ఎంఎల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం ?
పోటీచేస్తే ఎలాగుంటుంది ? పోటీకి దూరంగా ఉంటే ఎదురయ్యే సమస్యలు ఏమిటనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతోంది.;
తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో పోటీ విషయంపై బీఆర్ఎస్ కు దిక్కుతోచటంలేదు. పోటీచేస్తే ఎలాగుంటుంది ? పోటీకి దూరంగా ఉంటే ఎదురయ్యే సమస్యలు ఏమిటనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. తెలంగాణ(Telangana)లోని గ్రాడ్యుయేట్, టీచర్, స్ధానికసంస్ధల కోటాలో మూడు స్ధానాలను భర్తీచేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్ణయించింది. ఇందులో టీచర్, గ్రాడ్యుయేట్ స్ధానాలకు మరో 15 రోజుల్లో నోటిఫికేషన్ జారీకి ఎన్నికల కమిషన్ ఇప్పటికే సంకేతాలుఇచ్చింది. స్ధానికసంస్ధల ఎన్నికలు జరిగిన తర్వాత ఈ కోటాలో భర్తీచేయాల్సిన ఎంఎల్సీ సీట్లను భర్తీ చేస్తుంది. మార్చిలో ఖాళీ అవబోతున్న గ్రాడ్యుయేట్, టీచర్ ఎంఎల్సీ స్ధానాల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ అవబోతోంది.
పై రెండు కోటాల్లో భర్తీ చేయబోయే రెండుసీట్లను గెలుచుకునేందుకు కాంగ్రెస్(Congress), బీజేపీలు ఇప్పటికే పెద్దఎత్తున కసరత్తులు చేస్తున్నాయి. బీజేపీ(BJP) అభ్యర్ధులను కూడా ఎంపికచేసి పార్టీలో పరిచయకార్యక్రమం కూడా మొదలుపెట్టేసింది. అభ్యర్ధులను పరిచయం చేయటంకోసమే నాంపల్లిలోని పార్టీఆఫీసులో కేంద్రమంత్రి, పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishanreddy) కీలకమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మరో కేంద్రమంత్రి బండిసంజయ్(Bandi Sanjay), పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, పార్టీ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. సీనియర్ నేతలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు ఎంఎల్సీల అభ్యర్ధులను జిల్లాల్లోతిప్పి పరిచయంతో పాటు ప్రచారం చేయబోతున్నారు.
అలాగే, కాంగ్రెస్ కూడా అభ్యర్ధుల ఎంపికకు అవసరమైన కసరత్తులు చేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma) ఆధ్వర్యంలో ఇప్పటికే కొన్ని సమావేశాలు జరిగాయి. ఆశావహుల నుండి దరఖాస్తులను తీసుకుని వడపోత కార్యక్రమం మొదలుపెట్టింది. అభ్యర్ధుల ఎంపికలో ఆయాజిల్లాల్లోని ఎంఎల్ఏలు, ఎంపీలు, జిల్లాల అధ్యక్షులు, సీనియర్ నేతలు అభిప్రాయాలను ఇప్పటికే సేకరించింది. జాబితాను షార్ట్ లిస్టుచేసి రేవంత్(Revanth)s ఆమోదంతో ఏఐసీసీ(AICC)కి పంపటమే మిగిలుంది. ఆశావహులు ఎవరిస్ధాయిలో వాళ్ళు టికెట్ల కోసం ఢిల్లీలో ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు. అభ్యర్ధుల ప్రకటనలో బీజేపీకన్నా వెనకబడున్నా అధికారంలో ఉండటం కాంగ్రెస్ కు అతిపెద్ద అడ్వాంటేజ్. ఒకసారి అభ్యర్ధుల ప్రకటన జరిగితే వెంటనే అందరుకలిసి ప్రచారంలోకి దిగేస్తారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధులగెలుపును దృష్టిలో పెట్టుకునే రేవంత్ తో పాటు మంత్రులంతా జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
పై రెండుపార్టీలు అభ్యర్ధుల ఎంపిక, గెలుపు కోసం అంత విస్తృతంగా కసరత్తు చేస్తుంటే బీఆర్ఎస్ లో మాత్రం ఆ చాయలు పెద్దగా కనబడటంలేదు. గ్రాడ్యుయేట్, టీచర్ల సీట్లకు పోటీచేయబోయే అభ్యర్ధులపై పార్టీఆఫీసులో ఇంతవరకు ఒక్క మీటింగ్ కూడా జరగలేదు. పోటీచేసే విషయంలో నేతల్లో అసలు హడావుడి కూడా కనబడటంలేదు. ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశ్యమే ఉంటే ఈపాటికే జిల్లాలవారీగా ఓటర్ల జాబితా, నియోజకవర్గాల వారీగా సమీక్షలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో భేటీలు జరిగుండాల్సింది. పార్టీలో అలాంటి సంకేతాలు ఏమీ కనబడటంలేదు. పోనీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించిందా అంటే ఆ విషయంలో కూడా ఎంఎల్ఏలు, సీనియర్ నేతలకు సమాచారం లేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను బట్టి నేతలే ఎవరికివారుగా ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లుగా అనుకుంటున్నారు.
కారణం ఏమిటి ?
పోటీచేసే విషయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా సర్వేలు చేయించుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఆసర్వేలో గెలుపుఅవకాశాలు తక్కువగా ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయని తెలిసింది. గ్రాడ్యేయేట్ నియోజకవర్గం మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించుంది. రెండుటీచర్ల నియోజకవర్గాలు మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ తో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండలో విస్తరించుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పై జిల్లాల్లో బీఆర్ఎస్ కు చుక్కెదురైంది. పైగా గ్రాడ్యుయేట్ సీటు గెలుపులో కాంగ్రెస్ కు అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది. ఎందుకంటే గడచిన 14 నెలల్లో రేవంత్ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీచేయటంతో పాటు గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూలు, ఉద్యోగాల భర్తీ ప్రశాంతంగా జరిగిపోయింది. దీంతో నిరుద్యోగుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై సానుకూలత ఉన్నట్లు సర్వేలో బయటపడిందని సమాచారం.
గెలుపు అవకాశాలు తక్కువగా ఉండటంతో పాటు ఒకవేళ అభ్యర్ధులు గెలిచినా ఎంతకాలం బీఆర్ఎస్ లోనే ఉంటారనే విషయంలో కేసీఆర్(KCR) కు అనుమానాలున్నాయని సమాచారం. ఆర్ధికభారం, ప్రచారంలో సమస్యలు, నేతల్లో సమన్వయం సాధించటం కష్టమని కూడా కేసీఆర్ అనుకుంటున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి అనేక అంశాలు, సమస్యలను దృష్టిలో పెట్టుకునే ఎంఎల్సీ ఎన్నికల పోటీకి దూరంగా ఉంటే బాగుటుందన్నది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. మరీ విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తారా ? లేకపోతే జనాల్లో రేవంత్ ప్రభుత్వంపై ఆగ్రహం పెరిగిపోతోందని ప్రతిరోజు గోలగోల చేస్తున్నారు కాబట్టి పోటీకి దిగుతారా అన్నది చూడాలి.