తెలంగాణ సర్వీస్ రంగంలో మంచి ఉద్యోగాల వాటా బాగా తక్కువ
సర్వీసు రంగం ద్వారా వస్తున్న ఉద్యోగాలలో అధిక భాగం ఉద్యోగ భద్రత, తక్కువ వేతనాలున్నవే : నీతి ఆయోగ్ రిపోర్ట్
తెలంగాణలో సర్వీసు రంగం దేశంలోనే నెంబర్ వన్ గా బాగా విస్తరించినా నాణ్యమయిన ఉద్యోగాలు కల్పన ఆశించినంత జరగలేదు. మంచి జీతాలు అందించే ఐటీ రంగం లాంటి ఉద్యోగాల లో కంటే పచారి కొట్లు పెట్టుకునే ఎక్కువ గా బ్రతుకుతున్నారు!. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఇంతే.
భారత దేశ పురోభివృద్ధికి సర్వీసు రంగం తోడ్పాటు మీద నీతి ఆయోగ్ విడుదల చేసిన 2025 రిపోర్ట్ ఈవిషయాన్ని వెల్లడించింది. ఉద్యోగ కల్పనలో, అందునా భద్రత ఉండే మంచి ఉద్యోగాల కల్పనలో సర్వీసు రంగానికి ఉన్న పరిమితులను ఈ నివేదిక ఎత్తి చూపింది.188 మిలియన్ ల మందికి ఉపాధినిస్తున్న ఈ రంగం లో గత ఆరు సంవత్సరాలలో కొత్తగా 40 మిలియన్ ల ఉద్యోగాలే వచ్చాయి. నీతి ఆయోగ్ రెండు రోజుల కిందట సర్వీస్ రంగం పనితీరు మీద రెండు నివేదికలను (1. India’s Service Sector: Insights from Employment Trends and State Level Dynamics 2) ‘India’s Service Sector: Insights from GVA Trends and State Level Dynamics) విడుదల చేసింది.
ఈ రంగాల పెరుగుదల రాష్ట్రాల మధ్య సమానంగా లేదని వాటిని మరింతగా విస్తరించి మెరుగు పరచడానికి మన దేశం సన్నద్ధం కావాలని అది చెప్పింది.
తెలంగాణ విషయానికి వస్తే సర్వీస్ రంగం ప్రగతి చాలా గర్వంగా కనిపిస్తుంది. మొత్తం ఉద్యోగాలలో 34.8శాతం వాటాతో తెలంగాణ సర్వీస్ రంగం దేశంలోనే టాప్. జాతీయ సగటు 29.7 శాతమే. 2023-24 నాటికి ఈరంగంలో 62 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఇక్కడే తిరకాసు ఉంది. అంకెలు, రికార్డులు బాగున్నాయి. ఈ ఉద్యోగాలో ఉద్యోగాలలో భద్రత లేని అసంఘటిత (అన్ అర్గనైనజ్డు) ఉద్యోగాలే ఎక్కువ. అంటే టెంపరరీ ఉద్యోగాలే ఎక్కువ. అల్పాదాయ ఉద్యోగాలే ఎక్కువ. రాష్ట్రం లో హోల్ సేల్ బిజినెస్, రిటైల్ వ్యాపారం లాంటి సేవారంగాల మీద వాట 28.2 శాతం ఉంది. ఇది చాలా ఎక్కువ. ఇందులోని ఉద్యోగాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇళ్లకు ఆహారం , సరుకులు అందించే గిగ్ వర్కర్లు కూడా అసంఘటిత రంగం కిందికే వస్తారు. వీటిలో ఎంత ఉద్యోగ భద్రతఉంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు.
మంచి జీతాలు ఉండే ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ( ఐటీ) ద్వారా కేవలం 12 శాతం మాత్రమే ఉద్యోగ కల్పన జరిగింది. మంచి ఉద్యోగాలు అందించిన ఐటి రంగంతో ఉపాధికల్పన తక్కువ అని ఈ నివేదిక చాాల స్పష్టంగా పేర్కొంది.
