‘ఇకపై తెలంగాణ భవన్ కాదు.. జనతా గ్యారేజ్’

ఇచ్చట అన్ని సమస్యలకు సలహాలు, సహాయం అందించబడును.

Update: 2025-09-22 12:04 GMT

రీజినల్ రింగ్ రోడ్డు(RRR) బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ విషయంలో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారాయన. నల్గొండ, సూర్యపేట జిల్లాల్లోని ఆర్ఆర్ఆర్ బాధితులతో కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే వారికి బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని, న్యాయపరమైన సలహాలు కూడా అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ‘‘ఇకపై ఇది తెలంగాణ భవన్ కాదు.. జనతా గ్యారేజ్.. ఇక్కడికి మీరు ఎప్పుడయినా రావొచ్చు. మీ సమస్యలు చెప్పి న్యాయవాదుల నుంచి సలహాలు, సూచనలు, సహాయం పొందవచ్చు’’ అని వెల్లడించారు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ సమస్య పరిష్కారం కాకపోతే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.

అప్పుడే మీ సమస్య ఢిల్లీకి వెళ్తుంది..

‘‘స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తేనే మీ సమస్య ఢిల్లీకి చేరుతుంది. లేదంటే వీళ్ల కబుర్లలో కొట్టుకుపోతుంది. అసెంబ్లీలో మాకు మైక్ ఇస్తలేరు. పది నిమిషాలు మైక్ మాకు ఇవ్వాలన్న ప్రభుత్వం గజగజలాడుతోంది. కత్తి వాళ్ల చేతిలో పెట్టి.. మమ్మల్ని యుద్ధం చేయమంటున్నారు. కాంగ్రెస్ నేతల భూముల నుంచి రోడ్లు వెళ్లకుండా అలైన్‌మెంట్‌లో మార్పులు తీసుకురావడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు వేసినప్పుడు కూడా వాళ్ల భూముల్లోకి రోడ్డు రాకూడదని రోడ్డును అనేక వంకర్లు తిప్పారు. గతంలో ఓఆర్ఆర్‌కు భూసేకరణ సమయంలో భూమికి బదులు భూమి ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వల్ల భూమి కోల్పోతున్న రైతులు తమ భూమికి బదులు భూమిని కోరవచ్చు. అందుకోసం పోరాటం కూడా చేయొచ్చు’’ అని తెలిపారు.

ఉద్యమం చేద్దాం..

‘‘గతంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ కట్టేటప్పుడు ఆందోళనలు కాలేదా అని అడుగుతున్నారు. కాలేదని మేమంటున్నామా. అవును అయినాయి.. అప్పుడు కేసీఆర్ ఏం చేశారు. మంత్రులు, అధికారులతో గంటల తరబడి చర్చించారు. బాధితులను పిలుచుకుని మాట్లాడారు. రోజులు రోజులు చర్చలు చేసి.. ఒప్పించి, మెప్పించి వాళ్లకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి. అవసరమైతే ఫ్లాట్ ఇచ్చి, ఇల్లు ఇచ్చి.. మీ భూములకు ధరలు పెరుగుతాయని చెప్పి సంజాయించి. కాళ్లు పట్టుకునే తలకాయ కడుపులో పెట్టుకునో ఒప్పించారు. ఆఖరికి ప్రాజెక్ట్ చేసుకున్నాం. మరి వీళ్లు ఏం చేస్తున్నారు. మొఖం చాటేస్తే అయిపోతుందా?’’ అని ప్రశ్నించారు.

బాధితులు చేయాల్సిన డిమాండ్లు ఇవే..

ఈ సందర్భంగానే ఆర్ఆర్ఆర్ బాధితులు మూడు డిమాండ్లు చేయాలని కేటీఆర్ సూచించారు. అవేంటంటే.. 

1) అలైన్‌మెంట్ శాస్త్రీయంగా చేయడం. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. 

2) నష్టపరిహారం సమంజసంగా ఇవ్వండి. బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది, ఎస్‌ఆర్‌లో మరొకటి ఉంది. ఇప్పుడు ఇస్తున్నది సరిపోదు. కాబట్టి మానవతా కోణంలో ఆలోచించి సరైన పరిహారం అందించండి.

మీ పోరాటానికి రాజ్యసభలో, శాసనసభలో, బహిరంగ వేదికల్లో ఎక్కడికి అయినా మేము వచ్చి మద్దతుగా నిలుస్తామని కేటీఆర్ చెప్పారు. న్యాయం జరిగే వరకు మీతో కలిసి నడుస్తామని భరోసా ఇచ్చారు. ఏది ఏమైనా ఐకమత్యాన్ని పోగొట్టుకోవద్దని సూచించారు. 

Tags:    

Similar News