రేవంత్ తెలివికి మెచ్చుకోవాల్సిందే

ముఖ్యమంత్రికి ధైర్యం ఎక్కువే. తర్వాత ఏమి జరుగుతుందో అన్నది అనవసరం. జనాలను ఆకట్టుకోవటానికి ఏమి మాట్లాడాలన్నదే రేవంత్ కు ముఖ్యం

Update: 2024-03-26 13:41 GMT
revanth in chevella meeting

ముఖ్యమంత్రికి ధైర్యం ఎక్కువే. తర్వాత ఏమి జరుగుతుందో అన్నది అనవసరం. జనాలను ఆకట్టుకోవటానికి ఏమి మాట్లాడాలన్నదే రేవంత్ కు ముఖ్యం. ఇదే పద్దతిలో చేవెళ్ళ అభ్యర్ధి రంజిత్ రెడ్డితో పాటు పార్టీ ఆఫీసులో లోకల్ నేతలతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతు రాబోయే పార్లమెంటు ఎన్నికలు తన వందరోజుల పరిపాలనకు రెఫరెండమన్నారు. ఇది చాలా తెలివిగాచేసిన ప్రకటనగానే చూడాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం పనితీరు వందరోజుల్లో తెలియాలంటే కష్టమే. కనీసం ఆరుమాసాలు అయితే కాని ప్రభుత్వ శాఖల్లో ఏమి జరుగుతోందో కూడా ముఖ్యమంత్రి, మంత్రులకు తెలియదు.

అలాంటిది వందరోజుల పరిపాలనను తన పరిపాలనా తీరుకు రెఫరెండమని రేవంత్ ఎందుకు చెప్పినట్లు ? ఇక్కడే రేవంత్ తెలివంతా ఉంది. ఎలాగంటే అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే సిక్స్ గ్యారెంటీస్ అమలుచేస్తామని హామీలిచ్చారు. చెప్పినట్లుగా వందరోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలుచేయలేకపోయారు. అయితే ఇచ్చిన ఆరుహామీల్లో నాలుగింటిని అమల్లోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీ పరిదిని రు. 10 లక్షలకు పెంచటం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన పేదలకు నెలకు 200 విద్యుత్ ఉచితం, రు. 500కే నాలుగు గ్యాస్ సిలిండర్ల సరఫరా హామీలను అమల్లోకి తెచ్చారు. రైతుభరోసా, ఉద్యోగాల భర్తీ హామీలు ఇంకా అమల్లోకి రాలేదు. ఇవికాకుండా మరికొన్ని హామీలు కూడా ఉన్నాయి కాని అవంతా అంత తొందరగా అమల్లోకి వచ్చేవికావు. కొన్ని ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీచేస్తోంది.

ఇక్కడ విషయం ఏమిటంటే జనాలు బాగా కనెక్టయ్యే నాలుగు హామీలను 100 రోజుల్లోనే అమల్లోకి తెచ్చేశారు. ఇదే సమయంలో మిగిలిన రెండుహామీల అమలు ఆలస్యానికి కేసీయార్ ప్రభుత్వం మీద ఆరోపణల దాడిచేస్తున్నారు. రేవంత్ తో పాటు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతు తమ ప్రభుత్వానికి చిప్పచేతికిచ్చినట్లు పలుసందర్భాల్లో ఆరోపించారు. ఖజనాలో రూపాయిలేకపోగా రు. 7 లక్షల కోట్ల అప్పులను తమ ప్రభుత్వంమీద మోపినట్లు పదేపదే చెబుతున్నారు. ఇటువంటి పరిస్ధితుల్లో తామిచ్చిన హామీలను అమలుచేయలేదని అడిగే నైతిక హక్కు కేసీయార్ అండ్ కో కు లేదని ఎదురుదాడులు చేస్తున్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేయాలంటే ఏడాదికి సుమారు రు. 1.53 లక్షల కోట్లు అవసరమని బడ్జెట్లో ప్రభుత్వమే చెప్పింది. కాని బడ్జెట్లో కేటాయించింది మాత్రం కేవలం రు. 54 వేల కోట్లు మాత్రమే. మరి బడ్జెట్ కేటాయింపుల్లోనే లక్ష కోట్లను కోతపెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు హామీలను ఎలా నెరవేర్చగలదు ? అందుకనే ముందుగా నాలుగు హామీలను అమల్లోకి తెచ్చేసి మిగిలిన రెండు హామీల అమలుకు మార్గాలను వెతుకుతోంది. అయితే ముఖ్యమంత్రి సీటులో కూర్చున్న దగ్గర నుండి రేవంత్ జనాలతో కలసిపోవటం, రెగ్యులర్ గా సచివాలయానికి వస్తుండటం, ప్రజాదర్బార్ కార్యక్రమం పెట్టి జనాలను కలిసి సమస్యలు తెలుసుకోవటం లాంటి వ్యూహాలతో జనాల్లో పాజిటివ్ ఇమేజి తెచ్చుకున్నారు.

అందుకనే రేవంత్ ప్రభుత్వంపై జనాల్లో పాజిటివ్ టాక్ నడుస్తోంది. సిక్స్ గ్యారెంటీస్ విషయమై బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా జనాలు పెద్దగా పట్టించుకోవటంలేదు. ఈ విషయాలపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నారు కాబట్టే రాబోయే పార్లమెంటు ఎన్నికలు తన వందరోజుల పాలనకు రెఫరెండమని ధైర్యంగా ప్రకటించారు.

Similar News