సర్పంచు ఎన్నికల్లో మందు కిక్కు తగ్గుతుందా!
లిక్కర్ కార్పొరేషన్ బకాయిలు పేరుకు పోవడంతో డిమాండ్ కు తగ్గట్టు సప్లై చేయలేమంటున్న లిక్కర్ ఇండస్ట్రీ
ఎన్నికలంటే మద్యం పండగ. లిక్కర్ ఎరులై పారటం సాధారణం. అందునా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దావత్ లేకుండ పూటగడవదు. మందు పోయడం క్యాండిడేట్ కు అనవాయితీ. తీసుకోవడం వోటర్ల బాధ్యత. దీనితో ఎన్నికల్లో లిక్కర్ డిమాండ్ బాగా పెరుగుతుంది. కాని ఈ సారి మందుబాబుల మజా నీరుగారనుంది. పెరిగిన డిమాండ్ కు తగ్గట్లు సప్లై చేసేందుకు వర్కింగ్ క్యాపిటల్ లేదంటున్నారు లిక్కర్ వ్యాపారులు.
ఇంత వరకు సప్లై చేసిన లిక్కర్ కంపెనీలకు యివ్వాల్సిన బకాయిలు పెరిగిపోవడంతో డిసెంబర్ లో సరఫరాలో సమస్యలు వుంటాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దీనితో ఎన్నికల సందర్భంగా మందు కొరత వచ్చి బాబులకు తగిన కిక్కు వచ్చేట్టుగా లేదు.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా 10 నుండి 15 శాతం లిక్కర్ అమ్మకాలు పెరుగనున్నాయి. రాష్ట్ర ప్రభత్వం లిక్కర్ కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలు మొదటి సారి నాలుగు వేల కోట్లను దాటి రు. 4,361 కోట్లకు చేరాయి. ఇది రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. పెరుగుతున్న ఈ బాకీల వలన తమ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని మద్యం పరిశ్రమలు నవంబర్ 2 వ తేదీన ఒక ప్రకటన ద్వారా తమ బాధను వెలిబుచ్చాయి.
రు. 3,366.21 కోట్లు ఇవ్వాలని ప్రకటన చేసిన తరువాత కేవలం రు. 200 కోట్లు విడుదల అయ్యాయి. ప్రస్తుత నెలలో సప్లై చేసిన మద్యం బకాయీ లెక్క వేసుకుంటే రావలసిన డబ్బు నాలుగు వేల కొట్లు దాటిపోతోంది. వీటిలో రు. 1,861 కోట్లు పోయిన ఏడాదివి కాగా ఈ ఏడు బాకీలు యిప్పటికే రు. 2,500 కోట్ల కు చేరాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) తమ వద్ద వున్న స్టాక్ అమ్ముడుపోయిన తరువాత 45 రోజులకు కంపెనీకి డబ్బు చెల్లిస్తుంది. సాధారణంగా మద్యం కంపెనీలు తమ స్టాక్ ను గోడౌన్ల లోకి పంపే సమయం లో 30 శాతం ఎక్సైజ్ డ్యూటి చెల్లించి పంపుతాయి. సరుకు అమ్ముడు పోయాక ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా దాని బేస్ ప్రైస్ (కార్పొరేషన్ కు మద్యం సరఫరా చేసి కంపెనీ కి మద్యన ఒప్పందం ప్రకారం యిచ్చే ధర) లో నుండి ఎక్సైజ్ డ్యూటి మినహాయించుకుని చెల్లిస్తారు. పేరుకు పోయిన బకాయిల వలన తాము ఆ 30 శాతం ఎక్సైజ్ డ్యూటి చెల్లించలేకపోతున్నామని పరిశ్రమ వర్గాలు చెప్పాయి.
రాష్ట్రం లో వున్న 2,620 మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువు ఈ నెల ఆఖరుతో ముగుస్తోంది. 2025-27 సంవత్సరానికి గాను మద్యం షాపుల టెండర్ల కోసం ప్రభుత్వం దరఖాస్తు రుసుమును రు. రెండు లక్షల నుండి ఈ సారి రూ మూడు లక్షలకు పెంచింది. అయినా 95,137 ధరఖాస్తులు అందాయి. వాటి నుంచి ఫీజు రూపంలో రు. 2,854 కోట్ల ఆదాయం సమకూరింది. 2023 లో 1,32,000 లైసెన్సు అప్లికేషన్స్ కు గాను రు. 2,640 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడు ధరఖాస్తులు తగ్గినా ఫీజు పెంచినందున ఆదాయం బాగా పెరిగింది.
డిసెంబర్ నెలలో కొత్త షాపు లైసెన్సు దారులు స్టాక్ పెట్టుకోవటానికి చేసే ప్రయత్నం వలన నెలవారీగా వుండే డిమాండ్ కంటే 1.75 రెట్లు పెరుగుతుందని ఈ డిమాండ్ కు తగిన సరఫరా చేయాలంటే తమకు బకాయిలు అందితీరాలని నవంబర్ రెండున యిచ్చిన ప్రకటన లో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ & వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISWAI), బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (CIABC) లు పేర్కొన్నాయి. నవంబర్ 10 లోపు తమకు ప్రభుత్వానికి ధరఖాస్తుల రూపంలో వచ్చిన ఫీజుల నుంచయినా బాకీ తీర్చాలని లేకపోతే డిసెంబర్ లో డిమాండ్ కు తగిన సరఫరా చేయలేమని ఈ సంస్థలు చెప్పాయి.
రాష్ట్రానికి లిక్కర్ ద్వారా సుమారు రు. 38,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది. తమ బకాయిలను చెల్లించకపోతే ఎదురయ్యే పరిణామాల వలన ఆల్కహాల్ అనుబంధంగా ఉన్న పరిశ్రమలు మూతపడటం, సరుకు రవాణా ఆగిపోవడం జరుగుతుంది. అది ఉద్యోగాల పైన ప్రభావం చూపుతుందని ఈ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే రాష్ట్ర బ్రాండ్ దెబ్బతినే అవకాశం వుందని, తద్వారా అన్నీ రంగాలలోనూ పెట్టుబడులను ఆకర్షించటం పైన ప్రభావం పడుతుందని ఈ వర్గాలు హెచ్చరిక చేస్తున్నాయి.
ఈ ఏడాది జనవరి లో కింగ్‌ఫిషర్ బ్రాండ్ బీరు తయారు చేసే యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ సంస్థ తమకు రావలసిన బకాయిలు యిచ్చే వరకు సరఫరా ఆపి వేస్తున్నట్టు ప్రకటన చేసి పెద్ద దుమారమే రేపింది. రాష్ట్రంలో బీర్ సరఫరా లో కింగ్ ఫిషర్ కు 70 శాతం వాటా వుండటం తో మార్కెట్ లో బీర్ ల కొరత ఏర్పడింది. రాష్ట్రం లిక్కర్ బేస్ ప్రైస్ ను 2019-20 నుండి పెంచలేదని ఆ సంస్థ జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి లకు యిచ్చిన సమాచారం లో తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం బీర్ ధరలను 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవటం తో ఈ వివాదానికి ఫిబ్రవరి లో తెరపడింది. ధరలను నిర్ణయించే కమిటీ గడువు ముగియటంతో వివాద పరిష్కారం ఆలస్యం అయ్యిందని ప్రభుత్వం వివరణ యిచ్చింది.