Telangana MLC Polls | తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
తెలంగాణలో త్వరలో జరగనునున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులను బీజేపీ శుక్రవారం ప్రకటించింది.;
By : The Federal
Update: 2025-01-10 14:10 GMT
రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రముఖ విద్యావేత్త మల్కా కొమరయ్య, పారిశ్రామికవేత్త సి.అంజి రెడ్డితో సహా ముగ్గురు అభ్యర్థుల పేర్లను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు.బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా సూచనలను అనుసరించి ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేశామని కిషన్ రెడ్డి చెప్పారు.
- కరీంనగర్-నిజామాబాద్ ఆదిలాబాద్-మెదక్ అనే ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మల్కా కొమరయ్య, కరీంనగర్-నిజామాబాద్ ఆదిలాబాద్-మెదక్ అనే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి సి అంజి రెడ్డి, నల్గొండ-వరంగల్-ఖమ్మం అనే ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పులి సరోత్తం రెడ్డి పేరును బీజేపీ ప్రకటించింది.
విద్యాసంస్థల అధిపతి కొమరయ్య
మల్కా కొమరయ్య కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి నివాసి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బి.ఇ. చదివిన తర్వాత పాఠశాలలను స్థాపించారు. ఈయన పెద్దపల్లి, నిర్మల్, హైదరాబాద్‌లో విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్‌గా ఉన్నారు.విద్యా సంస్థల నిర్వాహకుడిగా,విద్యావేత్తగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేశారు.
పారిశ్రామికవేత్త అంజిరెడ్డి
గ్రాడ్యుయేట్ అయిన అంజి రెడ్డి మెదక్ జిల్లాలోని రామచంద్రపురం నివాసి. ఈయన విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. ఆయన భార్య గోదావరి అంజి రెడ్డి ప్రస్తుతం బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.బంజారాహిల్స్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో వైకుంఠ ఏకాదశి వేడుకలను అంజి రెడ్డి గత రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. ఎస్ఆర్ ట్రస్ట్ ను నెలకొల్పి పేదలకు విద్యా అవకాశాలను పెంచడంతో పాటు గ్రామాల్లో తాగునీటిని అందించడానికి కృషి చేశారు.
ఉపాధ్యాయుడిగా సరోత్తం రెడ్డి సేవలు...
వరంగల్ జిల్లాకు చెందిన సరోత్తం రెడ్డి 21 సంవత్సరాలకు పైగా స్కూల్ అసిస్టెంట్‌గా, 10 సంవత్సరాలకు పైగా ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన 2012 నుంచి 2019 వ సంవత్సరం వరకు పీఆర్‌టియూ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఉపాధ్యాయుల జేఏసీలో భాగంగా ప్రత్యేక తెలంగాణ ఆందోళనలో ఆయన చాలా చురుకుగా పనిచేశారు.
విజయీభవ!
— BJP Telangana (@BJP4Telangana) January 10, 2025
తెలంగాణ శాసన మండలి ఎన్నికలలో పోటీ చేయనున్న బిజెపి అభ్యర్థులు. pic.twitter.com/U2FJ0JicMh