తెలంగాణలో 31 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు, 29 శాతం లోటు వర్షపాతం
తెలంగాణ రాష్ట్రంలో వరుణుడు కరుణించక పోవడంతో రైతులు అల్లాడుతున్నారు.;
By : Saleem Shaik
Update: 2025-07-17 12:13 GMT
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదైంది. ఈ ఏడాది జూన్ 1వతేదీ నుంచి జులై 17వతేదీ వరకు తెలంగాణలో సాధారణ వర్షపాతం 242.7 మిల్లీమీటర్లు కాగా వర్షాభావ పరిస్థితులతో 171.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఈ ఏడాది 47 రోజుల్లో తెలంగాణలో సాధారణం కంటే 29 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది.హైదరాబాద్ నగరంలో జూన్ 1వతేదీ నుంచి జులై 17వతేదీ వరకు గడచిన 47 రోజుల్లో సాధారణ వర్షపాతం కంటే 63 శాతం తక్కువగా కురిసింది. ఒక్క హైదరాబాద్ నగరంలో సాధారణ వర్షపాతం 201.3 మిల్లీమీటర్లు కాగా, 74.1 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. హైదరాబాద్ లోనే అత్యల్ప వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలో నీటి సమస్య ఏర్పడింది.
రెండు జిల్లాల్లోనే సాధారణం కంటే అధిక వర్షాలు
తెలంగాణలోని రెండు జిల్లాల్లోనే సాధారణం కంటే అధిక వర్షాలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో సాధారణం కంటే 13 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 341.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా ఈ ఏడాది గత 47 రోజుల్లో 386 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ 15 శాతం అధిక వర్షపాతం నమోదైంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం 345 మిల్లీమీటర్లు కాగా, గత 47 రోజుల్లో 395.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మాత్రం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
31 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 31 జిల్లాల్లో వర్షాభావపరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ జిల్లాలో సాధారణం కంటే 63 శాతం,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 57 శాతం, నిర్మల్, నల్గొండ జిల్లాల్లో 56 శాతం,పెద్దపల్లిలో 55 శాతం,సూర్యాపేటలో 54 శాతం, సంగారెడ్డి జిల్లాలో 53 శాతం, జైశంకర్ భూపాలపల్లి,యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 49 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. వర్షాకాలంలో నైరుతి రుతుపవనాల వల్ల కురవాల్సిన వర్షం కురవక పోవడంతో తెలంగాణలోని 31 జిల్లాల్లో రైతులు అల్లాడుతున్నారు. పంటలు వేసినా వర్షాల్లేక వేసిన విత్తనాలు మొలకెత్తడం లేదని రైతులు ఆవేదనగా చెప్పారు. వరంగల్ జిల్లాల్లో 38 శాతం, వికారాబాద్ లో 44 శాతం, రంగారెడ్డిలో 44 శాతం, మెదక్ లో 38 శాతం, కరీంనగర్ లో 32 శాతం, ఖమ్మంలో 28 శాతం,హనుమకొండలో 23 శాతం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల్, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణ పేట, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, వనపర్తి జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.
ఈదురుగాలుల్లో తేమశాతం తగ్గడం వల్లే వర్షాభావపరిస్థితులు
తెలంగాణ రాష్ట్రంలో వీస్తున్న ఈదురుగాలుల్లో తేమశాతం తగ్గడం వల్లనే వర్షాభావపరిస్థితులు ఏర్పడ్డాయని భాతర వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం శాస్త్రవేత్త ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. దేశంలోని తెలుగు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నా, తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావం ఆశాజనకంగా లేదని ఆయన పేర్కొన్నారు. ద్రోణి ప్రభావం వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నా, తెలంగాణలో ముఖం చాటేశాయని తెలిపారు. కిలోమీటరున్నర ఎత్తులో వీచే గాలి లో తేమ శాతం తగ్గడంతో తెలంగాణలో వరుణుడు కరుణించడం లేదు.
ఐదు రోజుల పాటు వర్షాలు...ఐఎండీ ఎల్లోఅలర్ట్ జారీ
రుతుపవనాల ద్రోణి ప్రభావం వల్ల పశ్చిమ వాయువ్య దిశల నుంచి గాలి వీస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం నుంచి వారం రోజుల పాటు అంటే జులై 24వతేదీ వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెడ్ సైంటిస్టు డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రాగల ఐదు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించినట్లు కె. నాగరత్న తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, మహబూబాబాద్, వరంగల్, హనమకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ శాస్త్రవేత్తలు చెప్పారు. శనివారం నల్గొండ, సూర్యాపేట,మహబూబాబాద్, వరంగల్, హనమకొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో,19వతేదీన వరంగల్, హనమకొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసేఅవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఆలస్యంగా అయిన ఖరీఫ్ సాగు
తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఆశించిన మేర పంటలు వేయలేదని సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త ఎన్డీఆర్కే శర్మ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వచ్చే వారంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ శాస్తవేత్తలు చెబుతున్న నేపథ్యంలో పంటల సాగు ప్రారంభం కావచ్చని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా, జులై నుంచి ఆగస్టు మొదటి వారం వరకు రైతులు పంటలు వేస్తారని, కొంచెం ఆలస్యం అయినా ఖరీఫ్ సాగు ఆశాజనకంగా ఉండవచ్చని అంచనా వేశామని ఆయన వివరించారు. తెలంగాణలో 1.36 కోట్ల ఎకరాలు వర్షాధార పంటలు కాగా, ఇందులో 65 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నారు. జులై చివరి రెండు వారాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు చెప్పడంతో రైతులు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. నాట్లు వేసిన రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఆగస్టు నెల వరకు వర్షాలు చూసి ప్రత్యామ్నాయ ప్రణాళిక
తెలంగాణలో ఆగస్టు నెల వరకు చూసి వర్షాభావపరిస్థితులు ఇలానే కొనసాగితే ప్రత్యామ్నాయ ప్రణాళికను వ్యవసాయ శాఖ రూపొందిస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం మెంబర్ కన్వీనర్ షేక్ మీరా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఖరీఫ్ సీజనులో పంటలు వేయడం ఆలస్యం అయితే స్వల్పకాలిక పంటలైన పెసర, నువ్వులు, అలసందలు లాంటి పంటల సాగుకు కావాల్సిన విత్తనాలను వ్యవసాయ శాఖ రైతులకు పంపిణీ చేస్తుందని ఆయన చెప్పారు. కరవు పరిస్థితులు ఏర్పడితే పశువులకు పశుగ్రాసంతోపాటు మినరల్ మిక్చర్ సప్లయి చేస్తామని ఆయన వివరించారు.