సిట్ ముందుకు ఆర్ఎస్ ప్రవీణ్..

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు.;

Update: 2025-07-28 08:17 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ విచారణకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం హాజరయ్యారు. ఈ కేసులో ఆయన వాంగ్మూలం కీలకంగా మారనుంది. కాగా ఈ కేసు విచారణకు హాజరై తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలని కోరుతూ ప్రవీణ్‌కు సీట్ అధికారులు గతంలోనే నోటీసులు జారీ చేశారు. రెండు సార్లు సిట్ నోటీసులు అందుకున్న ప్రవీణ్.. సోమవారం విచారణకు హాజరయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడం కోసం ఆయనకు నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా బీఎస్‌పీ హయాంలో తన ఫోన్ ట్యాప్ అవుతోందని, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తన ఫోన్‌ను ట్యాప్ చేస్తూ తనపై నిఘా ఉంచిందని ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. దీంతో సిట్ అధికారులకు ఇచ్చే ఆయన వాంగ్మూలం ఎలా ఉంటుంది? అనేది అత్యంత చర్చనీయాంశంగా మారింది.

బీఆర్ఎస్ హయాంలో సంక్షేమ హాస్టళ్ల సెక్రటరీగా పనిచేసిన ప్రవీణ్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్వచ్చంధ ఉద్యోగవిరమణ చేశారు. ఎందుకు చేశారంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం కోసం. కొత్తపార్టీ పెట్టే విషయమై ఆలోచించిన ప్రవీణ్ తర్వాత ఆలోచన మానుకుని బీఎస్పీలో చేరారు. బీఎస్పీలో చేరిన ప్రవీణ్ రాష్ట్ర అధ్యక్షుడిగా అభ్యర్ధులను పోటీచేయించటమే కాకుండా తాను సిర్పూర్ నియోజకవర్గంలో పోటీచేయటం, ఓడిపోవటం అందరికీ తెలిసిందే. ఎన్నికలసమయంలో ప్రచారానికి వెళ్ళిన ప్రతి నియోజకవర్గంలో కేసీఆర్ పాలనపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. అంతేకాకుండా తన ఫోన్ ను కేసీఆర్ ట్యాప్ చేయిస్తున్నట్లు ఆరోపణలు గుప్పించారు.

ప్రవీణ్ మీద అనుమానాలు ఎందుకు పెరుగుతున్నాయంటే ఇపుడు కేసీఆర్ కు ప్రవీణ్ వీరాభిమానిగా మారారు. ఆరోపణలు చేసినపుడేమో బద్ధవిరోధిగా ఉన్న ప్రవీణ్ మారిన పరిస్ధితుల కారణంగా వీరాభిమాని అయిపోయారు. అప్పట్లో కేసీఆర్ కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలను ఇపుడు కట్టుబడి ఉండేస్ధితిలో లేరు. అప్పుడుచేసిన ఆరోపణలకే ప్రవీణ్ ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటే కేసీఆర్ పుట్టిముణుగుతుంది. అందుకనే ప్రవీణ్ ప్లేటు ఫిరాయించారని అందరూ అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ వాంగ్మూలం ఎలా ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News