మన రాష్ట్రం లో సేవా రంగాల మీద మొత్తంగా 34.8 శాతం ఆధారపడి ఉన్నారు. ఇది జాతీయ సగటు (29.7 శాతం) కంటే చాలా ఎక్కువ. యిక పొరుగున వున్న ఆంధ్ర ప్రదేశ్ లో నూ సేవారంగం లో 31.8 శాతం (7.8 మిలియన్ కార్మికులు) ఉపాధి పొందుతున్నారు. యిది జాతీయ సగటు 29.7 శాతం కంటే ఎక్కువ. 2011-12 లో సర్వీసు రంగంలో 27.7 శాతం పని చేశారు.
దేశ ఆర్థిక రంగంలో 2010-11 నుండి 2023-24 మధ్య సర్వీసు రంగ ద్వారా విలువ జోడింపు శాతం పెరిగింది. అదే సమయం లో వ్యవసాయం వాటా 21.8 శాతం నుండి 16.7 శాతానికి పడిపోయింది. ఉత్పత్తి రంగం వాటా పెద్దగా మార్పు లేకుండా 28 శాతం నుండి 29 శాతానికి పరిమితం అయ్యింది. సర్విస్ రంగం వాటా మాత్రం 49 శాతం నుండి 54.5 శాతానికి పెరిగింది.
దేశ ఆర్థిక వ్యవస్థ లో సేవారంగం పాత్ర గత కొంతకాలంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అది 2024-25 నాటికి మొత్తం దేశ లో జరిగే జీవీఎ లో దాని పాత్ర 55 శాతానికి చేరింది. వ్యవసాయం, ఉత్పత్తి రంగాలు కేవలం 16 మరియు 29 శాతం మాత్రమే వాటా కలిగివున్నాయి. సర్విస్ రంగాలలో ఐటీ, ఆర్థిక సేవలు, స్థిరాస్తి లాంటి వృత్తి నైపుణ్య రంగాలతో పాటు సంప్రదాయ వ్యాపారం, ఆతిధ్య మరియు రవాణా రంగాలు ఉద్యోగ కల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వాటి పాత్ర రాష్ట్రాల వారీగా మారుతుందని అది పేర్కొంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళ నాడు మరియు తెలంగాణ లు అధిక ఉత్పాదకత వున్న రంగాల ద్వారా సేవా రంగాలలో విలువ జోడింపు లో తమ పాత్ర పోషిస్తున్నాయి.
రిపోర్ట్ పై విశ్రాంత హెచ్ సి యువ్ ప్రొఫెసర్ డి. నరసింహ రెడ్డి మాట్లాడుతూ, “పాలకుల 2047 వికసిత్ భారత్ లక్ష్యం లో భాగంగా నీతీ ఆయోగ్ ఈ అధ్యయనం చేసింది. సర్విస్ రంగం ద్వారా జరిగే జీవీఎ ఎక్కువగా వుంటుంది. అందుకే వాళ్ళు దీనిని త్వరిత అభివృద్దికి మార్గం గా చూస్తున్నారు. అది ప్రాథమిక ద్వితీయ శ్రేణి రంగాలయిన వ్యవసాయం ఉత్పత్తి రంగాలకంటే ఎక్కువే. కూరగాయలు అమ్ముకునే వాళ్ల నుండి అధిక జీతాలు పొందే ఫైనాన్స్ సంస్థలోని ఉద్యోగస్థుడు ఈ కోవలోకే వస్తారు. అయితే నేడు సర్విస్ రంగం ఎక్కువ భాగం (80 శాతం) సృష్టిస్తున్న ఉద్యోగాలకు భద్రత లేకుండా, తక్కువ వేతనాలతో ఆరోగ్య యితర సదుపాయాలు లేకుండా వున్నాయి. 2018-24 మద్య దాని వాటా 52 శాతం నుండి 55 శాతానికి పెరిగింది.”
