Revanth | రేవంత్ ప్రభుత్వానికి సుప్రింకోర్టు షాక్

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే నియమించిన రెండుఎంఎల్సీల నియామకాన్ని రద్దుచేసింది;

Update: 2025-08-13 13:20 GMT
Supre quashed MLC posts of Prof Kodanda Ram and Amir Ali Khan

ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వానికి సుప్రింకోర్టు పెద్ద షాకిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే నియమించిన రెండుఎంఎల్సీల నియామకాన్ని రద్దుచేసింది. బుధవారం జరిగిన విచారణలో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఇద్దరు ఎంఎల్సీలు ప్రొఫెసర్ కోదండరామ్(Professor Kodandaram), అమీర్ ఆలీ ఖాన్(Amir Ali Khan) పదవులు (MLCs quashed) రద్దుచేస్తున్నట్లు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17న చేపట్టేవరకు ఈఆదేశాలు అమల్లో ఉంటాయని చెప్పింది. విషయం ఏమిటంటే 2023 ఎన్నికలకు ముందు కేసీఆర్(KCR) ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎంఎల్సీలుగా నియమించింది. వీరి నియామకానికి ఆమోదం కోసం ఫైలును గవర్నర్ తమిళైసై(Tamil Isai) దగ్గరకు పంపారు. అయితే గవర్నర్ ఎంతకాలమైనా ఫైలుపై సంతకం పెట్టలేదు. అలాగని తిరస్కరించనూలేదు.

దాంతో వీళ్ళిద్దరి నియామకంపై గందరగోళం రేగింది. ఇంతలో ఎన్నికలు రావటం, బీఆర్ఎస్ ఓడిపోవటం అందరికీ తెలిసిందే. రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నర్ బీఆర్ఎస్ హయాంలో చేసిన నియామకాల ఫైలును తిప్పిపంపారు. వాళ్ళిద్దరి స్ధానాల్లో రేవంత్ ప్రభుత్వం కోదండరామ్, అమీర్ ను ప్రతిపాదించగా గవర్నర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దాంతో వీళ్ళిద్దరు ఎంఎల్సీలుగా ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. గవర్నర్ చర్యను ప్రశ్నిస్తు దాసోజు, సత్యనారాయాణ సుప్రింకోర్టులో సవాలు చేశారు. అప్పటినుండి అనేకసార్లు వాయిదాలుపడిన ఈ కేసులో సుప్రింకోర్టు బుధవారం విచారించింది. కోదండరామ్, అమీర్ నియమకాలను రద్దుచేస్తు తీర్పివ్వటం ప్రభుత్వంతో పాటు పార్టీలో సంచలనంగా మారింది.

తీర్పును ఊహించలేదు: అమీర్

గవర్నర్ కోటాలో నియమితులైన తమనియామకాలపై సుప్రింకోర్టు ఇలాంటి తీర్పిస్తుందని ఊహించలేదని అమీర్ ఆలీఖాన్ వ్యాఖ్యానించారు. తీర్పు కాపీని చదివిన తర్వాత కాని పూర్తిగా మాట్లాడలేనన్నారు. తీర్పుకాపీ అందిన తర్వాత న్యాయపోరాటం చేస్తానని మాత్రమే చెప్పారు.

గవర్నర్ ఎందుకు తిరస్కరించారు ?

గవర్నర్ కోటాలో చేసే నియామకాల్లో ఏదైనా రంగంలో సేవచేసిన వారిని లేదా నిష్ణాతులను నియమిస్తారు. అయితే ప్రస్తుత కాలమానం ప్రకారం ఈపద్దతిని ఎవరూ పాటించటంలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపాదించిన దాసోజు, సత్యనారాయణ పూర్తిస్ధాయి రాజకీయ నేతలు కాబట్టి వీళ్ళ నియామకంపై గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అయితే గవర్నర్ అభ్యంతరాలను కేసీఆర్, కేటీఆర్ తో పాటు ఇద్దరు నేతలు కొట్టిపారేశారు. తాము చాలా సంవత్సరాలుగా ప్రజాసేవలోనే ఉన్నామని వీళ్ళు వాదించారు. అయినా గవర్నర్ వీళ్ళ నియామకాలను ఆమోదించలేదు.

ఇంతవరకు బాగానే ఉందికాని సుప్రింకోర్టు తీర్పే ఇపుడు ఆశ్చర్యంగా ఉంది. అప్పట్లో గవర్నర్ వీళ్ళ నియామకాలను అడ్డుకున్నారు. తర్వాత ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన ఇద్దరి నియామకాలను ఇపుడు సుప్రింకోర్టు ఎందుకు కొట్టేసిందో అర్ధంకావటంలేదు. ఈఇద్దరి నియామకాలు చెల్లదని చెప్పటం వరకు ఓకేనే మరి బీఆర్ఎస్ హయాంలో జరిగిన నియామకాలపై ఇపుడు సుప్రింకోర్టు ఏమి చెప్పదలచుకున్నదో అర్ధంకావటంలేదు. సెప్టెంబర్ 17వ తేదీవరకు వెయిట్ చేస్తేకాని సుప్రింకోర్టు ఆలోచన ఏమిటో అర్ధంకాదు.


కాంగ్రెస్, బీజేపీకి చెంపపెట్టు : కేటీఆర్

సుప్రింకోర్టు కాంగ్రెస్, బీజేపీలకు చెంపపెట్టుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. రెండు ఢిల్లీ పార్టీలు రాజ్యాంగాన్ని ఏ విధంగా అపహాస్యం చేస్తున్నాయో సుప్రింకోర్టు తీర్పుతో అందరికీ అర్ధమైందన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా నియామకాలు చేసిన తమ ప్రభుత్వాన్ని అప్పటి గవర్నర్ చులకనచేసినట్లు మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్ధను అడ్డంపెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పట్టిందని గుర్తుచేశారు.

Tags:    

Similar News