డ్రైవింగ్ లైసెన్సుపై సుప్రింకోర్టు కీలక తీర్పు

లైట్ మోటారు వెహికల్(Light Motor Vehicle) డ్రైవింగ్ లైసెన్సు(Driving License)తోనే 7500 కిలోల లోపు బరువున్న ట్రాన్స్ పోర్టు వాహనాలను కూడా నడపవచ్చని స్పష్టమైన తీర్పిచ్చింది.

Update: 2024-11-06 11:50 GMT
Supreme court

డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించి సుప్రింకోర్టు ధర్మాసనం బుధవారం కీలకమైన తీర్పు ఇచ్చింది. లైట్ మోటారు వెహికల్(Light Motor Vehicle) (ఎల్ఎంవీ) డ్రైవింగ్ లైసెన్సు(Driving Licence)తోనే 7500 కిలోల లోపు బరువున్న ట్రాన్స్ పోర్టు వాహనాలను కూడా నడపవచ్చని స్పష్టమైన తీర్పిచ్చింది. ఎల్ఎంవీ వాహనాలంటే కార్లు, జీవులు మాత్రమే. అంతకుమించిన వాహనాలు అంటే మినీ ట్రక్కులు, మినీ బస్సులు, మినీ గూడ్స్ వాహనాలను నడిపేందుకు ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాన్స్ పోర్టు డిపార్టుమెంటు అధికారులు అంటే మోటార్ వెహికల్ ఇన్వెస్సెక్టర్లు(Motor vehicle Inspectors) లేదా పోలీసులు(Police) రోడ్డుమీద ఎక్కడబడితే అక్కడ వాహనాలను నిలిపేసి లైసెన్సులను చెక్ చేస్తున్న విషయం తెలిసిందే.

కార్లు, జీపుల్లాంటి ఫోర్ వీలర్లు నడిపేందుకు తీసుకున్న లైసెన్సులతోనే పైన చెప్పిన మినీ వాహనాలను నడుపుతుంటే రవాణాశాఖ, పోలీసు అధికారులు భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారు. నిజానికి ఫోర్ వీలర్(Four Wheelers) వాహనాలను నడపటానికి మినీ వాహనాలను నడపటానికి పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఇదే సమయంలో హెవీ వెహికల్స్ అంటే పెద్ద పెద్ద బస్సులు, లారీలు, ట్రక్కులు నడపకూడదనే స్పష్టమైన నిబంధనలున్నాయి. అయితే కొంతమంది లైట్ మోటారు వాహనాల డ్రైవింగ్ కు తీసుకున్న లైసెన్సులతోనే హెవీ వెహికల్స్ నడిపిస్తు ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనలున్నాయి. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సులతో మినీ వాహనాలను నడపటానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ రెండు రకాల వాహనాలు నడపటంలో పెద్దగా తేడా కూడా ఏమీ ఉండదు.

అయినా సరే రవాణాశాఖ, పోలీసు అధికారులు మాత్రం పట్టుకుంటే భారీ జరిమానాలు విధిస్తున్నారు. ఈ విషయంపైనే తాజాగా సుప్రింకోర్టు తీర్పిచ్చింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్(Chief Justice DY Chandra Chud) నేతృత్వంలో జస్టిస్ హృషీకేస్ రాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిథాల్, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారించిన కేసులోనే పై తీర్పిచ్చింది. 7500 కిలోలలోపు బరువున్న వాహనాలను నడిపేందుకు డ్రైవర్లకు ప్రత్యేకమైన లైసెన్సు తీసుకోవాల్సిన అవసరంలేదని స్పష్టంగా చెప్పింది. లైట్ మోటారు వాహనాల డ్రైవింగ్ లైసెన్సులతోనే కొందరు రవాణా వాహనాలను నడపటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలను ధర్మాసనం కొట్టేసింది. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పింది. ఆరోపణలకు ఆధారంగా ఎలాంటి డేటా కూడా లేదన్నది. సుప్రింకోర్టు తాజా తీర్పు కొన్ని వేలమంది డ్రైవర్లకు ఊరటనిస్తుంది అనటంలో సందేహంలేదు. అయితే సుప్రికోర్టు తాజా తీర్పును రవాణాశాఖ, పోలీసు అధికారులు పట్టించుకుంటారా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News