ఆ ఘనత రాజీవ్ గాంధీదే.. కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్

తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు వివాదం రోజురోజుకు అగ్గి రాజుకుంటోంది.

Update: 2024-08-20 07:43 GMT

తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు వివాదం రోజురోజుకు అగ్గి రాజుకుంటోంది. అసెంబ్లీ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే సకల మర్యాదలతో దానిని తొలగిస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని రేవంత్ కొనియాడారు. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన నేత కూడా ఆయనేనని, పంచాయతీ రాజ్ వ్యవస్థలు ఆయన హయాంలోనే బలోపేతమయ్యాయని చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పంజాగుట్టలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ ఘాటుగా బదులిచ్చారు.

చింత చచ్చినా పులుపు చావలేదు..

చింత చచ్చినా పులుపు చావలేదన్న సామెత బీఆర్ఎస్‌కు సరిగ్గా సరిపోతుందని చురకలంటించారు రేవంత్ రెడ్డి. "బీఆరెస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారు. సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదు. అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారు. చేతనైతే ఎవడైనా విగ్రహం మీద చేయి వేయండి.. నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా కేటీఆర్? అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నాడు... బిడ్డా.. మీకు అధికారం ఇక కలనే.. ఇక మీరు చింతమడకకే పరిమితం. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాది. మా చిత్తశుద్ధిని ఏ సన్నాసి శంకించనవసరం లేదు.. విచక్షణ కోల్పోయి అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుంది. సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.

ఇంతకీ కేటీఆర్ ఏమన్నారంటే..

"కాంగ్రెస్ పార్టీ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అధికారంలోకి రాగానే అక్కడి నుంచి తరలిస్తాం. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత బాధతో ఈ మాట చెప్పాల్సి వస్తుంది. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలి అంటే గాంధీభవన్‌ లోనో, రేవంత్ రెడ్డి ఇంట్లోనో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకోవాలి. వందలాదిమంది తెలంగాణ ప్రజల ప్రాణాలు తీసిన కాంగ్రెస్ పార్టీ.. మరోసారి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కకు పెట్టి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతుంది. మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. మళ్లీ నాలుగేళ్లలో తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు పెడుతున్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి.. కాంగ్రెస్ పార్టీ కోరుకున్నచోటికి పంపిస్తాం. ఈరోజు తెలంగాణ తల్లికి కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానం తెలంగాణ మరిచిపోదు’’ అని కేటీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News