దేశం లో సర్వీసు రంగం ద్వారా జీవీఎ లో 55 శాతం కంటే ఎక్కువ జాతీయ సగటు వున్న రాష్ట్రాలు ఢిల్లీ (84 శాతం), చండీగఢ్ (89 శాతం), కర్ణాటక (62 శాతం), కేరళ (62 శాతం), తెలంగాణ (60 శాతం), బీహార్ (58 శాతం) మరియు మహారాష్ట్ర (56 శాతం). వీటి ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక సేవలు, స్థిరాస్తి, వృత్తి నైపుణ్య రంగాల ద్వారా తరతమ భేధాలతో వున్నాయి. హైదరాబాద్ కేంద్రం గా ఐటీ అంకుర సంస్థల (స్టార్ట్ అప్) ప్రారంభం లో టి హబ్, టాస్క్ (TASK), టీ వర్క్స్ లాంటి వాటిని మొదలు పెట్టడం ద్వారా తెలంగాణ ముందుంది. అధికారిక గణాంకాల ప్రకారం వ్యాపారం, ఆతిధ్య రంగాలు 20.8 శాతం వాటా కలిగి వున్నాయి. విద్య, వైద్యం యితర కమ్యూనిటి సేవలు 12.9 శాతం వాటా కలిగి వున్నాయి. వీటి వాటా స్థూల విలువ జోడింపు లో తక్కువ అయిన అవి సామాజిక మౌలిక సదుపాయాలు ఉద్యోగ కల్పన లో ముఖ్య పాత్ర కలిగి వున్నాయి అని రిపోర్ట్ చెప్పింది.
దేశం లో సర్విస్ రంగం 188 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తూ దేశం లో జరిగే దేశ ఆదాయం లో సగ భాగం కలిగి వుంది. అది కోవిడ్-19 లాంటి ఉత్పాతాలను కూడా తట్టుకుని నిలబడింది. అయితే ఎక్కువ భాగం ఉద్యోగాలు వ్యాపారం, రవాణా లాంటి సంప్రదాయ, తక్కువ ఉత్పాదక రంగాల లో వాటి కల్పన వుంది. యివి ఎక్కువ భాగం అసంఘటిత రంగ ఉద్యోగాలు. అయితే ఈ రంగం లో సరైన నిర్మాణాత్మక మార్పులు చేసి మెరుగైన ఉద్యోగాల కల్పనకు కృషి చేయాల్సిన అవసరం వుంది.
సర్వీసు రంగం ద్వారా జీవీఎ 2011-12 లో 52.8 శాతం కాగా అది 2023-24 కు 62.4 శాతానికి చేరి జాతీయ సగటును మించిపోయింది. యిది హైదరాబాద్ లో హైటెక్ సిటీ దాని పరిసరాలలో వున్న సంస్థల నుండి జరిగిన ఐటీ ఎగుమతులు, డిజిటల్ రంగానికి చెందిన మౌలిక సదుపాయాల లో పెరుగుదలను సూచిస్తోంది. జీవీఎ లో సరాసరి 40 నుండి 50 శాతం మద్యన వాటా వున్న రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్ (42 శాతం) హర్యానా, (49 శాతం), పంజాబ్ (48 శాతం), ఉత్తర ప్రదేశ్ (48 శాతం), రాజస్థాన్ (42 శాతం), జార్ఖండ్ (42 శాతం) మరియు అస్సాం (42 శాతం).
దేశ ఆదాయం లో సర్విస్ రంగం పాత్ర అన్నీ రంగాల కంటే స్థిరంగా ను నిలకడగాను వుంది.
కానీ వ్యవసాయ రంగం వాతావరణ మార్పుల కుదుపులకు గురి అయ్యి దుర్బలంగా వుండగా, తయారీరంగం ఎగుడు దిగుడులను ఎదురకుంటోంది. అయితే సర్వీసు రంగం మాత్రం నిలకడగా వుంది. కరోనా తదుపరి ఆర్థిక రంగం ఐటీ, ఫైనాన్స్, వృత్తి నైపుణ్య రంగాలు డిజిటల్ ఆధారితంగా తమ కార్యకలాపాలు చేపట్టి ఎదిగాయి. యిది ఆర్థిక రంగ స్థూల స్థిరత్వానికి దీర్ఘ కాలికంగా దాని ఎదుగుదలకు సర్విస్ రంగం ప్రాధాన్యతను తెలియచేసింది.
