకాశాల్లోనూ రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ, ఈ అంశంపై యువతను జాగృతం చేయాలన్నారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.
అమరుల త్యాగం చాలా గొప్పది
‘‘తెలంగాణ చరిత్రలో దీక్షా దివస్ నవంబర్ 29 ఒక గొప్ప మహా ఘట్టంగా నిలిచిపోతుంది. డిసెంబర్ 9న దీక్షా దివస్ జరుపుకుంటున్న ఆరోజే తెలంగాణ కేసీఆర్ దీక్ష ఫలితంగా తెలంగాణ సాధ్యమైంది. విద్యార్థులు విద్యార్థి అమరవీరుల త్యాగఫలం తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్పది. దీక్షా దివస్ ని ఘనంగా అన్ని యూనివర్సిటీలు అన్నీ కాలేజీల్లో నిర్వహించాలి’’ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంపై మనకున్న ప్రేమ ఇతరులకు ఉండదని, రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనదేనని కేటీఆర్ ఉద్ఘాటించారు. "ఉద్యమాల నుంచే నిజమైన నాయకులు పుడతారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేసేవారినే ప్రజలు నాయకులుగా కోరుకుంటారు. కాంగ్రెస్ అరాచకాలపై పోరాడి, ప్రతి విద్యార్థి ఒక యోధుడిగా ఎదగాలి" అని కేటీఆర్ పిలుపునిచ్చారు.