తెలంగాణ బీజేపీ నేత హత్యకు కోట్లరూపాయల కాంట్రాక్ట్
మహబూబ్ నగర్ జిల్లాలోని బీజేపీ నేత హత్యకు ప్రత్యర్ధులు భారీఎత్తున సుపారి ఇచ్చిన విషయం బయటపడటంతో సంచలనం రేగుతోంది;
తెలంగాణలో హత్యా రాజకీయాలు పెరిగిపోతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని బీజేపీ నేత హత్యకు ప్రత్యర్ధులు భారీఎత్తున సుపారి ఇచ్చిన విషయం బయటపడటంతో సంచలనం రేగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో కొండా ప్రశాంత్ రెడ్డి (konda Prasanth Reddy)బీజేపీ(BJP Leader)లో చాలా యాక్టివ్ లీడర్. 2023 అసెంబ్లీ(Telangana Assembly) ఎన్నికల్లో దేవరకద్ర అసెంబ్లీ నుండి పోటీకూడా చేశారు. ఈయనకు ఎంతమంది ప్రత్యర్ధులున్నారో తెలీదుకాని వారిలో ఒకళ్ళు కొండా హత్యకు కోట్లరూపాయలు కాంట్రాక్టు(Contract Killing) కుదుర్చుకున్నారు. కొండా రాజకీయాలతో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా బాగా బిజీగా ఉంటాడు.
ఏవిషయంలో ఎవరితో శతృత్వంపెరిగిందో తెలీదుకాని కొండాను చంపటానికి కిరాయి హంతకులు రెడీ అయ్యారు. ఈ విషయం ఎలాగ బయటపడిందంటే కొండా ఎక్కడికి వెళితే కొందరు అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. కొండా కోర్టుకు వెళినా, తన ఆఫీసుకు, ఇంటికి వెళ్ళినా కొందరు అనుసరిస్తున్నట్లు అనుమానం మొదలైంది. తనను వెంటాడుతున్న వాళ్ళని పసిగట్టేందుకు కొండా జాగ్రత్తలు తీసుకున్నాడు. దాంతో కొండాను కొందరు అనుమానాస్పద వ్యక్తులు నీడలాగ అనుసరిస్తున్నట్లు అర్ధమైపోయింది. వీరి విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా సదరు బీజేపీ నేత పోలీసులకు చెప్పాడు. దాంతో పోలీసులు కూడా వీళ్ళని గమనించి ఒక్కసారిగా ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో అనుమానాస్పదవ్యక్తులు కర్నాటక, కర్నూలుకు చెందిన కిరాయిహంతకులుగా బయటపడింది. ఒక హత్యకేసులో కొండా నిందితుడుగా ఉన్నాడు. అలాగే ఈ నేత హత్యకు రు. 2.5 కోట్లకు కాంట్రాక్టు కుదిరినట్లుగా విచారణలో బయటపడింది. దాంతో హత్యకేసులో కొండా ప్రత్యర్ధులే కాంట్రాక్టు కిల్లర్స్ ను రంగంలోకి దింపినట్లు అర్ధమైపోయింది. వీళ్ళదగ్గర దొరికిన మొబైల్ ఫోన్లను స్వాధీనంచేసుకున్న పోలీసులకు కొన్ని ఆడియోలు దొరికినట్లు సమాచారం. హత్య కాంట్రాక్టుకు సంబంధించిన ఆడియోలు ఇపుడు పోలీసుల స్వాధీనంలో ఉన్నాయి. కేసు నమోదుచేసుకుని పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.