‘పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 17శాతమే రిజర్వేషన్లు’
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను తగ్గించడంపై రాహుల్ ఏమంటారు? అని ప్రశ్నించిన కేటీఆర్.
పంచాయతీ ఎన్నికల పోరుకు తెలంగాణ సన్నద్ధం అవుతోంది. మంగళవారం ఈ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజ కుముదిని విడుదల చేశారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. కాగా ఇప్పుడు ఈ రిజర్వేషన్లే రాష్ట్రంలో తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఉన్న 24శాతం కూడా అమలు చేయలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీపై ప్రశ్నలు సంధించారు. బీసీలకు తగ్గించిన రిజర్వేషన్లపై రాహుల్ స్పందిస్తారా? అని అడిగారు.
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు అయినప్పటి నుంచి రిజర్వేషన్ల తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. 42శాతం ఇవ్వకపోగా.. ఉన్న 24శాతాన్ని కూడా 17శాతానికి తగ్గించేశారంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశంపై తాజాగా కేటీఆర్ కూడా ప్రశ్నించారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు. దానిని ప్రచారం చేయడానికి రూ.160కోట్లు ఖర్చు చేశారు. తీరా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 17శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారు. బీసీలకు ఉన్న 24శాతాన్ని 17శాతానికి తగ్గించారు. రిజర్వేషన్ల తగ్గింపు, ప్రజాధనం దుర్వినియోగంపై రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రశ్నిస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
అయితే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అన్న అంశం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. అన్ని పార్టీలు బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ఒకేతాటిపైకి వచ్చాయి. అసెంబ్లీలో ఆమోద ముద్ర వేశాయి. కానీ ఇది చాలా కాలం గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉండిపోయింది. ఆ తర్వాత దానిని న్యాయ సలహా కోసం కేంద్రానికి సిఫార్సు చేయడంతో ఆ బిల్లు ఇప్పుడు ఢిల్లీలో ఉంది. ఆ తర్వాత తీసుకొచ్చిన ఆర్డినెస్స్.. ఇంకా గవర్నర్ ఆఫీసులోనే ఉంది. అదే సమయంలో రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీంతో స్థానిక ఎన్నికలను విడతల వారీగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గం నిర్ణయించింది. ఆ ప్రకారమే ముందుగా పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు వాటిలో చేపట్టిన రిజర్వేషన్లు తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి.