హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారే పరిస్థితి కన్పిస్తోంది. ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉండనుంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్, బీజేపీల్లోకి నేతల వలసలు పెరుగుతుండడం దీనికి అద్ధం పడుతోంది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, అందులో కాంగ్రెస్ అన్ని నియోజకవర్గాలు గెలవాలని, బీజేపీ కనీసం 12 నియోజకవర్గాలైనా గెలవాలని లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. అయితే దానిని సాధించేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఇతర పార్టీల నుంచి ప్రధానంగా బీఆర్ఎస్ నేతల వలసలు ప్రోత్సహిస్తున్నారు. ఈ వలస రాజకీయాలు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే నాలుగు నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. జహీరాబాద్‌కు సురేష్ కుమార్ షెట్కార్, మహబూబ్‌నగర్‌కు చల్లా వంశీచంద్ రెడ్డి, నల్గొండకు కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్‌కు పోరిక బలరాంనాయక్‌ను అభ్యర్థులుగా కాంగ్రెస్ మొదటి జాబితాలో అవకాశం కల్పించింది. ఇదే సమయంలో బీజేపీ సైతం ఖమ్మం, వరంగల్ మినహా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. గోడం నగేష్‌ను ఆదిలాబాద్, గోమాస శ్రీనివాస్‌ను పెద్దపల్లికి, అజ్మీరా సీతారాంనాయక్‌ను మహబూబాబాద్, నల్గొండకు శానంపూడి సైదిరెడ్డిని అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. బిజెపి ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో ఎక్కువమంది ఇతర పార్టీలనుంచి వలసవచ్చినవారే కావడం గమనార్హం.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు, ముగ్గురు లీడర్లు సైతం లోక్‌సభ ఎన్నికలలో అవకాశం పొందనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. మరొకవైపు బీఆర్ఎస్ కూడా ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గానికి నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్‌కు మాలోతు కవిత, కరీంనగర్‌కు బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్, మహబూబ్‌నగర్‌కు మన్నేశ్రీనివాస్ రెడ్డి, నిజామాబాదుకు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, చేవెళ్లకు కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్‌కు కడియం కావ్యను అభ్యర్థులుగా ప్రకటించింది. వీరి అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నాయకుల సైతం పెదవి విరుస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో మొత్తం 17 నియోజకవర్గాలకు గాను 9 స్థానాలు బీఆర్ఎస్, 3 స్థానాలు కాంగ్రెస్, 4 స్థానాలు బీజేపీ, ఒక స్థానం ఎంఐఎం గెలుపొందాయి. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల విజయ అవకాశాలపై ప్రభావం చూపుతుందనడంలో సందేహంలేదు. రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ మాట్లాడుతూ.. ‘శాసనసభ ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణాలోని ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదు. రాజకీయ నాయకుల వలసలు కూడా పార్టీలపై అనుకూల, ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది" అని అభిప్రాయపడ్డారు.
కవిత అరెస్ట్ బీఆర్ఎస్‌కు కలిసొస్తుందా?
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఆ పార్టీ పట్ల ఎంత వరకు సానుభూతిని క్రియేట్ చేస్తుందనేది ప్రశ్నార్ధకమే. కవిత అరెస్ట్ తరువాత జరిగిన నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు. తెలంగాణ జాగృతి ద్వారా మహిళల పండుగ బతుకమ్మను రాష్ట్రవ్యాప్తంగా కవిత నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె అరెస్ట్ తరువాత మహిళల నుంచి ఊహించిన స్థాయిలో మద్దతు లభించినట్లు లేదు. దీనికి ప్రధాన కారణం ఆమె లిక్కర్ కుంభకోణం కేసులో ఇరుక్కోవడమేనని చెప్పాలి.
ప్రతికూల వాతావరణ పరిస్థితులు కాంగ్రెస్ దెబ్బ తీస్తాయా ?
ప్రస్తుతం తెలంగాణలోని ప్రతికూల వాతావరణ పరిస్థితులు కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బ తీస్తాయా..? అంటే తీయబోవనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయ్యింది. సాగు నీటి సదుపాయం లేక.. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు వేసిన పంటకు ఎండిపోయే దశకు చేరాయి. ఎన్నికల హామీగా పంటనష్టం ప్రకటించి లోక్‌సభ ఎన్నికల్లో రైతులు నుంచి ఎలాంటి ప్రతికూల పరిస్థితిని ఎదురుకాకుండా జాగ్రత్తపడాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్లు గాంధీభవన్ వర్గాల ద్వారా తెలిసింది.
కవిత అరెస్ట్ బీజేపీకి ఎన్నికల్లో లభిస్తుందా ?
కవిత అరెస్ట్ ద్వారా బీఆర్ఎస్‌తో తనకు అంతర్గతంగా కూడా ఎలాంటి స్నేహం, అవగాహన లేదని బీజేపీ అధిష్ఠానం సరైన సమయంలో సంకేతాలను పంపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేీకి పెద్ద దెబ్బ పడిందనే అభిప్రాయం తెలంగాణ బీజేపీ నేతల్లో ఉంది. ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దలకు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అనేకసార్లు విన్నవించారు. కవిత అరెస్ట్‌తో బీఆర్ఎస్ వ్యతిరేఖ ఓట్లను కొంతమేర పంచుకోవచ్చనే అభిప్రాయం బీజేపీ నాయకుల్లో బలంగా ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఇది ఎంతవరకు నిజం అవుతుందో చెప్పాలంటే.. ఎన్నికల ఫలితాలు వరకు వేచిచూడాల్సిందే.