కశ్మీర్ ఉగ్రదాడి పాకిస్థాన్ పనే.. ఆందోళన తెలుపుతున్న బీజేపీ ఎంపీలు
ఉగ్రదాడి ముమ్మాటికీ పాకిస్థాన్ పనేనని ఆరోపించారు. కశ్మీర్‌లో పర్యాటకుల వర్గం పేరు అడిగి మరీ వారిని హతమార్చడాన్ని బీజేపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు.;
జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై తెలంగాణ బీజేపీ ఎంపీలు ఘాటుగా స్పందించారు. ఈ ఉగ్రదాడి ముమ్మాటికీ పాకిస్థాన్ పనేనని ఆరోపించారు. కశ్మీర్‌లో పర్యాటకుల వర్గం పేరు అడిగి మరీ వారిని హతమార్చడాన్ని బీజేపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను సభ్యసమాజం ఖండిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను వ్యతిరేకిస్తూ తెలంగాణ బీజేపీ నేతలు ట్యాక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు బీజేపీ ఆదుకుంటుందని చెప్పారు. పాకిస్థాన్‌లో అసమర్థ పాలన ఉందని, అందుకే ఆ దేశం దుర్భరపరిస్థితులను ఎదుర్కొంటోందని అన్నారు. అదే సమయంలో భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే చూడలేకనే ఈ ఉగ్రదాడిని పాకిస్థాన్ ప్లాన్ చేసిందని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత్‌లో కల్లోల పరిస్థితులు సృష్టించాలని పాకిస్థాన్ ప్రణాళికలు సిద్ధం చేసిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఆందోళన సందర్బంగా ఎంపీ లక్ష్మన్ స్పందిస్తూ.. పాకిస్థాన్ ఉగ్రదేశంగా ప్రకటించడం ఖాయమని అన్నారు. ‘‘భారతదేశ అభివృద్ధిని చూడలేక పాకిస్థాన్ ఈ పన్నాగం పన్నింది. భారత్‌ను దొంగ దెబ్బ తీసింది. కశ్మీర్ సంస్కృతిని కాపాడటానికి మోదీ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి పాకిస్థాన్ చేసిన కుట్రే కశ్మీర్ ఉగ్రదాడి. పాక్ ఈ ఉగ్రవాద చర్యలను మానుకోకపోతే ప్రపంచ దేశాలు పాక్‌ను ఉగ్రదేశంగా ప్రకటించడం ఖాయం. పాక్ లో ఉన్న ఉగ్రవాదులను ఏరి వేయాలి. బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఘాతుకం జరిగినప్పుడు నిన్న నేను శ్రీనగర్‌లో ఉన్నాను. పాక్ దొంగ దెబ్బలు దేశ ప్రజలంతా ఖండించాలి’’ అని పేర్కొన్నారు.