KTR | కేటీఆర్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి హానికరమా..!

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను ఉద్దేశించి సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.

Update: 2024-11-28 11:02 GMT

సిరిసిల్ల జిల్లా కలెక్టర్(Sircilla Collector) సందీప్‌కుమార్ ఝాను ఉద్దేశించి సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం(IPS Community) తీవ్రంగా ఖండించింది. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే హానికరమని వ్యాఖ్యానించింది. ఒక సివిల్ సర్వెంట్‌ను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సదరు ఉద్యోగి నిబద్దతను, విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి నిరాధార ఆరోపణలు బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తాయని తెలిపింది. పాలనా విధానాలు, రాజ్యాంగ నిబద్దత ఆధారంగా సివిల్ సర్వెంట్స్ నిర్వర్తించే బాధ్యతలకు కేటీఆర్ మాటలు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది.

‘‘ప్రజాసేవలో అధికారి విధులను నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా, ఎటువంటి భయాందోళనలు లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, ఊహించని ఇటువంటి నిరాధార ఆరోపణలు బాధ్యతారాహిత్యమైనవి. ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఈ సందర్భంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు పూర్తి మద్దతు తెలియజేస్తుంది. సివిల్ సర్వీసు అధికారుల గౌరవం, స్వతంత్రత, నిష్పక్షపాతత్వాన్ని కాపాడటానికి మేము అండగా నిలబడతాం. కలెక్టర్ విధి నిర్వహణ సామర్థ్యాన్ని దెబ్బతీయడంతో పాటు, పాలన పట్ల ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయి. అందువల్ల, ఇటువంటి నిరాధార ఆరోపణలను వెంటనే నిలిపివేయాలని, వ్యవస్థల గౌరవాన్ని, రాజ్యాంగం ద్వారా కల్పించిన న్యాయబద్ధతను గౌరవించే విధంగా వ్యవహరించాలని తెలంగాణ ఐపిఎస్ అధికారుల సంఘం పిలుపునిస్తోంది’’ అని పేర్కొంది. అంతేకాకుండా తన వ్యాఖ్యలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని కూడా సంఘం కోరింది.

ఇంతకీ కేటీఆర్ ఏమన్నారంటే..

నవంబర్ 25న సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్.. ఆ జిల్లా కలెక్టర్‌ను ఉద్దేశించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక కాంగ్రెస్ కార్యకర్తను తీసుకొచ్చి కలెక్టర్‌గా కూర్చోబెట్టారన్నారు. ‘‘ఇటువంటి సన్నాసిని కలెక్టర్‌గా తీసుకొచ్చి కక్షపూరిత రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తోందీ కాంగ్రెస్ సర్కార్. మీరు రాసి పెట్టుకోండి. నేను అంత మంచివాడిని కాదని అందరికీ తెలుసు. అతి చేస్తున్న కలెక్టర్, అధికారులు, బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవారు అందరూ ఒక ఒక విషయం గుర్తుంచుకోవాలి.. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి కాదు.. వాళ్ల జేజెమ్మ వచ్చినా బీఆర్ఎస్‌ను ఏం చేయలేదు. కలెక్టర్లు, పోలీసులతో ఎన్ని రోజులు డ్రామాలు చేస్తారో చూస్తాం. బీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను అక్రమ కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని ఆరోపించారు కేటీఆర్.

Tags:    

Similar News