సాగులేని భూముల్లో ఆదాయానికి దేవాదాయ శాఖ మాస్టర్ ప్లాన్స్ రెడీ
ఎన్నో ఏళ్ళ నుంచి సాగుచేయని భూముల నుంచి ఆదాయం తెచ్చుకునే మార్గాన్ని తెలంగాణ దేవాదాయ శాఖ అన్వేషించింది. ఆదాయంతోపాటు, వాటిని కాపాడుకోడానికి కీలక నిర్ణయం తీసుకుంది.
ఎన్నో ఏళ్ళ నుంచి నీరు లేక సాగు చేయని భూముల నుంచి ఆదాయం తెచ్చుకునే మార్గాన్ని తెలంగాణ దేవాదాయ శాఖ అన్వేషించింది. ఆదాయంతోపాటు, ఆ భూములను కాపాడుకోడానికి కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సాగులేని భూముల్లో ఆదాయానికి దేవాదాయ శాఖ మాస్టర్ ప్లాన్స్ రచిస్తోంది. ఆ భూముల్లో సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికోసం తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (TGREDCO) నుంచి సహాయం తీసుకోనుంది. ఈ నిర్ణయంతో అటు ఆదాయంతోపాటు, వివాదాల్లో ఉన్న, ఆక్రమణలో ఉన్న దేవాదాయ భూములను కాపాడుకోనుంది.
దేవాదాయశాఖకు రాష్ట్రంలో 15 వేల ఎకరాల భూముల్లో 1,100ఎకరాల భూములు ఆక్రమణల్లో ఉన్నాయి. మరో 2వేల ఎకరాలను లీజుకు ఇవ్వగా, 700 ఎకరాల భూమి వివాదాల్లో ఉంది. మిగతా భూముల్లో సాగుకి నోచుకోని, రాబోయే 5 నుంచి 10 ఏళ్ల వరకు వాటితో అవసరం లేని, భూ ధరలు ఎక్కువగా ఉండి.. ఆక్రమణలకు ఆస్కారం ఉన్న వాటిని క్రమంగా సౌర విద్యుదుత్పత్తికి వినియోగించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. సిద్ధిపేట, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోని 22 దేవాలయాలకు సంబంధించి సాగు చేయని 720 ఎకరాల భూముల్లో సోలార్ పవర్ జనరేషన్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్లాన్స్ రెడీ చేసింది. ఫస్ట్ ఫేజ్లో 230 ఎకరాల్లో యూనిట్లను ప్రారంభించడానికి కసరత్తు చేస్తోంది.
పెద్దగా ఖర్చు లేకుండా ఆదాయం...
అయితే 230 ఎకరాల్లో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడమంటే మామూలు విషయం కాదు. బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. కానీ మంచి క్వాలిటీ ప్యానల్స్ ఏర్పాటు చేస్తే దాదాపు పాతికేళ్ల వరకు ఇబ్బంది లేకుండా పని చేస్తాయి. ఇక ఇవి ఏర్పాటు చేసిన ఐదేళ్ళలో పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగొచ్చేస్తుంది. ఆ తర్వాత లాభాలు తెచ్చిపెడుతుంది. ఇక్కడ ఇంకో విశేషమేమంటే ఈ సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి దేవాదాయ శాఖ మీద పెద్దగా భారం పడదు. వీటిని ఏర్పాటు చేసేందుకు టీజీరెడ్కో సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థల నుంచి పర్మిషన్స్ తీసుకోవడం, నెట్ మీటర్ల ఖర్చుల వరకు దేవదాయ శాఖ భరించాల్సి ఉంటుంది. సోలార్ జనరేషన్ యూనిట్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చు రెడ్కో అరేంజ్ చేయనుంది. యూనిట్లు ఏర్పాటయ్యాక వచ్చే ఆదాయంలో దేవాదాయ శాఖ, రెడ్కో సంస్థకి వాటాలు ఉండనున్నాయి.
సోలార్ తోపాటు ఇతర మార్గాలు...
సాగుకి నోచుకోని భూములు, హైవేలకు ఆనుకుని ఉన్న స్థలాల ద్వారా అడిషనల్ ఇన్కమ్ రాబట్టే దిశగా దేవాదాయశాఖ ఆలోచనలు చేస్తోంది. రాకపోకలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో కల్యాణ మండపాలు నిర్మించాలని, హైవేల పక్కనే ఉన్న భూముల్లో పెట్రోల్ బంకులను నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జైళ్లశాఖ, పోలీసు విభాగం, ఆర్టీసీ కూడా ఖాళీగా ఉన్న తమ స్థలాల్లో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసి, ఎలాంటి నష్టాలు లేకుండా అదనపు ఆదాయాన్ని రాబడుతున్నాయి. ఈ సంస్థల బాటలోనే దేవాదాయ శాఖ కూడా అదనపు ఆదాయ మార్గాల కోసం ప్రణాళికలు రచిస్తోంది.