గేమ్ ఛేంజ్ చేసిన కాంగ్రెస్ సర్కార్
గేమ్ ఛేంజర్ మూవీ టీమ్‌కి తెలంగాణ ప్రభుత్వం భారీ ఝలక్ ఇచ్చింది. అదనపు షోలకు ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకుంది.;
గేమ్ ఛేంజర్ మూవీ టీమ్‌కి తెలంగాణ ప్రభుత్వం భారీ ఝలక్ ఇచ్చింది. అదనపు షోలకు ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకుంది. పుష్ప-2 సినిమా ప్రీయర్స్ సమయంలో సంధ్య థియేటర్లో జరిగిన ఘటనతో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపును నిషేధిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సహా సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పష్టం చేశారు. కానీ గేమ్ ఛేంజర్ రిలీజ్ రావడంతో ఈ అంశంపై నిర్మాత దిల్ రాజు మరోసారి మంతనాలు జరిపారు. అవి సక్సెస్ అయ్యాయి. అదనపు షోలకు, టికెట్ల రేట్ల పెంపుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంది రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. ఈ విషయంలో అధికార పక్షంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. అదే సమయంలో తెలంగాణ హైకోర్టు సైతం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. అసలు టికెట్ల రేట్లు ఎలా పెంచుతారని న్యాయస్థానం ప్రశ్నించింది. రెండు వారాలపాటు అదనపు షోలు నిర్వహించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఎలా నిర్ణయించిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా అసలు బెనిఫిట్ షోల వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించింది. బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ స్పెసల్ షో అంటూ కొత్తగా అనుమతి ఇవ్వడం ఏంటి? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ల రేట్ల విషయంపై పుష్ప-2 కేసుతో పాటు విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది.
మళ్ళీ సర్కార్ యూటర్న్
హైకోర్టు సీరియస్ కావడంతో టికెట్ల రేట్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ యూటర్న్ తీసుకుంది. గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లు పెంపు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో సంక్రాంతి సినిమాలకు టికెట్ హైక్, స్పెషల్ షోలు లేనట్లేనని అర్థమవుతోంది. గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు ముందు సింగిల్ స్క్రీన్స్ రూ.100, రూ.150 పెంచుతూ జనవరి 8న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఉన్నతన్యాయస్థానం ఈ విషయంపై సీరియస్ అయింది. దీంతో తన నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
స్పెషల్ షోలు ఉండవ్
ఇకపై తెలంగాణలో సినిమాల టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలు ఉండవు అని ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు ఉపసంరించుకుంది. గేమ్ ఛేంజర్‌కు ఇచ్చిన వెసులుబాటును ఉపసంరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకు గేమ్ ఛేంజర్ టికెట్ ధరలు, అదనపు షోలకు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంది. తెలంగాణలో ఇక నుంచి తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా సినిమాల స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వమని ప్రకటించింది.