‘మహిళలకు ఉచితం.. పురుషులకు రెండింతలు?’
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్.
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు అంశం రాజకీయంగా తీవ్ర దుమారాం రేపుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉచిత పథకం తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఛార్జీలు పెంచి మగవారిపై పెనుభారం మోపుతోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని ప్రచారం హోరెత్తిస్తున్న కాంగ్రెస్.. అదే సమయంలో మరోవైపు మగవారు, విద్యార్థులపై అదనపు భారాన్ని మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబంలోని ఒక మహిళ ఉచితంగా ప్రయాణిస్తే మిగిలిన వారందరిపై రెండింతలు ఛార్జీలు కట్టాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ ఉచిత బస్సు పథకంతో ఆటో నడవక, ఉపాధి లేక కుటుంబ పోషణ భారంగా మారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిరిసిల్ల నియోజకవర్గం, అడవి పదిరకు చెందిన ఆటో డ్రైవర్ సతీశ్ ను కేటీఆర్ పరామర్శించారు.
‘‘ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి 24 వేల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడింది. ఆటో డ్రైవర్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోంది. పార్టీలకు అతీతంగా ఆటో డ్రైవర్ సంఘాలన్నీ, డ్రైవర్లందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేసిన ఆయన, ప్రభుత్వం మెడలు వంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసుకుందాం. ఆటో డ్రైవర్లు ఎవరు కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండాలి, జీవితం విలువైంది. కష్టం వచ్చిన ఆటో డ్రైవర్ అన్నల వెంబటి మా పార్టీ ఉంటుంది’’ అని కేటీఆర్ తెలిపారు.
వెంటనే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు బీమా సౌకర్యంతో పాటు, ఏడాదికి ₹12,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని అనేక హామీలు ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే, ఆరు నెలలు గడిచినా ఒక్క ఆటో డ్రైవర్‌కు కూడా ఆర్థిక సాయం చేయలేదని విమర్శించారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇక్కడ మాత్రం ఒక్కరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం చేయలేకపోవడం దారుణమన్నారు. డ్రైవర్లకు ఇప్పటికే 24 నెలల బకాయి (ఒక్కో డ్రైవర్‌కు సుమారు ₹24,000 చొప్పున) బాకీ పడిందని ఆయన వెల్లడించారు.
ఆటో నడవక, కుటుంబ పోషణ భారమై మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఆటో డ్రైవర్ నాంపల్లి సతీశ్ (అడవిపదిర గ్రామ నివాసి)ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆర్థిక ఇబ్బందులతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుని, ప్రస్తుతం ఎల్లారెడ్డిపేటలోని అశ్విని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సతీశ్‌ను పరామర్శించిన అనంతరం కేటీఆర్, ఆయన కుటుంబానికి ₹25,000 ఆర్థిక సహాయాన్ని వ్యక్తిగతంగా అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా విమర్శించారు.
ఆటో డ్రైవర్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో చనిపోయిన 93 మందికి పైగా ఆటో డ్రైవర్ల సమాచారాన్ని ప్రభుత్వానికి అందించినా, ఇప్పటివరకు స్పందించలేదన్నారు. "చనిపోయిన ప్రతి ఆటో కార్మికుని కుటుంబానికి ₹10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలి. 93 మంది డ్రైవర్లు చనిపోవడం, వారిని ఆదుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపడం లేదా? ఇంకా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటే ప్రభుత్వం స్పందిస్తుంది?" అని ఆయన ప్రశ్నించారు.
తమ ప్రభుత్వం గతంలో రాష్ట్రంలోని డ్రైవింగ్ చేసే తెలంగాణ బిడ్డల కోసం తీసుకువచ్చిన ప్రమాద బీమాను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసివేసిందని కేటీఆర్ ఆరోపించారు. దీని కారణంగా దాదాపు 8 నుండి 8.5 లక్షల మంది డ్రైవర్లకు బీమా సౌకర్యం లేకుండా పోయిందన్నారు. దాదాపు రూ. 2 లక్షల 30 వేల కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, రోడ్డు వేయలేదు, కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు కానీ, ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆటో డ్రైవర్లకు ధైర్యం చెబుతూ, "ఆటో డ్రైవర్లు ఎవరు కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండాలి, జీవితం విలువైంది. కష్టం వచ్చిన ఆటో డ్రైవర్ అన్నల వెంబటి మా పార్టీ ఉంటుంది. తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ అన్న అందరిని ఆదుకుంటాం" అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. పార్టీలకు అతీతంగా ఆటో డ్రైవర్ సంఘాలన్నీ, డ్రైవర్లందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేసిన ఆయన, ప్రభుత్వం మెడలు వంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసుకుందామని పిలుపునిచ్చారు.