ఆర్థిక, ప్రభుత్వ రంగాలు ఈ పెరుగుదలకు దోహద పడ్డాయి. విద్య వైద్యం కరోనా తదుపరి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రవాణా, ప్రయాణ మరియు వ్యక్తిగత సేవలు మరింత ఎగుడు దిగుడులను గురి అయ్యి ఉద్యోగాల కల్పన కు వినియోగానికి దోహదం చేయటానికి ఉపయోగ పడ్డాయి. డిజిటల్ ప్లాట్ ఫామ్ లు మరియు ఈ కామర్స్ ల పెరుగుదల తో చిన్న రంగాలయిన టెలికమ్యునికేషన్, భీమా, పోస్టల్ మరియు ఆడియో విజువల్ సర్విస్ లు ఎదిగాయి.
సర్విస్ రంగం రాష్ట్ర ఆదాయ సరళి:
ఈ రిపోర్ట్ రాష్ట్ర జీవీఎ కు రాష్ట్ర తలసరి ఆదాయ స్థాయి కి వున్న దెగ్గరి సంబందాన్ని సూచిస్తుంది. ఢిల్లీ, చండీగఢ్, కర్ణాటక, తెలంగాణ మరియు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల అధిక ఆదాయం ఐటీ, ఫైనాన్స్ మరియు వృత్తి నైపుణ్య రంగాల వలన కలిగింది అనేది స్పష్టం.
ఈ ఏడు 2024-25 ఆర్థిక సర్వే మన దేశం కూడా ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సరళి లో నే దాని ఎదుగుదలకు సేవారంగమే ఇరుసుగా వుంది అని స్పస్టం చేస్తోంది. సర్విస్ రంగం వాటా దేశ జీవీఎ లో 55 శాతం గా వుంది. యిది 2013-14 లో 51 శాతం గా ఉండింది. ఈ రంగం లోకి మొత్తం విదేశీ పెట్టుబడులలో అత్యధిక భాగం వచ్చిన ఉద్యోగాల కల్పన లో దాని పాత్ర కేవలం 30 శాతం మాత్రమే.
దక్షిణాది రాష్ట్రాలైన కేరళ (48.5 శాతం, 7.5 మిలియన్ లు), ఆంధ్ర ప్రదేశ్ (31.8 శాతం, 7.8 మిలియన్ లు), కార్మికులు సర్విస్ రంగంలో ఆరోగ్య, విద్య మరియు వ్యాపార రంగాల లో వున్నారు. ప్రపంచ ఐటీ కేంద్రాలుగా ఉన్న కర్ణాటక, తెలంగాణ లు వారి కార్మిక శక్తి లో 33-34 శాతం ఐటీ రంగం లో వున్నారు. ఈ రాష్ట్రాలలో కలుగుతున్న ఉద్యోగాల కల్పన కంటే వారు సృష్టిస్తున్న విలువ ఎక్కువ వేగంగా పెరుగుతోంది.
రాష్ట్రాల మద్యన సర్విస్ రంగం లో అంతరాలు:
రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల మద్యన వ్యత్యాసాలు వున్నా 2011-12 నుండి 2023-24 మద్యన సర్విస్ రంగం యొక్క భాగస్వామ్యం పెరిగింది. యిది ఆయా రాష్ట్రాలు సర్విస్ రంగం లో తాము పోషించగలిగిన పరిస్థితుల పైన ఆధారపడి జరిగింది. ఈ రంగం అభివృద్ది లో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళ నాడు, తెలంగాణ ముందు వరస లో ఉన్నాయి. కర్ణాటక లో సర్విస్ రంగం వాటా 56.8 శాతం నుండి 65.9 కి, కేరళ లో 57.5 నుండి 64.3 కు, తమిళ నాడు లో 50.56 నుండి 51.7 కు మరియు తెలంగాణ వాటా 52.8 నుండి 62.4 శాతానికి పెరిగాయి. ఈ పెరుగుదల బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్ కేంద్రంగా ఐటీ, ఆర్థిక సేవలు మరియు విజ్ఞాన ఆధారిత పరిశ్రమల ఆధారంగా ఈ రాష్ట్రాలు నమోదు చేశాయి. యిందులో ఐటీ మరియు డిజిటల్ సేవల్లో కర్ణాటక ముందు వరసన వుండగా, తెలంగాణ నిర్మాణాత్మక మార్పు లను చేసుకుంటూ అది ఇన్నొవేషన్ కేంద్రంగా సాంకేతిక రంగం లో ఎగుమతులు చేస్తూ రెండవ స్థానంలో వుంది యిక తమిళ నాడు మూడవ స్థానం లో వుంది.
