జైల్లో చిత్రహింసలకు గురి చేశారు -ప్రొ.సాయిబాబా

తాను వికలాంగుడినని కూడా చూడకుండా జైల్లో చిత్రహింసలకు గురి చేశారని ప్రొ. జీఎన్ సాయిబాబా ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-08-23 13:51 GMT

తాను వికలాంగుడినని కూడా చూడకుండా జైల్లో చిత్రహింసలకు గురి చేశారని ప్రొ. జీఎన్ సాయిబాబా ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన బషీర్ బాగ్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) నిర్వహించిన 'మీట్-ది-ప్రెస్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టుల ప్రశ్నలకి సమాధానమిస్తూ... జైల్లో తనకి ఎదురైనా చేదు అనుభవాలను పంచుకున్నారు. ఐదు నెలల క్రితం జైలు నుంచి విడుదల అయ్యానని, పదేళ్ల తర్వాత రాష్ట్రంలో స్వేచ్ఛగా మాట్లాడుతున్నానని తెలిపారు. ఢిల్లీలో తనని అక్రమంగా కిడ్నాప్ చేసి అరెస్ట్ చేశారని వెల్లడించారు.

గ్రీన్ హంట్ ఆపరేషన్ ను వ్యతిరేకిస్తూ, ఆదివాసీల పక్షపాతిగా నిలబడిన పాపానికి తనపై ఉపా కేసు నమోదు చేశారని సాయిబాబా తెలిపారు. తొమ్మిదేండ్లు నాగ్ పూర్ సెంట్రల్ జైలులో నిర్భందించబడి, ఇటీవల మహారాష్ట్ర హైకోర్టు కేసును కొట్టి వేయడంతో విడుదలయ్యానని గుర్తు చేశారు. జైల్లో తనకి 21 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చాయని తెలిపారు. తనని జైల్లోని అండా సెల్ లో ఒక ప్రత్యేకమైన రూమ్ లో నిర్బంధించి, వీల్ చైర్ లో తిరిగే పరిస్థితి లేకుండా చేశారని భావోద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలో తనకి ఎలాంటి న్యాయం జరగలేదని పేర్కొన్నారు. జైల్లో కుల వ్యవస్థ విచ్చలవిడిగా కనిపిస్తుందని, కులాన్ని చూసి జాబ్ ఇస్తారని సాయిబాబా ఆరోపించారు. జైలు మ్యాన్యువల్ లో కులాన్ని బట్టి పని ఇవ్వండి అని రాసి ఉంటుందని ఆయన తెలియజేశారు. 

ఈ కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్త, పౌర హక్కుల ఉద్యమ నాయకులు ప్రొఫెసర్ ఏ.హరగోపాల్ అధ్యక్షత వహించగా, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ స్వాగతం పలికారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వి.యాదగిరి వందన సమర్పణ చేశారు.

నిర్దోషిగా బయటకి...

ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్ లాల్ ఆనంద్ కాలేజీలో సాయిబాబా ప్రొఫెసర్ గా విధులు నిర్వహించేవారు. అయితే, నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) పార్టీలో సభ్యుడిగా ఉన్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు మే 2014 లో ఆయన్ని అరెస్ట్ చేశారు. 2016 లో మధ్యంతర బెయిల్ మంజూరైంది. 2017 మార్చ్ లో యూపీఏ చట్టం కింద దోషిగా నిర్ధారించిన కోర్టు... ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో పోలీసులు ఆయన్ని మహారాష్ట్ర లోని నాగ్ పూర్ సెంట్రల్ జైలుకి తరలించి అండా సెల్ లో నిర్బంధించారు. 2022, అక్టోబర్ లో బాంబే హైకోర్టు మరొక బెంచ్ సాయిబాబాతో పాటు ఇతరులను నిర్దోషులుగా ప్రకటించింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం హై కోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయడంతో... ఆ తీర్పును అదే సంవత్సరం సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఏప్రిల్ 23,2023న కొత్త బెంచ్ ముందు సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్ ని జాబితా చేయాలని సుప్రీం బాంబే హై కోర్టుకు సూచించింది. మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం 2014 మార్చి 5 న ఆయన్ని నిర్దోషిగా తేలుస్తూ తీర్పు వెల్లడించింది.

Tags:    

Similar News