కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయలేదా?

కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ లీగల్ సెల్ పేర్కొంది.;

Update: 2025-01-15 12:07 GMT

ఫార్ములా ఈ-కార్ రేసు కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిందా? లేదా? అన్నది ప్రస్తుతం తెలంగాణలో బర్నింగ్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌నేతలు, మరికొన్ని మీడియా సంస్థలు సుప్రీంకోర్టుకు కేటీఆర్ పిటిషన్‌ను కొట్టివేసిందని చెప్తుండగా బీఆర్ఎస్ నేతలు, లీగల్ సెల్ ఇన్‌ఛార్జ్ సోమ భరత్ కుమార్ మాత్రం అవన్నీ తప్పుడు ప్రచారాలని తొసిపుచ్చుతున్నారు. క్వాష్ పిటిషన్‌ సుప్రీంకోర్టు కొట్టివేయలేదని, కేటీఆరే ఉపసంహరించుకున్నారని బీఆర్ఎస్ నేతలు వివరిస్తున్నారు. పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి, కోర్టు కొట్టేయడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని అంటున్నారు. క్వాష్ పిటిషన్‌పై ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని మాత్రం సర్వోన్నత న్యాయస్థానం తెలిపిందని వివరించారు. సుప్రీంకోర్టు సూచన మేరకు కేటీఆర్ లీగల్ సెల్ క్వాష్ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుందని వివరించారు. తమ నేతపై దాఖలు చేసే అక్రమ కేసులను తాము న్యాయబద్దంగానే ఎదుర్కొంటామని వివరించారు.

క్వాష్ పిటిషన్ దాఖలు చేసే నాటికి కేసు ఎఫ్ఐఆర్ దశలోనే ఉంది. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ విచారణ జరగడానికి ముందే ఈ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్ తన పూర్తి సహకారం అందించారు. దాదాపు ఏడున్న గంటల పాటు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బుధవారం కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన క్రమంలో కేసుకు సంబంధించిన అన్ని అంశాలను కేటీఆర్ లీగల్ సెల్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సర్వోన్నత న్యాయస్థానం సూచన మేరకు కేటీఆర్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. కానీ ఈ అంశాన్ని కావాలనే కాంగ్రెస్ నేతలు వక్రీకరిస్తున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్‌ఛార్జ్ సోమ భరత్ అన్నారు.

ఆధారాలు లేవని కోర్టు నమ్మింది: భరత్

‘‘ప్రపంచం మొత్తంలో 9 నగరాల్లో ఫార్ములా ఈ-కార్ రేసు జరుగుతోంది. వాటిలో భాగంగానే ఈ రేసును హైదరాబాద్‌లో కూడా నిర్వహించాం. హైదరాబాద్ ఇమేజ్ పెంచడం కోసం కేటీఆర్ ఆ ప్రయత్నం చేశారు. కానీ రాజకీయ కక్ష సాధింపు కోసం కేటీఆర్‌పై తప్పుడు కేసు బనాయించారు. ఈ కేసు విచారణను కేటీఆర్ ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఈ కేసులో క్రిమినల్ ఆధారాలు లేవని న్యాయస్థానం నమ్మింది. క్వాష్ పిటిషన్‌ను మేము విత్‌డ్రా చేసుకోవడం జరిగింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం, కొట్టేయడం రెండూ ఒకటి కాదు. వేరువేరు. కానీ కొందరు స్వలాభం కోసం ఈ కేసు అంశాలను వక్రీకరిస్తున్నారు’’ అని న్యాయవాది సోమ భరత్ కుమార్ వివరించారు.

Tags:    

Similar News