ఓయూ క్యాంపస్ లో టెన్షన్ టెన్షన్

ముందుజాగ్రత్తగా పోలీసులు క్యాంపస్(OU Campus) లో పెద్దఎత్తున మోహరించారు;

Update: 2025-08-25 05:55 GMT
Revanth and Osmania University

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో టెన్షన్ పెరిగిపోతోంది. యూనివర్సిటీలో కార్యక్రమాలకు అటెండ్ అయ్యేందుకు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) సోమవారం హాజరవబోతున్నారు. రేవంత్ కార్యక్రమాలను కొందరు విద్యార్ధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకనే ముందుజాగ్రత్తగా పోలీసులు క్యాంపస్(OU Campus) లో పెద్దఎత్తున మోహరించారు. యూనివర్సిటి పరిసరాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఓయూ మార్గంలో రెంరడువైపులా పోలీసులు కంచెలను ఏర్పాటుచేశారు. రు. 80 కోట్లతో 1200 మంది విద్యార్ధుల వసతి కోసం నిర్మించిన హాస్టల్ భవనాన్ని రేవంత్ ప్రారంభించబోతున్నారు. అలాగే గిరిజన విద్యార్ధులకోసం రెండుహాస్టల్ భవనాలనిర్మాణాలకు శంకుస్ధాపన చేయబోతున్నారు. తర్వాత విద్యార్దులను ఉద్దేశించి ఠాగూర్ ఆడిటోరియంలో ప్రసంగిస్తారు. రీసెర్చి ఫెలోషిప్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు.

ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ ఓయూ క్యాంపస్ లో పర్యటించటం ఇదే మొదటిసారి. గతంలో పదేళ్ళు అధికారంలో ఉన్నా కేసీఆర్ ఒక్కసారి కూడా ఓయూ క్యాంపస్ లో పర్యటించలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్ధులది చాలా కీలకమైన పాత్ర. ఉద్యోగాల భర్తీ, గ్రూపు ఉద్యోగాల కోసం ప్రవేశపరీక్షల నిర్వహణలో చిన్నలోపం తలెత్తినా విద్యార్ధులు భయంకరంగా రియాక్టవుతున్నారు. ఈకారణాలతోనే కేసీఆర్ ఓయూ క్యాంపస్ లోకి అడుగుపెట్టిందే లేదు. ఇలాంటినేపధ్యంలో రేవంత్ ఈరోజు పలుకార్యక్రమాల్లో హాజరవబోతున్నారు.

ముందుజాగ్రత్తగా పోలీసులు ఓయూ క్యాంపస్ లోని ఆర్ట్స్ కాలేజీ గేటును మూసేశారు. ఆందోళనచేస్తున్న విద్యార్దుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. క్యాంపస్ లో నిరంతరం పోలీసులు పహారా కాస్తున్నారు. రేవంత్ ప్రభుత్వ వైఖరిని, పోలీసుల చర్యలపై బీఆర్ఎస్ ఎంఎల్ఏ తన్నీరు హరీష్ రావు మండిపడుతు ట్వీట్ చేశారు. విద్యార్దులపై ఆంక్షలు సరికాదన్నారు.

Tags:    

Similar News