తిట్లపోటీలో రేవంత్ కు మొదటి బహుమతి
తిట్లపోటి పెడితే రేవంత్ రెడ్డికి మొదటి బహుమతి వస్తుందని బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు సెటైర్ వేశారు;
తిట్లపోటి పెడితే రేవంత్ రెడ్డికి మొదటి బహుమతి వస్తుందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్ వేశారు. అసెంబ్లీ వేదికగా రేవంత్ చేసిన వ్యాఖ్యలపై హరీష్ కౌంటరిచ్చారు. ముఖ్యమంత్రి స్ధానంలో ఉంటూ రేవంత్ మాట్లాడుతున్న బూతులవల్ల తెలంగాణ పరువుపోతోందని వాపోయారు. అలాగే అబద్ధాలకు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్ గా సరిపోతారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్(Telangana Congress) ముసుగులోని బీజేపీ నేతగానే రేవంత్(Revanth) సభలో మాట్లాడినట్లు మాజీమంత్రి ఆరోపించారు. కేసీఆర్(KCR) ను మార్చురీకి పంపాలన్న రేవంత్ కు సంస్కారముందా అని నిలదీశారు.
కేసీఆర్ ను మార్చురీకి పంపాలన్న రేవంత్ సభలో మాటమార్చి తాను బీఆర్ఎస్ ను అన్నానే కాని కేసీఆర్ ను కాదని నిసిగ్గుగా అబద్ధాలు చెపినట్లు మండిపోయారు. కేసీఆర్ మీదచేసిన వ్యాఖ్యలను రేవంత్ వెనక్కు తీసుకని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. క్షమాపణ అడిగితే కేసీఆర్ కూడా రేవంత్ ను పెద్దమనసుతో క్షమించేస్తారన్నారు. తమ హయాంలో ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని డిమాండ్ చేసిన రేవంత్ ఇపుడు అదే ఎల్ఆర్ఎస్ కు ఫీజులు కట్టాలని పేదలను వేధిస్తున్నట్లు మండిపోయారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు చేసిన ఫార్మా(Pharma City) భూ సేకరణను అడ్డుకున్న రేవంత్ ఇపుడు అదేపనిచేస్తున్నట్లు ఆరోపించారు. ఫోర్త్ సిటి(Fourth City)పేరుతో 15 వేల ఎకరాల ఎందుకు సేకరిస్తున్నారని నిలదీశారు. తమ హయాంలో జరిగిన భూసేకరణను తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు అప్పగించాలని లేకపోతే ఫార్మాసిటీని వెంటనే నిర్మించి యువకులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మోడీ మంచోడు కిషన్ రెడ్డి చెడ్డొడన్నట్లుగా రేవంత్ మాటలను హరీష్ తప్పుపట్టారు. సంపూర్ణ రుణమాఫీపై మధిర, కొడంగల్, సిద్ధిపేట ఎక్కడైనా సరే బహిరంగచర్చకు రేవంత్ తో సిద్ధమని హరీష్ సవాలు విసిరారు. సంపూర్ణ రుణమాఫీ జరిగిందని తేలితే తాను ముక్కు నేలకు రాస్తానని రుణమాఫీ కాలేదని తేలితే ప్రజలకు రేవంత్ క్షమాపణ చెబుతారా అని చాలెంజ్ చేశారు.