హరీష్‌రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పంచులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేసిన పంచులు ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్ చలో నల్గొండ కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో అసెంబ్లీ లాబీలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

Update: 2024-02-13 00:53 GMT
Komatitreddy,Hareeshrao

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావుపై పలువురు నేతలు తరచూ పంచులు విసురుతుంటారు. పార్టీని హరీష్ రావు చీలుస్తారని తరచూ పంచులు వినిపిస్తుంటాయి. తాజాగా కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అసెంబ్లీ లాబీల్లో పంచులు విసిరి వార్తల్లోకి ఎక్కారు. బీఆర్ఎస్‌ను చీల్చి 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొని అధికార కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తాము ఆయనకు దేవాదాయ శాఖ కట్టబెడతామని రాజగోపాలరెడ్డి ప్రతిపాదించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పాపాలను కడుక్కోవడానికి దేవాదాయశాఖ మంత్రి పదవి హరీష్ రావుకు ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. హరీష్ రావుకు బీఆర్ఎస్ సరైన పార్టీ కాదన్నారు.


మామను మించిన మేనల్లుడు...

హరీష్ రావుకు మేనమామ సాలు వచ్చిందని, అబద్ధాలు చెప్పడంలో మామ కేసీఆర్ ను మించి పోయాడని వ్యాఖ్యానించారు. హరీష్ రావు రైట్ పర్సన్, రాంగ్ పార్టీలో ఉన్నాడని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఎంత కష్టపడ్డా క్రెడిట్ మాత్రం కేసీఆర్ కే దక్కుతుందని అందుకే మామ, బావమరిదిని నమ్ముకోకుండా కాంగ్రెస్ పార్టీకి మద్ధతు తెలపాలని రాజగోపాల్ రెడ్డి సూచించారు.గత 10 ఏళ్లుగా బీఆర్‌ ఎస్పాలనలో చేసిన పాపాలు కడుక్కోవడానికి హరీష్ రావుకు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేయడం మంచి అవకాశం అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఎమ్మెల్యే హరీష్ రావు కష్టజీవి. బీఆర్‌ఎస్ పార్టీలో ఉంటే ఆయనకు రాజకీయ భవిష్యత్ ఉండదు’’అని రాజగోపాల్ వ్యాఖ్యానించారు. గతంలో తమ కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ వాళ్ళు తీసుకోలేదా అని ప్రశ్నించారు. వన్ థర్డ్ ఒకే సారి 26 మంది ఎమ్మెల్యే లతో హరీష్ రావు రావాలని సూచించారు.


అసెంబ్లీలో నవ్వులతో ముంచెత్తిన రాజగోపాల్ రెడ్డి

నీటిపారుదల రంగంపై చర్చ సందర్భంగా మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హరీష్ రావుపై పంచులు విసిరి అందరినీ నవ్వులతో ముంచెత్తారు. ‘‘తప్పులు చేసిన ముఖ్యమంత్రి ఫాంహౌస్‌లో పడుకున్నాడు, మీ కారుకు డ్రైవరు లేరా? మీ కారుకు రిపేర్ లేదా?’’ అని ప్రశ్నించారు. ఎందుకు కాళేశ్వరం కూలిపోయిందని, మీరు ప్రతిపక్షంలో ఎందుకు కూర్చున్నారని రాజగోపాల్ ప్రశ్నించారు. మా మాటలు మీకు తూటాల్లా తగులుతున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రాజగోపాలరెడ్డి ఆరోపించారు. మీ ఫాం హౌస్ కోసం కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టిండ్రు, కేసీఆర్ ఫాంహౌస్‌లో కూర్చొని అసెంబ్లీకి రానప్పుడు ఎందుకు అని ఆయన అన్నారు.


నల్గొండ పోరు బాటకు రాకు...

‘‘హరీష్ రావు గారు హార్డ్ వర్కర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయన ఉన్నా, నిర్ణయాలు మాత్రం ఆయన మామ తీసుకున్నారు. మీ మామ, బావమరిది మాటలు విని నడవకండి, హరీష్ రావు మాకు సహకరించండి, పోరుబాటకు నల్గొండకు రాకు, నీటిపారుదల రంగాన్ని ఛిన్నాభిన్నం చేశారని నల్గొండ ప్రజలు కోపంతో ఉన్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. మేనల్లుడు అయిన హరీష్ రావు గారూ మామని మించిండు.. అని హరీష్ రావు పై రాజగోపాల్ రెడ్డి పంచులు విసరడంతో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సహా సభ్యులు పడి పడి నవ్వుకున్నారు. నల్లగొండలో బీఆర్‌ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అవుతుందని,ప్రజలు ఎవరు బీఆర్‌ఎస్ ను ఇంత తొందరగా నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు. నాడు తెలంగాణ ఉద్యమంలో పెట్రోలు పోసుకున్న హరీష్ రావుకు అగ్గిపుల్ల దొరకలేదా అని రాష్ట్ర మంత్రి సీతక్క ఇటీవల ప్రశ్నించారు.

Tags:    

Similar News