‘‘మద్యం,గంజాయి,నల్లమందు, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు తీసుకోవద్దని సనాతన ధర్మంతోపాటు అన్ని మతాలు తమ తమ గ్రంథాల్లో చెబుతున్నాయి...కానీ ధర్మానికి విరుద్ధంగా సమాజంలో నేడు కొందరు మాదకద్రవ్యాలు, మద్యం తీసుకుంటూ మత్తులో జోగుతున్నారు’’అని అన్ని మతాలకు చెందిన ధార్మిక గురువుల సమ్మేళనం ఆందోళన వ్యక్తం చేసింది. అన్నీ మతాలు చెబుతున్న విధంగా మద్యం, మాదకద్రవ్యాల ముప్పును సమూలంగా నిర్మూలించాలని ధార్మిక గురువులు ముక్తకంఠంతో తీర్మానించారు. మాదకద్రవ్యాల ముప్పును అరికట్టడంలో ధార్మిక గురువుల పాత్ర అంశంపై హైదరాబాద్ లో‘ధార్మిక జనమోర్చా’ సర్వమత గురువుల సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి వచ్చిన వివిధ మతాల గురువులు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ‘ఫెడరల్ తెలంగాణ’తో మాట్లాడారు. ఆ విశేషాలు...
యువత మత్తులో మునగవద్దు : లక్ష్మీ నరసింహం, చిలుకూరు బాలాజీ దేవాలయ పూజారి
సనాతన ధర్మం నుంచి దూరంగా ఉన్న వారే సురాపానం, గంజాయి, పొగాకు, మాదకద్రవ్యాల మత్తులో జోగుతున్నారని చిలుకూరు బాలాజీ దేవాలయ పూజారి లక్ష్మీ నరసింహం చెప్పారు. సనాతన ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించే వారు మద్యానికి, మాదకద్రవ్యాలకు, మత్తుకు దూరంగా ఉంటారని చెప్పారు. మత్తులో జోగుతున్న యువత మాదకద్రవ్యాల బారి నుంచి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలనేది అన్ని మతాలు చెబుతున్న, యువత చెడుమార్గం పడుతుందని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా తాము ఐదంచెల పోరాటం సాగిస్తామని లక్ష్మీ నరసింహం వివరించారు.
పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య దూరం పెరిగిందని, తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోవడం లేదని, దీనివల్ల పిల్లలు మద్యం, మాదకద్రవ్యాలకు అలవాటు పడి మత్తులో జోగుతున్నారని జైన మత ప్రతినిధి ఖుషీ జైన్ చెప్పారు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడటం, ఒత్తిడికి లోనవడం వల్ల వారు మత్తుకు బానిసలవుతున్నారని ఆమె చెప్పారు. పిల్లలతో తల్లిదండ్రులు అనుబంధం పెంచుకొని వారిని వ్యసనాల బారిన పడకుండా చూడాలని ఖుషీ జైన్ సూచించారు.
వ్యసనాలకు బానిస కావద్దు : ఫాదర్ అంతయ్య, కేథలిక్ చర్చ్, సిఖ్ విలేజ్
మద్యం, మాదకద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాల వ్యసనాలకు బానిసలుగా మారొద్దని సిఖ్ విలేజ్ కేథలిక్ చర్చ్ ఫాదర్ అంతయ్య కోరారు. మనిషి శరీరం అంటే అది దేవుని నివాసమని బైబిల్ చెబుతుందని, అలాంటి దేవుడు నివాసమున్న శరీరంలోకి మత్తు పదార్థాలు తీసుకోవడం చాలా పెద్ద తప్పు అని అంతయ్య వ్యాఖ్యానించారు. డ్రగ్స్ పెడ్లర్లపై చర్యలు తీసుకొన మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలని అంతయ్య సూచించారు.
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అన్నిమతాల గురువుల ఏకతా సందేశం : ముహ్మద్ సలీం ఇంజినీర్, ధార్మిక జనమోర్చా జాతీయ కన్వీనర్, ఢిల్లీ
నేడు సమాజంలో పెచ్చరిల్లిపోయిన మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అన్ని మతాల గురువులు, మత పెద్దలు కలిసికట్టుగా ఏకతా సందేశం ఇవ్వాలని ఢిల్లీకి చెందిన ధార్మిక జనమోర్చా కన్వీనర్ ముహ్మద్ సలీం ఇంజినీర్ కోరారు. సమాజ హితం కోసం పనిచేసేలా అన్ని మతాల ధర్మగురువులతో కలిసి ధార్మిక జనమోర్చాను 2001లో ఢిల్లీలో ప్రారంభించామని ఆయన చెప్పారు. దేశం కోసం సమాజం కోసం తామంతా కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా, మానవత్వం, నైతిక విలువలను పెంపొందేలా అన్యాయాలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా తామంతా కలిసి పోరాడుతామని సలీం ఇంజినీర్ చెప్పారు. మతాలు వేరైనా ఎలాంటి అనుమానాలు లేకుండా ఒకరినొకరు గౌరవించుకునేలా డ్రగ్స్ కు వ్యతిరేకంగా కలిసి పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు. మద్యం, మాదకద్రవ్యాల వల్ల ఏటా లక్షలాదిమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
డ్రగ్స్ ను నిర్మూలిద్దాం రండి : డీఎస్పీ సుబ్బరామిరెడ్డి, తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో
తెలంగాణలో డ్రగ్స్ ను సమూలంగా నిర్మూలించేందుకు అందరూ కలిసి రావాలని తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డీఎస్పీ సుబ్బరామిరెడ్డి కోరారు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడటం, ఒత్తిడి, ఒంటరితనం, ప్రేమ వైఫల్యం, క్రమిశిక్షణ లోపించడం వల్ల యువత డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని ఆయన చెప్పారు. ధూమపానం, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ తీసుకుంటూ యువత మత్తులో జోగుతున్నారని ఆయన పేర్కొన్నారు. డ్రగ్ కల్చర్ హైదరాబాద్ నుంచి గ్రామాలకు కూడా పాకుతుందన్నారు. డ్రగ్స్ నిరోధానికి తాము పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు.
అన్ని మతాలు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకమే : ముహ్మద్ ముజాహిద్, ఇస్లామిక్ కాలమిస్ట్
హిందూ, ముస్లిం, క్రైస్తవ, జైన మతాలు అన్నీ కూడా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకమేనని ఇస్లామిక్ కాలమిస్ట్ ముహ్మద్ ముజాహిద్ చెప్పారు. దేవాలయాలు, మసీదులు, చర్చ్ లు, జైన మందిరాల్లో ఆథ్యాతిక బోధనలే కాకుండా సమాజాన్ని సన్మార్గంలో నడిపేందుకు కావాల్సిన సూచనలు, సలహాలను యువతకు అందించాలని ఆయన కోరారు.
డ్రగ్స్ కు వ్యతిరేకంగా వీడియో ప్రదర్శన
డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఓ యువకుడు మృత్యువాత పడి, తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన వైనంపై వీడియో చిత్రాన్ని తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ప్రదర్శించింది. డ్రగ్స్ మహమ్మారి బారిన పడి యువత ఏ విధంగా నష్టపోతుందనే విషయంపై వీడియోలో ప్రదర్శించారు.