హైదరాబాద్‌లో రియల్ భూం...
కూకట్‌పల్లిలో కాసులు కురిపిస్తున్న భూములు...;
హైదరాబాద్ నగరంలో మళ్లీ భూముల ధరలు ఆకాశన్నంటుతున్నాయి.ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ దెబ్బతో సాఫ్ట్ వేర్ ఉద్యోగాల లే ఆఫ్ లతో రియల్ ఎస్టేట్ డమాల్ అనే వార్తలు వస్తున్న తరుణంలో హైదరాబాద్ నగరంలో ఎకరం భూమి ధర రికార్డు స్థాయిలో రూ.65.34 కోట్లకు కొనుగోలు చేయడం సంచలనం రేపింది. రియల్ ఎస్టేట్ భూం పడిపోయిందని ప్రచారం తప్పని నిరూపిస్తూ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓపెన్ ఫ్లాట్లకు మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది.
విస్తరిస్తున్న నగరం
హైదరాబాద్ నగరంలో ఎకరం స్థలానికి రికార్డు స్థాయిలో ధర పలకడంతో ఐటీ ఉద్యోగాల లే ఆఫ్ లతో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని జరుగుతున్న ప్రచారాలకు తెరపడినట్లయింది. హైదరాబాద్ నగరం రోజురోజుకు శివారు ప్రాంతాల్లో విస్తరిస్తుందని, పలు కొత్త రియల్ ఎస్టేట్ వెంచర్లతో రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయని అరవింద రియల్ ఎస్టేట్ యజమాని రాపోలు సతీష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణంతో హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో భూముల విక్రయాలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. మరో వైపు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో ఐటీ కంపెనీల వల్ల రియల్ రంగం దూసుకు పోతుందని ఆయన వివరించారు.
విశ్వనగరంలో పెరుగుతున్న భూముల ధరలు
ఐటీ కంపెనీలు, ఫార్మా పరిశ్రమలు, వ్యాక్సిన్ తయారీ కర్మాగారాలు, కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలు ఇలా ఒకటేమిటి హైదరాబాద్ నగరం విస్తరిస్తూ విశ్వ నగరంగా మారిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అధినేత మాటూరి సురేందర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హైదరాబాద్ నగరం అవుటర్ రింగ్ రోడ్డు వరకు జనవాసాలతో జనసమ్మర్థంగా మారిందని ఆయన చెప్పారు. మరో వైపు రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైలు, మెట్రోరైలు రెండో దశతో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుండటంతో భూముల ధరలు పెరిగాయని సురేందర్ రెడ్డి వివరించారు.