హోటళ్లు రెస్టారెంట్ ల రంగం లో యిదే కాలం లో ఆంధ్ర ప్రదేశ్ బాగా వృద్ధి చెంది తొమ్మిదవ స్థానం నుంచి ఐదవ స్థానానికి చేరుకుంది. తెలంగాణ 2023-24 లో తొమ్మిదవ స్థానం లో వుంది. రవాణా నిల్వ రంగాలు జీవీఎ లో 8.1 శాతం కలిగి వున్నాయి. యిందులో మహారాష్ట్ర ముందు వరసలో ఉండగా తెలంగాణ ఎనిమిదవ స్థానం లో వుంది. ఆంధ్ర ఏడవ స్థానం నుండి అయిదవ స్టాయికి పడిపోయింది. 2011-12 లో ఒక రాష్ట్రం గా ఉనికి లో లేని తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం లో 2023-24 లో ఆరవ స్థాయికి చేరింది. 19.4 శాతం తో మహారాష్ట మొదటి స్థానం లో వుంది.
దేశం లో సేవల రంగంలో మన పాత్ర పెరగటానికి ఉత్తర ఈశాన్య భారతం లో మెరుగైన విద్య సాంకేతిక విద్యను అందించటం ద్వారా సాధించవచ్చు. యిది ప్రాంతాల మద్యన వ్యత్యాసాలను తగ్గించటానికి ఉపయోగపడుతుంది. దేశం లో నిపుణులైన కార్మికులు కేవలం నాలుగు శాతం మాత్రమే ఉన్నారు. యూరోపియన్ దేశాలలో 60 శాతం నిపుణులైన కార్మికులు వున్నారు, అని విశ్రాంత ప్రొఫెసర్ టి. ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
సర్వీసు రంగం ఎదుగుదలకు సవాళ్ళు:
దేశం లో సర్విస్ రంగం లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు 30 నుండి 44 సంవత్సరాల మద్యన వున్నారు. మారుతున్న సాంకేతిత పరిస్థితి రీత్యా వీరి నైపుణ్యాలను పెంచాల్సిన అవసరం వుంది. గ్రామీణ మహిళలు ఈ రంగం లో కేవలం 10.5 శాతం భాగస్వామ్యం మాత్రమే కలిగివున్నారు. పట్టణ ప్రాంతాల్లో వారి పాత్ర 60 శాతం వరకు వుంది. ఈ పరిస్థితి అన్నీ రాష్ట్రాల మద్యన ఒకే రకంగా లేదు. మహారాష్ట్ర, తమిళ నాడు మరియు ఉత్తర ప్రదేశ్ ల లో ఈ రంగం లో వున్నవారి సంఖ్య కు వారి ఉత్పత్తి మద్యన సమతూకం వుండగా, బీహార్, మధ్య ప్రదేశ్, గుజరాత్ ల లో దిగువ స్థాయి తక్కువ ఉత్పాదక ఉద్యోగాలే ఎక్కువ. యిక నాలెడ్జ్ కేంద్రాలుగా వున్న కర్ణాటక, తెలంగాణ ల లో అధిక స్థూల విలువ జోడింపు ఉద్యోగాలు వున్నా అవి చాలా తక్కువ సంఖ్య లో మాత్రమే వుంటున్నాయి. యిది మనకు కొత్త అవకాశాలను అలాగే మన పరిమితులను ఎత్తి చూపిస్తుంది, అని రిపోర్ట్ చెప్పింది.
