కేంద్ర సాయం కోసం కేంద్ర మంత్రుల వద్దకు రాష్ట్ర మంత్రులు

తెలంగాణలో వరద సహాయ పనులను ముమ్మరం చేశారు. ఒక వైపు రూ.200 కోట్లను విడుదల చేశారు.;

Update: 2025-09-03 03:35 GMT
వరదల వల్ల దెబ్బతిన్న రోడ్డు

తెలంగాణ రాష్ట్రంలో సంభవించిన వరద విపత్తు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వరద సహాయ పనుల కోసం సహాయం అందించాలని కోరేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు బుధవారం ఢిల్లీకి వెళ్లారు. భారీవర్షాలు, వరదలతో ఆస్తి, పంట నష్టం జరిగినందున కేంద్రం ఆదుకోవాలని కోరుతూ మంత్రులు బుధవారం ఢిల్లీలోని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లను రాష్ట్ర మంత్రులు కలవనున్నారు. కేంద్ర సాయంతోపాటు యూరియాను సరఫరా చేయాలని రాష్ట్ర మంత్రులు కేంద్రాన్ని కోరనున్నారు.


తీవ్ర ఆస్తి, పంట నష్టం
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 25 నుంచి 28వతేదీ వరకు నాలుగు రోజుల పాటు కురిసిన అతి భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. తెలంగాణలోని కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కుమరంభీం ఝసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వరదలతో అతలాకుతలం అయ్యాయి. వరద పీడిత జిల్లాల్లో పంట, ఆస్తి నష్టం సంభవించింది. వరదల ధాటికి రోడ్లు, వంతెనలు, కల్వర్టులు, విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. ఇటీవ‌ల కురిసిన భారీవ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో దెబ్బ‌తిన్న రోడ్లు, భ‌వ‌నాలు, చెరువులు, కుంట‌లకు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్ట‌డంతో పాటు విద్యుత్ స‌బ్ స్టేష‌న్ల పున‌ర్నిర్మాణం ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆదేశించారు.

వరద సహాయ పునరావాస పనుల కోసం రూ.200 కోట్లు
తెలంగాణలో వరద సహాయ, పునరుద్ధరణ,పునరావాస పనుల కోసం రాష్ట్రప్రభుత్వం రూ.200కోట్లను తాజాగా విడుదల చేసింది.దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, వంతెనలు వేయడం, విద్యుత్ పునరుద్ధరణ, వరద సహాయం, వరదల వల్ల ప్రభావితమైన ప్రజల పునరావాసం కోసం ఈ నిధులు వెచ్చించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.దీని కోసం తెలంగాణ రెవెన్యూ శాఖ జీఓ ఆర్టీ నంబరు 43తో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు రూ.5 కోట్లు ,తెలంగాణలోని నిర్మల్, మెదక్, కామారెడ్డి, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్ , రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రూ.10 కోట్ల ప్రత్యేక సహాయం అందించింది. వరదల్లో మరణించిన వారికి రూ.1.30కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

పరిహారం పెంపు
వరద విపత్తు లో ప్రాణ నష్టం సంభవిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. పశువులు చనిపోతే ఇచ్చే పరిహారాన్ని రూ.37,500 నుంచి రూ.50వేలకు పెంచారు. గొర్రెలు, మేకలకు ఇచ్చే నష్టపరిహారాన్ని రూ.4 వేల నుంచి రూ.5వేలకు పెంచాలని నిర్ణయించారు. తెలంగాణలోని కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కుమరంభీం ఝసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే 65 నుంచి 95 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మరో పది జిల్లాల్లో సాధారణం కంటే 25 నుంచి 65 శాతం అధిక వర్షాలు కురిశాయి.వరదల సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, పశువులు కోల్పోయిన కుటుంబాలకు తక్షణమే పరిహారం విడుదల చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రుల‌ను క‌లిసి నివేదికలను అంద‌జేశారు.వ‌ర‌ద‌ల‌ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 257 చెరువులు, కుంట‌ల‌కు గండి పడ్డాయి. చిన్న నీటి పారుద‌ల విభాగాన్ని పూర్తిగా నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని, ఆర్ఆర్ఆర్‌, ప్ర‌ధాన‌మంత్రి కృషి సంచాయ్ యోజ‌న‌, ఇత‌ర కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల‌ను వినియోగించుకొని చిన్న నీటి వ‌న‌రుల‌కు మ‌ర‌మ్మ‌తులు, పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

2.36 లక్షల ఎకరాల్లో పంట నష్టం
తెలంగాణ రాష్ట్రంలోని 82 మండ‌లాల్లో 2.36 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట న‌ష్టం వాటిల్లింద‌ని వ్య‌వ‌సాయ శాఖ అధికారులు రూపొందించిన ప్రాథమిక అంచనాలు రూపొందించారు.పంట నష్టంపై
స‌మ‌గ్ర నివేదిక కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. నీట మునిగిన స‌బ్ స్టేష‌న్ల స్థానంలో అధునాత‌న సామ‌గ్రి, సామ‌ర్థ్యంతో కూడిన స‌బ్ స్టేష‌న్లు ఏర్పాటు చేయాల‌ని విద్యుత్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిని ఆదేశించారు. ఆర్ అండ్ బీ, పంచాయ‌తీరాజ్, తాగునీటి స‌ర‌ఫ‌రా, ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ‌లు కూడా స‌మ‌గ్ర నివేదికలు రూపొందించాలని ఆదేశించారు.కామారెడ్డి, ఆదిలాబాద్‌, రాజ‌న్న సిరిసిల్ల‌, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడి అక్క‌డి ప‌రిస్థితుల‌పై ఆరా తీశారు.


Tags:    

Similar News