Delhi Elections | ‘కాంగ్రెస్ ఓటమికి ఇద్దరే కారణం’
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. బీజేపీ 48 స్థానాల వరకు సొంతం చేసుకోగా.. ఆప్ 22 స్థానాల్లో దాదాపు గెలిచింది.;
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. బీజేపీ 48 స్థానాల వరకు సొంతం చేసుకోగా.. ఆప్ 22 స్థానాల్లో దాదాపు గెలిచింది. కాంగ్రెస్ మాత్రం ఎన్నికల ఫలితాల ప్రారంభం నుంచి చివరికి వరకు ఒకే నెంబర్‌తో తటస్థంగా నిలిచింది. అదే సున్నా. అయితే ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుండు సున్నా రావడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఈ చర్చ మరింత జోరుగా ఉంది. తెలంగాణలో అయితే ఢిల్లీలో కాంగ్రెస్ తరపున రేవంత్ ప్రచారం చేయడంతో ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరింత కీలకంగా మారాయి. ఇప్పటికే రేవంత్ పాద మహిమ వల్లే కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా కాంగ్రెస్‌కు చురకలంటించారు.
కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలింది: హరీష్
‘‘ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గాడిద గుడ్డు మిగిలింది. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ రెడ్డి గార్ల పాత్ర అమోఘం. ఇక్కడ హామీలు అమలు చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన మీకు ఓట్లు పడతాయా? మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైంది. ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగమాగం చేసిన కులగణన మీకు బెడిసికొట్టింది. ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణను మళ్ళీ నిర్వహించండి. అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడండి. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసి అప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేసుకోండి రేవంత్ రెడ్డి.. లేదంటే మీరు ఎక్కడ అడుగుపెట్టినా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ మీకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు’’ అని పేర్కొన్నారు హరీష్ రావు.
ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి: కేటీఆర్
‘‘ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. సక్సెస్‌ఫుల్‌గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి పోయిండు కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా.. గాడిద గుడ్డు వచ్చింది. నిన్నమొన్నటి దాకా మనల్ని అన్నారుగా సున్నా.. సున్నా అని ఇప్పుడు వాళ్లకి కూడా వచ్చింది. మొత్తానికి మహారాష్ట్రలో ఓడగొట్టిండు.. హర్యానాలో ఓడగొట్టిండు.. ఇప్పుడు ఢిల్లీలో కూడా చిత్తు చేశాడు. కానీ మనమంతా రాహుల్ గాంధీని మెచ్చుకోవాలి. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ వేరుగా పోటీకి నిలబడితే అక్కడ బీజేపీ తప్పకుండా గెలిపిస్తున్నారు రాహుల్. సొంత పార్టీని కూడా ఓడగొట్టి మరీ కమలం గుర్తును గెలిపిస్తున్నారు. నిజంగా చెప్పుకోవాలంటే.. దేశంలో నరేంద్ర మోదీకి, బీజేపీ అతిపెద్ద కార్యకర్త ఎవరైనా ఉన్నా అంటే.. అది రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలే’’ అని చురకలంటించారు కేటీఆర్.