హొంమంత్రి అని కూడా చూడకుండా ‘బండి’ని లోపలికి గుంజేశారు(వీడియో)

పోలీసులకు కోపం వస్తే ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరని కూడా చూడరన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. కాకపోతే ఈ విషయం ఇపుడు రాజకీయంగా వివాదాస్పదమవుతోంది.

Update: 2024-10-20 07:20 GMT
Central minister Bandi Sanjay

పోలీసులకు కోపం వస్తే ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరని కూడా చూడరన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. కాకపోతే ఈ విషయం ఇపుడు రాజకీయంగా వివాదాస్పదమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన అభ్యర్ధులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసేందే. గడచిన వారంరోజులుగా ఆందోళనలు చేస్తున్నా సీన్ లోకి శనివారం బండి సంజయ్ ఎంటరైన తర్వాతే బాగా ఊపొచ్చింది. ఆందోళనకారులతో బండిని కలవనీయకుండా పోలీసులు మొదట్లో అడ్డుకోలేక, అలాగని ఫ్రీగా వదిలిపెట్టలేక చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి కారణం ఏమిటంటే బండి కరీంనగర్ బీజేపీ ఎంపీ మాత్రమే కాదు స్వయానా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అవటమే. కేంద్రమంత్రిని అడ్డుకుంటే కేంద్రం నుండి ఏమి సమస్య వస్తుందో అనే భయం. అలాగని అడ్డుకోకుండా ఫ్రీగా వెళ్ళనిస్తే రాష్ట్రప్రభుత్వం నుండి సమస్య.



 అందుకనే ఆందోళనకారులతో బండి భేటీ అయినపుడు పట్టించుకోలేదు. వారితో కలిసి ర్యాలీగా బయలుదేరినపుడూ మౌనంగానే ఉన్నారు. ఎప్పుడైతే ఆందోళనకారులతో కలిసి బండి సచివాలయం దగ్గరకు చేరుకోబోతున్నారని అర్ధమైందో వెంటనే పోలీసులు అలర్టయ్యారు. అప్పటికప్పుడు బండిని సచివాలయం వైపుకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. ఎంతచెప్పినా బండి వినకపోవటంతో ఎత్తి బండిలోకి పోలీసు జీపులోకి తోసి నాంపల్లిలోని పార్టీ ఆఫీసు దగ్గర దించేశారు. ఉదయం నుండి ఏమి జరిగిందో పాయింట్ బై పాయింట్ గా చూద్దాం.

1. మొదట పార్టీ ఆఫీసులో ఆందోళనకారులతో బండి సమావేశమయ్యారు.

2. అక్కడినుండి మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు, ఆందోళనకారులు వెంటరాగా అశోక్ నగర్ చేరుకున్నారు.



 3. తమపై ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై గ్రూప్-1 అభ్యర్ధులు ఫిర్యాదు చేయటంతో ఆగ్రహించిన బండి అక్కడే రోడ్డుమీద కూర్చున్నారు.

4. తాను కేంద్రమంత్రిని అయినా నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకు బీజేపీ కార్యకర్తగా పోరాటం చేస్తానని ప్రకటించారు.

5. అక్కడినుండి వెళ్ళిపోవాలని పోలీసులు ఎంతచెప్పినా బండి వినిపించుకోలేదు.



 6. అశోక్ నగర్ నుండి అభ్యర్ధులతో కలిసి సచివాలయంకు బయలుదేరారు. వద్దని పోలీసులు చెప్పినా వినలేదు.

7. వేలాదిమంది అభ్యర్ధులు, పార్టీ క్యాడర్ వెంటరాగా బండి సచివాలయంకు బయలుదేరగానే పోలీసులు అడ్డుకునే ప్రయత్నంచేశారు.



 8. పోలీసులను తోసుకుంటూనే బండి అశోక్ నగర్ నుండి రామకృష్ణామఠం దగ్గరున్న ఫ్లైఓవర్ దగ్గరకు చేరుకున్నారు.



 9. కొద్దిసేపటికి బండి అక్కడినుండి లేచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ పక్కనుండి సచివాలయం వైపు బయలుదేరగానే ఇక లాభంలేదని అర్ధమైపోయిన పోలీసులు బండిని చుట్టుముట్టి ఎత్తి పోలీసు జీపులో వేసి నాంపల్లిలోని పార్టీ ఆఫీసు దగ్గర జాగ్రత్తగా దింపేసి వచ్చారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బండి కేంద్రమంత్రి కాబట్టి మొదట్లో మర్యాదిచ్చారు. అయితే ఆంక్షలను పట్టించుకోకుండా బండి సచివాలయం వైపు బయలుదేరగానే ఎత్తి లోపలకు గుంజేశారు.

Tags:    

Similar News