‘పదేళ్ల పాలనపై చర్చకు రెడీనా’.. కేసీఆర్, కిషన్‌కు రేవంత్ ఛాలెంజ్..

పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఉంటే ఈరోజున చంద్రబాబుతో పంచాయితీ ఉండేది కాదన్నారు రేవంత్.;

Update: 2025-02-21 12:09 GMT

గత పాలకుల పరిపాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేశారని, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మార్పుతో తెలంగాణ తిరిగి అభివృద్ధి బాటలోకి అడుగు పెట్టిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అదే విధంగా తమ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, ఐదేళ్ల పాలనలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన చెప్పారు. శుక్రవారం నారాయణపేటలో పర్యటించిన సీఎంరేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణ పేటలో నిర్వహించిన “ప్రజా పాలన- ప్రగతి బాట” బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ చేశారు రేవంత్. పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? ఎక్కడైనా ఎప్పుడైనా తాము చర్చకు రెడీ అని అన్నారు రేవంత్ రెడ్డి.

ఒక్క పేదవాడికి ఇల్లు దక్కలేదు..

‘‘పదేళ్ల కాలంలో రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా ఒక్క పేదవాడికి కూడా ఒక్క ఇల్లు దక్కిన దాఖలాలు లేవు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వం పాలనలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించింది. పదేళ్ల పాటు సీఎంగా ఉన్న కేసీఆర్.. పాలమూరు ప్రాజెక్ట్‌లను ఎందుకు పూర్తి చేయాలేదు. అంతకుముందు ఎంపీగా గెలిచినా.. పార్లమెంటులో ఏనాడూ కూడా పాలమూరు గురించి మాట్లాడలేదు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఈ జిల్లాకు న్యాయం జరగలేదు పదేళ్ల పాటు అంతా అన్యాయమే. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకోవడంపై పెట్టిన దృష్టి జిల్లా అభివృద్ధిపై పెట్టలేదు’’ అని విమర్శించారు.

‘‘గతంలో కొందరు సీఎంలు సైతం తమ రాజకీయానికి పాలమూరును పావుగా వినియోగించుకున్నారు. కానీ జిల్లాకు చేసిందేమీ లేదు. నెట్టెంపాడు, భీమ, కోయిల్‌సాగర్, సంగంబండం, కల్వకుర్తి ప్రాజెక్ట్‌లు పదేళ్ల కాలంలో ఎందుకు పూర్తి కాలేదు. పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఉంటే ఈరోజున చంద్రబాబుతో పంచాయితీ ఉండేది కాదు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగేది కాదు. సాగునీటి కోసం తెలంగాణ రైతుల కన్నీటి బాధలు ఉండేవి కాదు. వైఎస్ఆర్, జగన్.. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్ చోద్యం చూస్తూ కూర్చున్నారు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు. నా మీద పగతోనే మక్తల్-నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్ట్‌ను అటకెక్కించారు’’ అని ఆరోపించారు.

మా పాలనకు వంకలా..!

‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలన బాగోలేదని, అన్నీ లోపాలు, అవకతవకలేనని అంటున్నారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్, 12 ఏళ్ల ప్రధానిగా ఉన్న మోదీ అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 12 నెలల నుంచి పాలన సాగిస్తోంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చర్చకు వస్తే సీఎంకు చర్చించడానికి నేను రెడీ. గత పదేళ్ల పాలనపై చర్చిద్దాం. చర్చలో నేను ఓడితో ముక్కు నేలకు రాస్తా. అదే విధంగా మీరు ఓడితే మీరు ముక్కు నేలకు రాయాలి. ఏమీ చేయకపోగా మేము చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్ట్‌లు, పరిశ్రమలను అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నారు. మోసగాళ్ల మాటలు విని భూసేకరణను అడ్డుకోవద్దు. భూమి కోల్పోయిన వారికి మంచి పరిహారం ఇచ్చి న్యాయం చేసే బాధ్యత నాది’’ అని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్.

మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకులు

నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా అప్పకల్‌లో మహిళా సమాఖ్య పెట్టోల్ బంక్‌ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళా సమాఖ్య సభ్యులకు ఏడాదికి రెండు చీరలు ఇస్తామన్నారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమాఖ్యలో మొత్తం 67 లక్షల మంది ఉన్నారు. ఈ సభ్యులకు ఇకపై రూ.1000 కోట్ల ఖర్చుతో ఏడాదికి రెండు మంచి చీరలు అందిస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. శిల్పారామం దగ్గర మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించడానికి ఏర్పాట్లు చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను మహిళలు నిర్వమించబోతున్నారు. తొలుత ప్రతి జిల్లాలో ఒకచోట ప్రభుత్వ భూముల్లో మహిళా సహాఖ్యలకు పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కటైనా ఉండేలా చర్చలు చేపడతాం. గ్రామాల్లో స్కూళ్ల నిర్వహణ బాగుండేలా మహిళలు చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులు లేకపోయినా, వసతులు సరిగా లేకపోయినా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. నిధులు నేనిస్తా.. నిర్వహణ మీ చేతుల్లో ఉంటుంది.నిధులు ఇచ్చినా నిర్వహణ సరిగా లేకుంటే ప్రయోజనం శూన్యం’’ అని అన్నారు.

Tags:    

Similar News