ప్రపంచంలో డిజిటల్ పరంగా, కృత్రిమ మేధ, హరిత పరివర్తన, దేశాల మద్యన సర్విస్ రంగం లో జరిగే వ్యాపారం పైన కూడా యివి ప్రభావం చూపుతాయి. డిజిటల్ ఆరోగ్యం, ఫిన్ టెక్, లాజిస్టిక్స్, అవుట్సోర్సింగ్ ల వలన కొన్ని మిలియన్ ల ఉద్యోగాలు పుడతాయి. కానీ అదే సమయం లో దేశం లో మన కార్మికులు తగిన నైపుణ్యం లేక పోతే ఈ రంగాల నుండి తోసివేయ బడతారు లేదా అసంఘటిత పనుల వైపు నెట్టి వేయబడతారు అని అది హెచ్చరించింది.
“వస్తున్న ఏఐ తదితర సాంకేతిక మార్పులమూలంగా ఉద్యోగాలు పోతున్నాయి. ఆలాంటి వారిని ప్రభుత్వం మళ్ళీ ఉద్యోగాలకు సిద్దం చేయాలి. వారికి కావాల్సిన నైపుణ్యం యివ్వాలి. అందుకు అయ్యే ఖర్చు కార్పొరేట్ల నుండే వసూలు చేసి యివ్వాలి. లేకపోతే ఈ పని చేయడం ప్రభుత్వానికి సాధ్యం కాదు,” అని నరసింహ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈ పరిస్థితి లో సర్వీసు రంగం లో పనిచేసేవారికి సామాజిక భద్రత, చిన్న సంస్థలకు నియమాలను సులభతరం చేయడం తో పాటు వారిని ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకు వస్తే వాళ్ళకు ఉద్యోగ రక్షణ కల్పించడం తో పాటు జీవనోపాధి కూడా కల్పించినట్టు అవుతుందని రిపోర్ట్ సూచించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ని మహిళలను ఈ రంగాలలోకి తేవడం అత్యవసరం. దీని కోసం సురక్షిత రవాణా, తక్కువ ఖర్చుతో పిల్లల సంరక్షణ, సులభతరమైన పని పరిస్థితులు, డిజిటల్ గా వారు శశక్తులుగా వుండటం అవసరం. ఏఐ వలన ఉద్యోగాల లో కలిగే మార్పుల వలన కార్మికులకు కొత్త నైపుణ్యాలు అవసరం. ఈ రంగాల లో అవకాశాలను కేవలం కొన్ని పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా చిన్న ద్వితీయ శ్రేణి నగరాలకు వీటిని విస్తరించాలి. యివి చేస్తే సర్విస్ రంగం కేవలం దిగువ స్థాయి తక్కువ జీతం కల్పించే రంగం గా కాకుండా కొత్త అవకాశాలకు వేదిక అయ్యి ఆర్థిక పురోగతికి ఇరుసు అవుతుంది అని ఈ నీతి ఆయోగ్ నివేదిక స్పస్టం చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో నూ యిదే రకమైన సమస్యలు వున్నాయి. ఆంధ్ర లో ద్వితీయ శ్రేణి పట్టణాల లో ఏఐ, ఆరోగ్య, లాజిస్టిక్స్, సృజనాత్మక పరిశ్రమలను పెంపొందించాలని నివేదిక పేర్కొంది. తెలంగాణ కూ యిదే రకమైన సూచనలను అది చేసింది.
సెస్ ప్రొఫెసర్ సి హెచ్ బాలరాములు మాట్లాడుతూ, “ప్రభుత్వం తాము కల్పించాల్సిన సేవల నుండి వెనక్కి తప్పుకుంటోంది. అది కేవలం వాటి కల్పనకు మార్గం సుగమం చేసేది గా మిగిలింది. బ్యూరోక్రసీ రాజకీయ నాయకుల మద్యన వున్న మిలాఖతు దీనికి కారణం. ప్రైవేట్ రంగం తో పాటు ప్రభుత్వం కూడా ఈ సేవలు యివ్వటం నుండి తప్పుకోరాదు. విద్య, రవాణా, హోటల్ రంగాలలో నియమాలను ప్రభుత్వం అమలు చేసేందుకు ఒక యంత్రాంగం వుండాలి.”